గవర్నర్‌ ప్రసంగంలో రాజధాని మార్పు ఉండకూడదు: యనమల

ABN , First Publish Date - 2020-03-23T10:04:10+05:30 IST

గవర్నర్‌ రాష్ట్రానికి రాజ్యాంగాధిపతి అని.. బడ్జెట్‌ సమావేశాల ప్రసంగంలో ఆయన కొన్ని అంశాలు తొలగించవచ్చని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు

గవర్నర్‌ ప్రసంగంలో రాజధాని మార్పు ఉండకూడదు: యనమల

అమరావతి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): గవర్నర్‌ రాష్ట్రానికి రాజ్యాంగాధిపతి అని.. బడ్జెట్‌ సమావేశాల ప్రసంగంలో ఆయన కొన్ని అంశాలు తొలగించవచ్చని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఉన్న రాజధాని మార్పువంటి అంశాలను తన ప్రసంగంలో లేకుండా గవర్నర్‌ చూసుకోవాలని సూచించారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ చేసే ప్రసంగంలో తనదైన మార్పులు చేసుకోవడానికి సర్వాధికారాలు ఉన్నాయన్నారు. గతంలో కూడా ఇలాంటి మార్పులు పలు సందర్భాల్లో జరిగాయని పేర్కొన్నారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలన్నది నిబంధన అని, అదే ప్రకారం నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గవర్నర్‌ కూడా దానికి అనుగుణంగానే ఉభయసభల సమావేశానికి ఆదేశాలివ్వాలని సూచించారు. పంచాయతీరాజ్‌ చట్టం ఆర్డినెన్స్‌, కరోనా వైర్‌స-ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం, రాజధాని అమరావతి నుంచి మార్పు. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ల తగ్గింపు, శాసనమండలి రద్దు, ప్రతిపక్షాలకు బెదిరింపులు, అభివృద్ధి కార్యక్రమాల్లో స్తబ్దత, సంక్షేమ పథకాల్లో కోత, పెట్టుబడులు తరలిపోవడం, యువతకు ఉద్యోగాల కల్పన లేకపోవడం తదితర అంశాలపై ఉభయసభల్లో చర్చించాల్సి ఉందన్నారు.

Updated Date - 2020-03-23T10:04:10+05:30 IST