రాసింది నా గురించే..
ABN , First Publish Date - 2020-04-21T10:23:05+05:30 IST
కర్నూలు జిల్లాలో కరోనా కేసులు పెరగడానికి కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నూ లు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ ఎట్టకేలకు స్పందించారు. ‘ఆంధ్రజ్యోతి’లో

‘ఆంధ్రజ్యోతి’ కథనంపై ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ స్పందన
అవన్నీ ఆరోపణలేనని ఆక్షేపణ
నిరూపిస్తే రాజీనామా చేస్తానని ప్రకటన
కర్నూలు, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో కరోనా కేసులు పెరగడానికి కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నూ లు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ ఎట్టకేలకు స్పందించారు. ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనం తన గురించేనని చెప్పారు. అయితే, తనకూ ఆ ఆరోపణలకు సంబంధమేమీ లేదని సోమవారం వివరణ ఇచ్చారు. తబ్లీగీ జమాత్ సభ్యులను క్వారంటైన్‌కు తరలించకుండా తాను అడ్డుకున్నానని వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. నిజమని నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాలు విసిరారు. మర్కజ్ కేసులను తరలించడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులు, నాయకుల కారణంగా కర్నూలు జిల్లాలో పాజిటివ్ కేసులు పెరిగాయని రెండ్రోజుల క్రితం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురించింది. ఈ ఆరోపణలపై విచారణకు ఆదేశించాలని హఫీజ్ కోరారు. ‘కేఎం ఆస్పత్రి వైద్యుడికి, నాకు సంబంధం లేదు. ఆ వైద్యుడు ఏ పార్టీ నాయకుడో, ఎవరికి స్నేహితుడో ప్రజలందరికీ తెలుసు. క్వారంటైన్‌కు వెళ్లకుండా నేను ఎవ్వరినీ ఆపలేదు. క్వారంటైన్లో సదుపాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకే వెళ్లాను. నిరాధారమైన ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హోంమంత్రి, డీజీపీలకు ఫిర్యాదు చేస్తా’ అన్నారు.
ఎమ్మెల్యేది పసలేని వాదన!
కాగా, రాయలసీమ యూనివర్సిటీలోని వ్యక్తులను ఎమ్మెల్యే కలుసుకున్నారు. వారి గదుల్లోకి వెళ్లి వారి పడకలపై కూర్చొని సంభాషించారు. వారిలో చాలామందిని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం వారిలో పాజిటివ్ కేసులు వెలుగు చూడటంతో ఆయన కొన్నాళ్లు ఇంటికే పరిమితమయ్యారు. పరీక్షలు చేయించుకోవాలని అధికారులు ఎన్నోమార్లు కోరినా, ఖాతరు చేయలేదు. తర్వాత మారు పేరుతో పరీక్షలు చేయించుకున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. వాటిని నిజం చేస్తూ తనకు నెగెటివ్ రిపోర్టులు వచ్చాయంటూ తన సొంత లెటర్ హెడ్‌పై ఎమ్మెల్యే ఓ డిక్లరేషన్ విడుదల చేసుకున్నారు. కరోనా పరీక్ష ఫలితాలు వచ్చిన ఎలాంటి సర్టిఫికెట్లనూ ఆయన విడుదల చేయలేదు. అయినా, నిరూపిస్తే రాజీనామా చేస్తానంటున్న ఎమ్మెల్యే వాదనల్లో పసలేదని ప్రజలు పెదవివిరుస్తున్నారు. పైగా, ఆ ప్రైవేట్ వైద్యుడి ఆస్పత్రిలో ఓపీలు జరిగాయని కలెక్టర్ ఇటీవలే పరోక్షంగా అంగీకరించారు. ఆ ఆస్పత్రిలో చికిత్సలు, పరీక్షలు చేయుంచుకున్నవారు వెంటనే కరోనా పరీక్షలకు హాజరు కావాలంటూ పత్రికలు, మైక్‌ల ద్వారా ప్రకటనలు కూడా చేశారు. వాటిని నిజం చేస్తూ వైద్యుడు మరణించిన రోజే గద్వాల్ జిల్లాలో రెండు, పత్తికొండ నియోజకవర్గంలో ఒక కేసును స్థానిక అధికారులు గుర్తించారు.