మద్దతిస్తే కులాన్ని అంటగడతారా

ABN , First Publish Date - 2020-09-29T07:56:50+05:30 IST

అమరావతికి ఎవరు మద్దతు తెలిపినా వారికి కులం అంటగడతారా? అని రాజధాని రైతులు మండిపడ్డారు. పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఆ

మద్దతిస్తే కులాన్ని అంటగడతారా

రాజధాని రైతుల ఆగ్రహం..

286వ రోజు కొనసాగిన ఉద్యమం


గుంటూరు, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): అమరావతికి ఎవరు మద్దతు తెలిపినా వారికి కులం అంటగడతారా? అని రాజధాని రైతులు మండిపడ్డారు. పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమం సోమవారానికి 286వ రోజుకు చేరింది.


రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు. ఎన్ని క్యూసెక్కుల వరద వచ్చినా రాజధానికి వచ్చిన ముంపేమీ లేదని, కృష్ణమ్మ శాంతించాలని బోరుపాలెం మహిళలు, రైతులు సారే సమర్పించి వేడుకున్నారు. అమరావతిపై  కుట్రలు చేస్తూ నాశనం చేయాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని దళిత జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇదిలావుంటే, ఉద్దండరాయునిపాలెం, తాళ్లాయపాలెం లంకగ్రామాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎంపీ నందిగం సురేశ్‌ కానీ, ఎమ్మెల్యే శ్రీదేవి కానీ తమను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఎన్టీఆర్‌ హౌసింగ్‌ స్కీం కోసం రూ.లక్ష కట్టామని ఆ ఇళ్లు తమకు అందిస్తే కష్టాలు ఉండేవికావన్నారు. 

Updated Date - 2020-09-29T07:56:50+05:30 IST