సీఎంను ప్రశ్నిస్తే మోదీని లాగుతారా

ABN , First Publish Date - 2020-09-24T07:35:35+05:30 IST

తిరుమల ఆలయ సంప్రదాయాలను ఎందుకు పాటించరని సీఎం జగన్‌ను ప్రశ్నిస్తే అందులోకి ప్రధాని మోదీని లాగడమేంటని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన నంద్యాల

సీఎంను ప్రశ్నిస్తే  మోదీని లాగుతారా

ఇతర మతాల ఆచారాలను గౌరవించరా?

అడిగితే హేళన చేయడం ఏమిటి?: బాబు

డిక్లరేషన్‌ డిమాండ్‌తో నిరసనలు

 ఇక్కడ రంకెలు వేస్తారు... అక్కడికెళ్లి కాళ్లపై పడతారు

నంద్యాల నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌


అమరావతి, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): తిరుమల ఆలయ సంప్రదాయాలను ఎందుకు పాటించరని సీఎం జగన్‌ను ప్రశ్నిస్తే అందులోకి ప్రధాని మోదీని లాగడమేంటని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన నంద్యాల లోక్‌సభ స్థానం పరిధిలోని ఆ పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ‘తిరుమల ఆలయ సంప్రదాయాల ప్రకారం శ్రీవారికి పట్టువస్త్రాలు ఇచ్చేవారు సతీసమేతంగా రావాలి. ఇదే విషయాన్ని కొందరు అడిగారు. దానికి సమాధానం చెప్పకుండా ప్రధాని మోదీని సతీ సమేతంగా రమ్మని చెప్పండని కొందరు మంత్రులు సవాళ్లు విసురుతున్నారు. ఇక్కడ జరుగుతున్న చర్చకు... ప్రధానికి సంబంధం ఉందా? ఇక్కడ రంకెలు వేస్తారు... అక్కడకు వెళ్లి కాళ్లపై పడతారు’ అని ఆయన వ్యాఖ్యానించారు.


‘ఇతర మతాల సంప్రదాయాలను గౌరవించడం మన దేశంలో పాటించే ధర్మం. దానిని పాటించాలి తప్ప హేళన చేయడం తగదు. ప్రతి విషయంలో లెక్కలేనితనం ప్రదర్శించి అది తమ గొప్పతనంగా విర్రవీగుతున్నారు. విగ్రహాల కాళ్లు చేతులు విరిగితే ఏమవుతుంది. రథాలు తగలబడితే ఏమవుతుందని కొందరు మంత్రులు ప్రశ్నిస్తున్నారు. అవి నమ్మకాలు, మనోభావాలకు సంబంధించినవని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇవాళ దేవాలయాలపై జరుగుతున్న దాడులు రేపు చర్చిలు, మసీదులపై కూడా జరిగినా ఇలాగే మాట్లాడి దులుపుకొని పోతారా’ అని చంద్రబాబు ప్రశ్నించారు.




‘పేకాట మంత్రులు, టెండర్లు హస్తగతం చేసుకొనే మంత్రులు, గనులు కబ్జా చేసే మంత్రులు, ఇసుక దోచుకొనే మంత్రులు, బెంజి కార్లు బహుమతులుగా తీసుకొనే మంత్రులు, కమిషన్లు... కలెక్షన్ల మంత్రులతో మంత్రివర్గం కళకళలాడుతోంది. ఎన్ని ఆరోపణలు వచ్చినా సీఎం ఎవరిపైనా చర్య తీసుకోరు. రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారు. తప్పుబడితే న్యాయవ్యవస్థనూ బూతులు తిడుతున్నారు’ అని ఆయన విమర్శించారు. కాగా.. ‘సీఎం జగన్‌ సైలెంట్‌ కిల్లర్‌. మంత్రులు, ఎమ్మెల్యేలతో పచ్చిబూతులు మాట్లాడిస్తున్నారు. ఎమ్మెల్యేలు సెటిల్‌మెంట్లు చేస్తూ రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. అది నోరో.. అశుద్ధమో తెలియద’ని టీడీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ధ్వజమెత్తారు. ‘హిందూ మతాన్ని అవమానపరిచడం సరికాదు. మంత్రి కొడాలి నాని వంటి వాళ్లు మట్టికొట్టుకుపోతార’ని గోరంట్ల శపించారు. 




టీటీడీ సంప్రదాయాలను గౌరవించాలి: దేవినేని


టీటీడీ సాంప్రదాయాలను గౌరవించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. డిక్లరేషన్‌పై జగన్‌ సంతకం చేయకుంటే హిందువులపై దాడులను ప్రోత్సహించేలా వ్యవహరించిన వారవుతారన్నారు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లి సంతకాలు చేసే సీఎం జగన్‌ తిరుమల ఆలయంలో ప్రవేశించే ముందు అన్యమతస్థుల రిజిస్టర్‌లో సంతకం పెట్టడానికి ఎందుకు ఇగో ఫీలవుతున్నారని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. హిందూవులతో పాటు ముస్లిం, క్రైస్తవ మతస్థుల ఆచారాలను గౌరవించాలని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. 


తిరుమలలో అన్యమతస్థులు డిక్లరేషన్‌ ఇచ్చి శ్రీవారిని దర్శించుకోవాలన్న నిబంధనను కచ్చితంగా అమలు చేయాలన్నారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన వైసీపీ ఎంపీలు ఇప్పుడు తమ మెడలు దించేసి సాగిలపడి మొక్కుతున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఎద్దేవా చేశారు. కాగా తిరుమల ఆలయ సంప్రదాయాలను పాటిస్తూ సీఎం జగన్‌ నుంచి డిక్లరేషన్‌ తీసుకోవాలని టీటీడీ కార్యనిర్వహణాధికారికి తెలుగుదేశం పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ బుధవారం ఒక లేఖను ఆలయ ఈవోకు రాశారు.


Updated Date - 2020-09-24T07:35:35+05:30 IST