వర్షాలతో తడిసిముద్దైన యానాం

ABN , First Publish Date - 2020-10-13T16:29:24+05:30 IST

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గం తడిసి ముద్దైంది.

వర్షాలతో తడిసిముద్దైన యానాం

యానాం: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గం తడిసి ముద్దైంది. వాయుగుండం ప్రభావంతో గత మూడు రోజులుగా యానాం ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ప్రభావంతో యానాం నియోజకవర్గంలోని ప్రధాన రహదారులన్నీ నీటమునిగాయి. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో చిన్నపాటి వర్షంతోనే యానాంలో డ్రైనేజీలు పొంగిపొర్లుతుండగా.. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో డ్రైనేజీలు పొంగిపొర్లి ప్రధాన రహదారులన్నీ మోకాలు లోతు నీటితో ప్రవహిస్తున్నాయి. వర్షాల ప్రభావంతో అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు  యానాం ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు అధికారులతో సమీక్షించి సూచనలు చేస్తున్నారు.


ముఖ్యంగా పిల్లరాయ వీధి, స్టేట్ బ్యాంక్ సెంటర్, అన్యం గార్డెన్స్, జిక్రీయ నగర్‌తో పాటు నియోజకవర్గంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. అదే విధంగా పిల్లరాయ  స్వామి ఆలయంతో పాటు యానాం పోలీస్ స్టేషన్లోకి నీరు చేరింది. అదనంగా సుముఖ వీరేశ్వర రైస్ మిల్ నీటమునిగి రైస్ మిల్‌లోని ధాన్యం నీట మునగడంతో లక్షల మేర ఆస్తి నష్టం సంభవించింది. మెట్టకురులోని  చక్కెల మిల్లు గోడ పడిపోవడంతో అటు రాకపోకలు నిలిచిపోయాయి. డ్రైనేజీ వ్యవస్థను చక్కదిద్దేందుకు యానాం వృద్ధాశ్రమం పారిశుధ్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. యానాం  పరిపాలన శివరాజ్ మీనా, మున్సిపల్ కమిషనర్ గౌరీ సరోజ ఏర్పాట్లను  పర్యవేక్షిస్తున్నారు.

Updated Date - 2020-10-13T16:29:24+05:30 IST