30 ఏళ్ల అప్పులు.. ఒక్క ఏడాదిలో!
ABN , First Publish Date - 2020-07-27T07:55:49+05:30 IST
అప్పులకు హద్దు, అదుపు లేకుండా సీఎం జగన్ పాలన ఉందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు.

క్రెడిట్ రేటింగ్ దారుణం.. జీఎస్‌డీపీ, అప్పుల నిష్పత్తి 34.6ు
అప్పులకు ఇప్పటికైనా బ్రేకులు వేయండి: యనమల
అమరావతి, జూలై 26(ఆంధ్రజ్యోతి): అప్పులకు హద్దు, అదుపు లేకుండా సీఎం జగన్ పాలన ఉందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. ‘‘సమాజంలో కుటుంబాలకు, ప్రభుత్వాలకు అప్పులు కొత్త కాదు. రాష్ట్ర 64 ఏళ్ల చరిత్రలో 1956 నుంచి ప్రభుత్వాలు అప్పులు చేస్తూనే వచ్చాయి. 2019-20నాటికి వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పుతో సహా ఏపీ అప్పులు రూ.3,04,500 కోట్లకు చేరాయి. 64 ఏళ్లలో అప్పులంటే.. ఏడాదికి సగటున రూ.5 వేల కోట్లు. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ హయాంలో ఐదేళ్లలో ఏడాదికి సగటున రూ.26 వేల కోట్ల అప్పుంది. అదే వైసీపీ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే రూ.70 వేల కోట్ల అప్పులు తెచ్చింది. ఇవన్నీ బడ్జెట్‌లో ప్రభుత్వం చెప్పిన లెక్కలే. అంటే, వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏటా రూ.70 వేల కోట్ల చొప్పున రూ.3,50,000 కోట్ల రుణభారం రాష్ట్రంపై మోపుతున్నారు.
పాత అప్పుల్ని కూడా కలిపితే మొత్తం అప్పులు రూ.6,54,500 కోట్లకు చేరతాయి. ఈ ఒక్క ఏడాదిలో వైసీపీ చేసిన అప్పు రాష్ట్రం 30 ఏళ్లలో చేసిన అప్పులకు సమానం. వైసీపీ ఐదేళ్ల పాలనలో చేసే అప్పులు.. మొత్తం 64 ఏళ్ల రాష్ట్ర అప్పులకు సమానం కానున్నాయి. చరిత్రలో లేనంత అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకుపోతోంది. కనీవినీ ఎరగని ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోనుందని అనేందుకు సంకేతం. ఇప్పుడు అప్పుల్లో అసలు, వడ్డీలకు ఏటా రూ.50 వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. వైసీపీ పాలన చివరినాటికి అసలు, వడ్డీ చెల్లింపులకు ఏటా రూ.లక్ష కోట్లు చెల్లించాల్సి వస్తుంది’’ అని యనమల వివరించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 14 నెలల్లో రాష్ట్రానికి వాటిల్లిన నష్టానికి జగన్‌దే బాధ్యతని పేర్కొన్నారు. సమాజంలో సంపద సృష్టించలేని వ్యక్తులకు దాన్ని నాశనం చేసే హక్కులేదన్నారు. ‘‘ఇప్పుడు తాజాగా విదేశీ ట్రస్టుల నుంచి ఇంకా అప్పులు తెస్తామంటున్నారు. ఇలాంటి దివాలా తీసే చర్యలను ఆపేయాలి’’ అని యనమల డిమాండ్ చేశారు.
క్రెడిట్ రేటింగ్ దారుణం
విపరీతంగా అప్పులు చేయడం వల్ల, కేవలం అప్పుల మీదే ఆధారపడడం వల్ల ఏపీ క్రెడిట్ రేటింగ్ దారుణంగా పడిపోతోందని యనమల ఆందోళన వ్యక్తం చేశారు. ఇకపై ఏపీకి అప్పు కూడా దొరకని దుస్థితి ఏర్పడుతుందన్నారు. అటు అభివృద్ది పనులు ఆపేసి, ఇటు పేదల సంక్షేమం అటకెక్కి రాష్ట్రం దివాలా తీయడం ఖాయమన్నారు. ‘‘ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన నాలుగు డీఏలు ఇవ్వకపోగా, కరోనా నెపంతో జీతాల్లో సగం కోత పెట్టారు. ఆఫ్ బడ్జెట్ అప్పులు రూ.49 వేల కోట్లు తెచ్చారు. వీటన్నింటికీ ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. అప్పులకు అధికంగా హామీ ఇచ్చిన రాష్ట్రాల్లో ఏపీ దేశంలోనే నాలుగో స్థానంలో ఉంది. జీఎస్‌డీపీ, అప్పుల నిష్పత్తి 34.6 శాతానికి పెరిగిపోయింది. అత్యధిక అప్పులున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ ఆరోస్థానంలో ఉంది’’ అని పేర్కొన్నారు. కరోనాకు ముందే తిరోగమన వృద్ధిరేటు నెలకొందని తెలిపారు. కరోనా తర్వాత ఇది రెండు, మూడు రెట్లు పెరిగిపోయి రాష్ట్రంలో తిరోగమన వృద్ధిరేటు మరింత పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రివర్స్ టెండరింగ్‌లకు తోడుగా రివర్స్ గ్రోత్ రేట్ తెచ్చిన ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు.