నచ్చింది కాదు... ఇచ్చింది తాగండి

ABN , First Publish Date - 2020-08-16T11:21:56+05:30 IST

‘మీ దగ్గర డబ్బున్నంత మాత్రాన నచ్చింది తాగుతాం అంటే కుదరదు. కొత్తవేం అగడట్లేదు షాపులో..

నచ్చింది కాదు... ఇచ్చింది తాగండి

  • షాపుల్లో కొన్ని బ్రాండ్లే అమ్మాలని హుకుం
  • వేరే బ్రాండ్లు ఉన్నా అమ్మకూడదు
  • మద్యం అమ్మకాల్లో రాజకీయ ప్రమేయం

అమరావతి, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): ‘మీ దగ్గర డబ్బున్నంత మాత్రాన నచ్చింది తాగుతాం అంటే కుదరదు. కొత్తవేం అగడట్లేదు షాపులో ఉన్న సరుకే కావాలన్నా కూడా వీల్లేదు. మీ దగ్గర డబ్బులున్నా, షాపులో సరుకున్నా అక్కడ సేల్స్‌మెన్‌ ఏదిస్తే అదే తీసుకోవాలి’ ఇదీ రాష్ట్రంలోని మద్యంషాపుల్లో అనధికారికంగా ప్రవేశపెట్టిన కొత్త ‘మద్యం పాలసీ’. మద్యం అమ్మకాల్లో రాజకీయ ప్రవేశంతో ఇప్పటికే అనేక మార్పులు జరగ్గా, ఇప్పుడు అందులోనూ షరతులు పెట్టి వినియోగదారుల స్వేచ్ఛను పూర్తిగా హరిస్తున్నారు. ఇప్పటికే పాపులర్‌ బ్రాండ్లు మాయమై, ఎప్పుడూ చూడని కొత్త బ్రాండ్లు తెరపైకి వచ్చాయి. వాటిలో అయినా వినియోగదారులకు అన్నీ అందుబాటులో ఉంటాయా? అంటే అదీలేదు. వాటిలోనూ కొన్ని బ్రాండ్లనే ముందు అమ్మాలని ప్రభుత్వం నడుపుతున్న మద్యంషాపులకు అనధికారిక ఆదేశాలు వెళ్తున్నాయి. ఇన్నాళ్లూ తమకు ఆర్డర్లే ఇవ్వట్లేదని మొత్తుకుంటున్న పాపులర్‌ బ్రాండ్ల కంపెనీలు ఈ విధానం చూశాక నోరెళ్లబెట్టారు. కనీసం తమ బ్రాండ్లు 10శాతం కూడా కనిపించకుండా చేస్తున్నారని వాపోతున్నారు.


అన్నీ ‘అధికార’ బ్రాండ్లే

రాయలసీమకు చెందిన అధికార పార్టీ నేతలు కొందరు మద్యం వ్యాపారంలోకి దిగారు. పైకి పేర్లు కనిపించకపోయినా వారే వాటిని దగ్గరుండి నడిపిస్తున్నారు. అలాగని గతంలో వీరు మద్యం వ్యాపారంలో ఉన్నారా అంటే అదీ లేదు. అధికారం చేతికొచ్చినందున దాన్ని అవకాశంగా మార్చుకునేందుకు హడావిడిగా కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు. పార్టీ అధికారంలో ఉన్నంతకాలం ఉంటే అవి చాలన్నట్టుగానే ఉత్పత్తి మొదలుపెట్టారు. ఇప్పుడు వారి బ్రాండ్లే షాపుల్లో మెరుస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ తరహాలో సుమారు 30 బ్రాండ్లు తెరపైకి వచ్చాయి. దాదాపు 80 శాతం సరుకు ఇవే ఉంటున్నాయి. ఇంతకాలం మద్యం వ్యాపారంలో పేరు సంపాదించిన బ్రాండ్లు ఉన్నాయంటే ఉన్నాయన్నట్టుగా మారిపోయాయి.


ఇప్పుడు అందులోనూ కొత్తట్రెండ్‌ తీసుకొచ్చారు. కొత్తగా వచ్చిన బ్రాండ్లలో కూడా ముందు కొన్నే అమ్మాలని షరతు పెట్టారు. ఇటీవల గుంటూరు జిల్లాలో ఒక్క బ్రాండ్‌కే షాపులన్నీ పెద్దపీట వేశాయి. ఎవరొచ్చినా ఆ బ్రాండే అమ్మాలని ఆదేశాలు వెళ్ళాయి. అవి అయిపోతే తప్ప వేరే సీసాలు వినియోగదారులకు ఇవ్వలేదు. దీనిపై వినియోగదారులు, షాపుల్లోని ఉద్యోగులకు మధ్య అనేకచోట్ల వాదనలు, గొడవలు తలెత్తాయి. ఆరా తీస్తే ప్రభుత్వంలో కీలకంగా ఉండే ఓ ప్రముఖ వ్యక్తి ఆ బ్రాండ్‌ వెనుక ఉన్నట్టు ప్రచారం బయటికొచ్చింది. మిగిలిన జిల్లాల్లోనూ ఇదేవిధానం అమలుచేస్తున్నారు. సొంత బ్రాండ్లు అమ్ముకునేందుకు మరో విధానం కూడా తెరమీదకు తెచ్చారు. రొటేషన్‌ పద్ధతిలో పలానా రోజు ఒక బ్రాండ్‌ మాత్రమే అమ్మాలనే షరతుతో వారికి నచ్చిన బ్రాండ్లు కచ్చితంగా అమ్ముడవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో మరో కొత్త కోణం కనిపిస్తోంది.


తమ పార్టీ అయినా కమీషన్‌ ఇవ్వకపోతే డిస్టిలరీ మూసుకోవాల్సిందేననే సంకేతాలు పంపుతున్నారు. కోస్తాజిల్లాలకు చెందిన ఓ ప్రముఖ నాయకుడు ఎప్పటినుంచో మద్యం వ్యాపారంలో ఉన్నారు. అధికారపార్టీ ప్రజాప్రతినిధిగా కూడా కొనసాగుతున్నా రు. ఆయన డిస్టిలరీలో మద్యం అమ్మకాలకూ 10శాతం కమీషన్‌ నిబంధన పెట్టారు. అంత ఇవ్వలేమని తేల్చిచెప్పడంతో ఆ డిస్టిలరీకి చెందిన బ్రాండ్లకు ఆర్డర్లు ఆగిపోయాయి. దశాబ్దాలుగా సాగుతున్న ఆ మద్యం కంపెనీ ఇప్పుడు చేతులెత్తేసే స్థితికి చేరింది. దానిపై ఆధారపడిన వందలాది మంది ఉపాధి కోల్పోయారు. మన అని కూడా చూడకుండా తమపట్ల కూడా ఇలా వ్యవహరిస్తారా అని తెలిసినవారి దగ్గర ఆయన ఆవేదన వెళ్ళగక్కుతున్నారు. కమీషన్లు ఇవ్వలేక శ్రీకాకుళం జిల్లాలోని ఓ బీరు కంపెనీ మొత్తం కంపెనీనే మూసేసుకుంది. ఇన్నాళ్లూ మంచి బ్రాండ్లుగా పేరున్న కంపెనీలు దాదాపుగా అమ్మకాలను కోల్పోయాయి.

Updated Date - 2020-08-16T11:21:56+05:30 IST