వర్క్ ఫ్రమ్ సొంతూరు!
ABN , First Publish Date - 2020-07-27T08:21:07+05:30 IST
పండక్కో పబ్బానికో ఊరికి వచ్చి పోయే వాళ్లు! రెండు రోజులు సెలవు పెట్టి ఇంటికి చేరుకోవడానికి తహతహలాడే వారు! ఇప్పుడు మూడు నెలలుగా సొంతూరే ..

పల్లె వాతావరణంలో సాఫ్ట్‌వేర్ విధులు
ఖాళీ దొరికితేఉత్సాహంగా పొలంబాట
గోవులకు మేతేస్తూ వాటి సంరక్షణ
ఆటవిడుపులో సామాజిక కార్యక్రమాలు
చక్కటి ప్లానింగ్‌తో ఆదాయానికీ దారులు
లాక్‌డౌన్‌లో పనిపోయి పక్షులను పెంచిఆదాయాన్ని పొందుతున్న యువకుడు
పండక్కో పబ్బానికో ఊరికి వచ్చి పోయే వాళ్లు! రెండు రోజులు సెలవు పెట్టి ఇంటికి చేరుకోవడానికి తహతహలాడే వారు! ఇప్పుడు మూడు నెలలుగా సొంతూరే కార్యక్షేత్రం! ఉద్యోగానికి ఇల్లే వేదిక! అమ్మ చేతి వంట తినడం, సాయంత్రం స్నేహితులతో సరదాగా గడపడం, కుదిరితే నాన్నతోపాటు పొలం పనులు చేయడం! ఇది కరోనా వెనుక ఉన్న కొత్త కోణం! హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల్లోని దాదాపు అన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీలు అత్యధిక శాతం ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోం’ ఇచ్చేశాయి. కొన్ని కంపెనీలు డిసెంబరు వరకు ఇదే పరిస్థితని సంకేతాలిచ్చేశాయి. దీంతో ఉద్యోగం కోసం ఆయా నగరాల్లో ఉంటున్న వారు, మరీ ముఖ్యంగా పెళ్లికానివారు పెట్టే బేడా సర్దుకుని సొంతూళ్లకు వచ్చేశారు. దీంతో పల్లెల్లో ల్యాప్‌టా్‌పలు పట్టుకుని తిరిగే కుర్రకారు జోరు పెరిగింది. షార్ట్స్, టీ షర్టులతో పొలంలోకి దిగి పనులు చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం ఉండి ‘వర్క్ ఫ్రమ్ హోమ్’లకు హ్యాపీయే! దురదృష్టవశాత్తూ కరోనా మహమ్మారి కొందరి కొలువులనూ కాటేస్తోంది. వీరిలో పలువురు సొంత ఊరిలోనే కొత్త ఉపాధి మార్గాలను ఎంచుకుంటున్నారు.
మామిడిపై మనసు పడి..
కెనడా నుంచి వచ్చిన ప్రతాప్ 4 నెలలుగా కర్నూలు జిల్లా ఆదోనిలోని తన ఇంటికే పరిమితమయ్యారు. ఒక బహుళజాతి సంస్థలో పనిచేస్తూ లక్షల్లో జీతం తీసుకునే ఈ యువకుడు ఇంటి పట్టునే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. సొంతూరు ఎలా అనిపిస్తోందని పలకరిస్తే.. పరాయి గడ్డ కన్నా సొంతూరే పదిలమని ప్రతాప్ సమాధానమిచ్చారు. ఎక్కడో ఉండి ఇంట్లో వాళ్లను వీడియో కాల్స్‌లో పలకరించుకునే స్థితి తప్పింది. కలిసి భోజనం చేస్తున్నానని తెలిపారు. ఖాళీ దొరికితే ప్రతాప్ తమ మామిడి తోటల్లోనే గడుపుతున్నారు. మామిడి పంటను చాలా దగ్గర నుంచి చూస్తూ.. కూలీల దినసరి, ఏ రకం మామిడికి ఎంత దిగుబడి, పండించడానికి అవసరమైన విధానాలు, రైతుల కష్టాలు ఇలా ఎన్నో విషయాలను తెలుసుకోగలుగుతున్నానని చెప్పారు.
కౌజులు ఆదుకున్నాయి..
ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వైదనకు చెందిన నాగిశెట్టి నాగరాజు బీటెక్ చదివారు. ఫ్యారీవేర్ అనే చిన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించారు. గుజరాత్‌లో ఆరేళ్లు పనిచేసి, ఈ ఏడాదే చెన్నై వచ్చారు. కానీ కరోనా చెన్నైను చుట్టుముట్టింది. అప్పటికి ఆయన ప్రాజెక్టు కూడా పూర్తయింది. కొంతకాలం ఇంటి దగ్గరే ఉండాలని నాగరాజుకు కంపెనీ సూచించింది. దీంతో కొద్దినెలల క్రితం ఆయన వైదనకు వచ్చారు. ఉద్యోగం లేదు. పోషణకు దారి వెతుక్కోవాలి. స్నేహితులతో కలిసి చక్కగా జీవితాన్ని ప్లాన్ చేసుకొన్నారు. ఇంటిపట్టునే పక్షుల పెంపకం మొదలుపెట్టారు. కొద్ది పెట్టుబడితో నాటుకోళ్లు, కౌజుపిట్టలను తెచ్చి పెంచుతున్నారు. ఆశించినదానికన్నా ఈ పనిలో ఆదాయం ఎక్కువగా ఉన్నదని నాగరాజు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
చేల గట్లపై సొల్యూషన్..
కడప జిల్లా మైలవరం మండలం రేగడిపల్లె గ్రామానికి చెందిన మహేశ్ బెంగళూరులో, రాజశేఖర్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనిచేస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వీరిద్దరూ నాలుగు నెలల క్రితం రేగడిపల్లె వచ్చేశారు. ప్రశాంతమైన పచ్చని పొలాల చెంత సాఫ్ట్‌వేర్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంటి వద్ద సిగ్నల్స్ రాకపోవడంతో ఎక్కువగా పొలాల్లోనే గడుపుతున్నారు. అక్కడే మంచం వేసుకొని, ల్యాప్‌టా్‌పలు ముందేసుకొని పనిచేసుకొంటున్నారు. నగర జీవితానికి అలవాటు పడ్డ తమలో పల్లె వాతావరణం కొత్త జోష్ నింపిందని చెబుతున్నారు.
వెలితిని మరిపించే అనుభూతి
కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన శేషమ్ సుహంత్ కోల్‌కతాలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగి. అక్కడ పాజిటివ్ కేసులు ఎక్కువవడంతో కంపెనీ తమ ఉద్యోగులను వారి స్వస్థలాలకు పంపించివేసింది. ఏప్రిల్ నుంచి వర్క్‌ఫ్రం హోమ్ పెట్టారు. దేశీయ విమానాలు తిరగడం మొదలయ్యాక శేషమ్ సుహంత్ జూన్‌లో ఆదోని చేరుకున్నారు. ‘‘సొంత ఊరికి చేరుకోవడం చాలా ఆనందాన్నిచ్చింది. ఇక్కడ కూడా కరోనా కేసులు ఎక్కువయ్యాయి. ఎక్కడికీ వెళ్లడానికి లేదు. భౌతిక దూరం పాటిస్తూ, బంధువులను, స్నేహితులను పెద్దగా కలవడం లేదు. ఆ వెలితి బాధిస్తున్నా, ప్రశాంత వాతావరణంలో పనిచేస్తున్న అనుభూతిని మాత్రం పొందుతున్నాను’ అని ఆయన చెబుతున్నారు.
మనకేం కావాలో తెలిసింది ..మేళం దుర్గా ప్రసాద్, ఐబీఎం ప్రాజెక్టు మేనేజర్, భీమవరం
‘‘క్షణం తీరిక లేకుండా వందలాది మంది మధ్య నిత్యం గడపాల్సిన విధులు మావి. లక్ష్యాలు అందుకోవడానికి, ప్రాజెక్టులు పూర్తి చేయడానికే సమయం సరిపోయేది. దీంతో వర్క్ ఫ్రం హోమ్ అంటే కాస్త దిగులు పడ్డాం. కానీ, పల్లెపట్టుల నడుమ, ఇంటిపట్టునే ఉంటూ పని చేసుకోవడం ఎంతో సంతృప్తిగా ఉంది. ప్రశాంతంగా ఉంది. పనిలో తేడాలేదు. కానీ ఇన్నాళ్లు మేం కోల్పోయిందేంటో తెలిసి వచ్చింది’’