ఉనికి చాటుకున్న మండలి

ABN , First Publish Date - 2020-12-06T08:26:48+05:30 IST

శీతాకాల సమావేశాల్లో శాసనమండలి తన ఉనికిని చాటుకుంది. బిల్లుల విషయంలో వైసీపీ ప్రభుత్వ దూకుడుకు కళ్లెం వేసి విపులంగా చర్చించడం..

ఉనికి చాటుకున్న మండలి

సమస్యలపై విపులంగా చర్చలు.. ప్రజావ్యతిరేక బిల్లులు వెనక్కి 

5 రోజుల్లో 14 బిల్లులకు ఆమోదం.. ‘రద్దు’కు వెరవని ఎమ్మెల్సీలు


అమరావతి, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): శీతాకాల సమావేశాల్లో శాసనమండలి తన ఉనికిని చాటుకుంది. బిల్లుల విషయంలో వైసీపీ ప్రభుత్వ దూకుడుకు కళ్లెం వేసి విపులంగా చర్చించడం.. కొన్ని బిల్లులను వెనక్కి పంపడం దాంవరా తన పనితీరుపై అందరిలో ఆసక్తి కలిగించింది. మండలిలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి మెజారిటీ ఉండడంతో పాలక పక్షం కొంత తగ్గి వ్యవహరిస్తున్నప్పటికీ.. బొత్స సత్యనారాయణ, అనిల్‌ వంటి కొందరు మంత్రులు ఈ దఫా వ్యక్తిగత దూషణలకు దిగారు. కాగా, మండలిలో ప్రతి అంశంపైనా చ ర్చ సమగ్రంగా ఉంటోంది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మండలి ప్రాధాన్యం పెరిగింది. ఇందులో టీడీపీ ఆధిక్యం ఉండడంతో అక్కడ ప్రభుత్వ నిర్ణయాలు, బిల్లులపై చర్చ మరింత లోతుగా నడుస్తోంది.


ప్రతి అంశంలో ప్రభుత్వ వ్యతిరేకతను ప్రదర్శించకుండా కొన్ని చోట్ల మద్దతు ఇస్తూ .. కొన్ని విషయాల్లో వ్యతిరేకిస్తూ నడిపిస్తున్నారు. ఉదాహరణకు ఈ సారి సమావేశాల్లో మండలి ముందుకు పదికిపైగా బిల్లులు వచ్చా యి. ఇందులో ప్రజలపై భారం పడే అవకాశం ఉన్న ఆర్థిక బిల్లులను మాత్రమే మండలి వ్యతిరేకించింది. మిగిలిన వాటిని యథాతథంగా ఆమోదించి పంపింది. ఉదాహరణకు.. నగరాలు, పట్టణాల్లో ఆస్తి పన్ను పెంచడానికి ఉద్దేశించిన బిల్లు, ప్రజలపై అదనపు భారం మోపే వ్యాట్‌ పన్నుల బిల్లులను వెనక్కి పంపింది. అయితే వాటిని మరోసారి అసెంబ్లీ ఆమోదించుకోవడంతో మండలి వ్యతిరేకత పెద్దగా పనిచేయనట్లే! అయితే ప్ర భుత్వ దూకుడుకు ఎంతో కొంత చెక్‌ పెట్టడానికి తమ ప్రయత్నం పనికి వ స్తుందని ఎమ్మెల్సీలు భావిస్తున్నారు. 3 రాజధానులు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను ఆమోదించకపోవడంతోనే సీఎం ఆగ్రహించి మండలి రద్దు తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపారు. అయినా మండలి పనితీరుపై అదేమీ ప్రభావం చూపలేకపోయింది. సభ్యులెవరూ భయపడకుండా గతం మాదిరిగానే ప్రజా వ్యతిరేక బిల్లులను వెనక్కి పంపారు. అసెంబ్లీలో ప్రతిపక్షం టీడీపీ సంఖ్యాబలం మరీ తక్కువగా ఉండడంతో అధికార పక్షం ఆధిపత్యం చెలాయిస్తోంది.


మండలిలో మాత్రం బిల్లులపై ఆమోదముద్ర వేయించుకోవడానికి ఇబ్బంది ఎదురవుతోంది. మంత్రులు ఒకవేళ ఆవేశపడితే.. ప్రతిపక్ష సభ్యులు కూడా కాలు దువ్వుతున్నారు. ఈ నేపథ్యంలో ఉపాధి బిల్లులపై శుక్రవారం నాటి చర్చలో మంత్రులు సుదీర్ఘ సమాధానాలు చెప్పారు. కొన్ని బిల్లులు చెల్లిస్తామన్నారు. నంద్యాలలో సలాం కుటుంబం ఆత్మహత్య విషయంలోనూ మండలిలో గట్టి ఒత్తిడి రాడంతో సీబీఐకి అప్పగించేందుకు అంగీకరిస్తున్నట్లు హోం మంత్రి సుచరిత ప్రకటించారు.


నాలుగు బిల్లుల తిరస్కరణ

ఐదు రోజులు జరిగిన శాసనమండలి శీతాకాల సమావేశాల్లో మొత్తం 18 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వాటిలో 4 బిల్లులు తిరస్కరణకు గురయ్యాయి. శుక్రవారం ఉపాధి బిల్లులు చెల్లించాలంటూ టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. గందరగోళం నడుమే 6 నిమిషాల్లో 6 బిల్లులను ఆమోదించినట్లు చైర్మన్‌ షరీఫ్‌ ప్రకటించారు.  సభను నిరవధికంగా వాయిదావేశారు.

Read more