చిన్నబోయే.. ఏటికొప్పాక బొమ్మ
ABN , First Publish Date - 2020-05-24T07:45:19+05:30 IST
ప్రపంచం మెచ్చిన విశాఖ జిల్లా ఏటికొప్పాక లక్క బొమ్మలు ప్రపంచవ్యాప్త మహమ్మారిగా మారిన కరోనా దెబ్బకు కళ తప్పాయి. దాదాపు రెండు నెలల నుంచి లాక్‌డౌన్ కారణంగా ఎగుమతులు....

లాక్‌డౌన్‌తో స్తంభించిన లక్కబొమ్మల పరిశ్రమ
పనులు లేక పస్తులుంటున్న హస్త కళాకారులు
దేశీయ కళలను ప్రోత్సహించాలని ప్రభుత్వాలకు విజ్ఞిప్త
ప్రధాని మోదీ మాటలను గుర్తుచేస్తున్న కళాకారులు
ప్రపంచం మెచ్చిన విశాఖ జిల్లా ఏటికొప్పాక లక్క బొమ్మలు ప్రపంచవ్యాప్త మహమ్మారిగా మారిన కరోనా దెబ్బకు కళ తప్పాయి. దాదాపు రెండు నెలల నుంచి లాక్‌డౌన్ కారణంగా ఎగుమతులు లేక, కొనుగోళ్లు నిలిచిపోయి ఈ బొమ్మల కళాకారుల కుటుంబాలు కుదేలవుతున్నాయి. ఏటికొప్పాకలో ఈ కళపైనే ఆధారపడి 200 పైచిలుకు కుటుంబాలు జీవిస్తున్నాయి. 400 ఏళ్ల చరిత్ర కలిగిన తమ వృత్తికి ఇంత కష్టం గతంలో ఎన్నడూ కలగలేదని కళాకారులు కళ్లొత్తుకొంటున్నారు.
ఎలమంచిలి రూరల్, మే 23: అంకుడు కర్ర, సహజసిద్ధమైన రంగులను మాత్రమే వినియోగించి బొమ్మలు తయారుచేయడం ఏటికొప్పాక కళాకారుల ప్రత్యేకత. ఈ తరహా బొమ్మలు ప్రపంచంలో మరెక్కడా ఉండవని స్థానిక కళాకారులు చెబుతున్నారు. ఇళ్లలోనే రకరకాల బొమ్మలను తయారుచేసి, వాటిని విక్రయించడం ద్వారా వీరు కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఏటికొప్పాకకు చెందిన పలువురు ఔత్సాహిక హస్త కళాకారులు తమ సృజనాత్మకత , వినూత్న ఆలోచనలతో బొమ్మలు తయారుచేసి రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు అవార్డులు సొంతం చేసుకున్నారు. దేశ, విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న ఏటికొప్పాక బొమ్మలపైనా లాక్‌డౌన్ ప్రభావం పడింది. మార్చి చివరి వారం నుంచి వ్యాపార సంస్థలు మూతపడడం, రవాణా నిలిచిపోవడంతో వ్యాపారులు బొమ్మల కొనుగోళ్లు ఆపేశారు. దీంతో బొమ్మల తయారీని నిలిపివేయాల్సి వచ్చింది. అప్పటికే తయారుచేసిన లక్కబొమ్మలు ఇళ్లలో పేరుకుపోయాయి. చేతిలో ఉన్న కొద్దిపాటి డబ్బుతోనే కళాకారులు కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. లాక్‌డౌన్ నాలుగో విడత కొనసాగుతోంది. కొన్ని రంగాలకు సడలింపులు ఇచ్చినప్పటికీ బొమ్మల కొనుగోళ్లు ప్రారంభంకాలేదు. వచ్చే నెల నుంచి లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేసినా...లక్కబొమ్మలకు ఇప్పట్లో ఆర్డర్లు వచ్చే పరిస్థితి లేదని కళాకారులు అంటున్నారు.
ఒక్క బొమ్మ కొంటే చాలు
ప్రధాని మోదీ ‘లోకల్ మంత్ర’ నినాదంతో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహిద్దామని పిలుపునిచ్చారు. మన స్థానిక ఉత్పత్తుల గురించి గర్వంగా చెప్పుకుందామన్నారు. ప్రజలంతా స్వదేశీ హస్తకళాకారులకు చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క బొమ్మను కొనుగోలు చేయాలని వేడుకుంటున్నాం. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి. లాక్‌డౌన్ వల్ల వ్యాపారులు బొమ్మలు కొనుగోలు చేయనందున, ఇప్పటికే తయారుచేసిన బొమ్మలను ప్రభుత్వం కొనుగోలు చేయాలి.
-శ్రీశైలపు చిన్నయాచారి, ఏటికొప్పాక హస్తకళాకారుడు (రాష్ట్రపతి అవార్డు గ్రహీత)
కనుమరుగయ్యే ప్రమాదం..
కొన్ని తరాల నుంచి లక్కబొమ్మలు తయారు చేస్తున్నాం. ఇవే మాకు జీవనాధారం. హస్తకళలను ప్రోత్సహించకపోతే ఏటికొప్పాక లక్కబొమ్మలు కొన్నాళ్లకు కనుమరుగు అయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వం స్పందించి హస్తకళలను కాపాడాలి. మన బొమ్మలకు దెబ్బగా మారిన చైనా బొమ్మలను నిషేధించాలి. చైనా నుంచి బొమ్మల దిగుమతులు ఆపేయాలి.
-పెదపాటి ఆనందాచారి, ఏటికొప్పాక హస్తకళాకారుడు
ఇబ్బంది పడుతున్నాం..
లక్కబొమ్మల తయారీపై ఆధారపడి బతుకుతున్నాం. చైనా బొమ్మల కారణంగా కొంతకాలంగా చేతినిండా పని ఉండడంలేదు. కరోనా వైరస్ మరింత దెబ్బతీసింది. ఆదాయం లేక కుటుంబ పోషణకు ఇబ్బంది పడుతున్నాం. మా కళాకారులను ఆర్థికంగా ఆదుకోవాలి. హస్తకళల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
-గోర్ష భారతి, ఏటికొప్పాక హస్తకళాకారిణి