బోనులో ఉన్న నిందితుడు.. తీర్పుచెప్పే జడ్జిలపై బురద జల్లడమా!

ABN , First Publish Date - 2020-10-12T09:10:27+05:30 IST

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సీఎం జగన్‌ లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించా

బోనులో ఉన్న నిందితుడు.. తీర్పుచెప్పే జడ్జిలపై బురద జల్లడమా!

జగన్‌కు రాజ్యాంగంపై నమ్మకం లేదు: యనమల


అమరావతి, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సీఎం జగన్‌ లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించా రు. సీబీఐ వేసిన 12చార్జిషీట్లు, ఈడీ వే సిన 5 చార్జిషీట్లలోనూ ఏ1గా ఉన్న జగన్‌ సాక్షాత్తూ సీజేకు లేఖ రాయడం దెయ్యాలు వేదాలు వల్లించడమేనన్నారు. ఈ మేరకు ఆదివారమిక్కడ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఒకవైపు పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాస్తూ, మరోవైపు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ...రూల్‌ ఆఫ్‌ లాను అడుగడుగునా ఉల్లంఘిస్తూ...రాజ్యాంగంపై చేసిన ప్రమాణాలను తుంగలో తొక్కుతూ...మళ్లీ అదే రాజ్యాంగం, ప్రజాస్వామ్యం గురించి నీతిపన్నా లు వల్లించడం జగన్‌కే చెల్లింది.


కోర్టు బోనులో ఉండే వ్యక్తి.. తీర్పు చెప్పే న్యాయమూర్తులపై బురదజల్లడం దుస్సాహసమే. జగన్‌ కేసులన్నీ త్వరలోనే విచారణకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దిగువస్థాయి న్యాయవ్యవస్థను బెదిరించేందుకు రాసిన లేఖ కాదా ఇది? రాజధానికి భూములిచ్చిన రైతులకు తీరని అన్యాయం చేసేలా ఉన్న సీఆర్‌డీఏ రద్దు నిర్ణయంపై స్టే ఇవ్వడం తప్పా? పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులు పెండింగ్‌లో ఉండగా పరిపాలనా కార్యాలయాలను తరలించడాన్ని అడ్డుకోవడం తప్పా? మాతృభాషలో విద్యాబోధన జరగాలని విద్యాహక్కు చట్టం చెప్తుంటే మాతృభాషలో బోధనను దూరం చేసే నిర్ణయాన్ని స్టే చేయడం తప్పా? ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగుల్ని తొలగించాలని తీర్పివ్వడం తప్పా? 74 ఏళ్ల స్వాతంత్య్ర చరిత్రలో ఏ రాజకీయ పార్టీ అయినా తమ రంగుల్ని ప్రభుత్వ భవనాలకు వేసిందా? 15అడుగుల లోతు ముంపు భూము ల్ని పేదలకు ఇళ్లస్థలాలుగా ఇవ్వాలనుకోవడాన్ని ఆపడం తప్పా? వరదల్లో ఆ స్థలాలు మనిషి లోతు నీటిలో మునగడం వాస్తవం కాదా? 17నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రజావ్యతిరేక చర్యల్లో కొన్నింటిపై హైకోర్టు స్టే ఇచ్చింది. మరికొన్నింటిని కొట్టేసింది.


అది సహజం గా న్యాయవ్యవస్థలో జరిగే ప్రక్రియే. దానిని సహించలేక న్యాయస్థానాలనే టార్గెట్‌ చేయడం దుస్సాహాసమే. జగన్‌కు రాజ్యాంగంపై నమ్మకం లేదు. తాను పట్టిందానికి మూడేకాళ్లు అనే తత్త్వం. ఏసీబీ ఉండేది సీఎం చెప్పుచేతల్లోనే. మంత్రివర్గ ఉపసంఘంలో ఉండేది వాళ్ల మంత్రులే. వాళ్ల నిర్ణయాల వల్ల జరిగే అన్యాయంపై న్యాయస్థానానికి వెళ్తే స్టే వచ్చింది. దానిపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు కూడా వెళ్లింది. అక్కడ పెండింగ్‌లో ఉండగానే సీజేకే లేఖ రాయడం జగన్‌ మహా కుట్రలో భాగమే. మీ నిర్ణయాలను కోర్టులు తప్పుబడితే...కోర్టులనే తప్పుబడుతూ లేఖ రాస్తారా? దీనివెనుక ఎవరెవరున్నారు. ఇందులో మాజీ న్యాయమూర్తి, ప్రభుత్వ సలహాదారుతో పాటు ఏ1, ఏ2 నిందితులంతా ఉన్నారు. న్యాయవ్యవస్థనే అప్రదిష్ట పాలు చేసే కుట్ర ఇది. తన నిర్ణయాలపై నమ్మకముంటే పైకోర్టులకు అప్పీలుకు వెళ్లొచ్చు కదా! కొన్నింటిపై ఇప్పటికే వెళ్లారు కదా! అక్కడ తీర్పులు వచ్చేవరకు వేచిచూసే సహనం లేదా?’ అని యనమల ప్రశ్నించారు.

Updated Date - 2020-10-12T09:10:27+05:30 IST