మీటరే ఎందుకు?

ABN , First Publish Date - 2020-09-06T07:00:49+05:30 IST

రూపాయితో పోయేదానికి వంద రూపాయలు ఖర్చు పెడితే!? దాన్నేమంటారు? వ్యవసాయ విద్యుత్‌ వినియోగం లెక్కలు తీసే పేరిట

మీటరే  ఎందుకు?

18.26 లక్షల పంపుసెట్లకు అమర్చాల్సిందేనా!

నాలుగు వేల ఫీడర్లకు పెడితే లెక్క పక్కా!

లేదా.. లక్ష ట్రాన్స్‌ఫార్మర్లకు పెట్టినా ఓకే

స్మార్ట్‌ మీటర్ల కొనుగోలుకు రూ.2 వేల కోట్లు

ఇతర మౌలిక సదుపాయాల ఖర్చు అదనం

కేంద్రం చెప్పకున్నా అదే బాట ఎందుకు?

ప్రతి కనెక్షన్‌కూ మీటర్‌ వెనుక మతలబేమిటో!

విద్యుత్‌ రంగ నిపుణుల్లో సందేహం


ఒకటీ రెండు కాదు! వందలూ వేలు కూడా కాదు! ఏకంగా 18.26 లక్షల పంపుసెట్లు. వాటన్నింటికీ మీటర్లు పెడతారట! రైతులపై ఎలాంటి భారం పడదనీ, ప్రభుత్వమే ఈ ఖర్చు భరిస్తుందని భరోసా ఇస్తున్నారు! మంచిదే! అసలు... వ్యవసాయ విద్యుత్‌ వినియోగాన్ని లెక్కించేందుకు పంపు సెట్లకు మీటర్లు పెట్టడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదా!? వేల కోట్ల ఖర్చుతో కూడుకున్న ఈ  ప్రహసనం తప్పదా? దీనిపై నిపుణులు ఏమంటున్నారు? 

‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ప్రత్యేక కథనమిది... 


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

రూపాయితో పోయేదానికి వంద రూపాయలు ఖర్చు పెడితే!?   దాన్నేమంటారు? వ్యవసాయ విద్యుత్‌ వినియోగం లెక్కలు  తీసే పేరిట జగన్‌ సర్కారు కూడా అదే చేస్తోంది. ఇతరత్రా అనేక ప్రత్యామ్నాయాలున్నా  పట్టించుకోకుండా... ఏకంగా 18 లక్షల మీటర్లు కొనాలన్న నిర్ణయం వెనుక మతలబేమిటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం చెప్పినందుకే మీటర్లు పెడుతున్నామని, నగదు బదిలీ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించామని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్పిన మాటల్లో నిజం లేదని ఇప్పటికే తేలిపోయింది. డిస్కమ్‌లకు ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లించాలన్నది మాత్రమే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం.


అయినా సరే... మీటర్ల పేరిట రైతాంగంలో అలజడి సృష్టించేలా వ్యవహరించడానికి  కారణమేమిటి? రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని తెలిసినా ఎందుకు ముందడుగు వేయాలనుకుంటోంది? ఇందులో ఏమైనా బలమైన కారణాలు, ఇతర కోణాలు ఉన్నాయా? అంటే అవునని చెబుతున్నారు విద్యుత్‌ రంగ నిపుణులు! వ్యవసాయ విద్యుత్‌ వినియోగం లెక్క తేల్చేందుకు ప్రతి పంపు సెట్టుకు మీటరు పెట్టాల్సిన అవసరం లేదని... దీనికి అనేక ప్రత్యామ్నాయాలున్నాయని తేల్చి చెబుతున్నారు.


ఫీడర్లకు పెడితే చాలు...

వ్యవసాయనికి విద్యుత్‌ సరఫరా చేసే ఫీడర్ల వద్ద ఎనర్జీ ఆడిటింగ్‌ కోసం మీటర్లు పెట్టవచ్చు. దీనివల్ల వినియోగం లెక్క తెలిసిపోతుంది. ఇందుకు మూడు లేదా నాలుగు వేల మీటర్లు కొనుగోలు చే స్తే సరిపోతుంది.  రాష్ట్రంలో మొత్తం 12 వేలకుపైగా విద్యుత్‌ ఫీడర్లు ఉన్నాయి. వీటిలో 3వేల ఫీడర్లు ప్రత్యేకంగా  వ్యవసాయానికి ఉన్నాయి. వీటిల్లో కొన్నింటికి ఇప్పటికే మీటర్లు ఉన్నాయి.  గృహ, వ్యవసాయ వినియోగానికి ఉమ్మడిగా మిక్స్‌డ్‌ ఫీడర్లు మరి కొన్ని ఉన్నాయి.


సాగుకు పగటిపూటే 9 గంటలు కరెంటు ఇచ్చేందుకు వీలుగా... మొత్తం  అగ్రికల్చర్‌ ఫీడర్లను విడదీస్తున్నారు. ఈ పని కూడా పూర్తయితే... వ్యవసాయ విద్యుత్తుకు వంద శాతం ప్రత్యేక ఫీడర్ల ద్వారా సరఫరా జరుగుతుంది. వెరసి... ఆ మూడు నాలుగు వేల ఫీడర్లకు పూర్తిస్థాయిలో మీటర్లు పెడితే చాలు! సాగుకు కరెంటు ఎంత ఉపయోగిస్తున్నారో... డిస్కమ్‌లకు చెల్లించాల్సిన డబ్బులు ఎంతో స్పష్టంగా తెలిసిపోతుంది. అయినా, సరే... 18.26 లక్షల పంపుసెట్లకు మీటర్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడం నిపుణులను ఆశ్చర్యం కలిగిస్తోంది.


ట్రాన్స్‌ఫార్మర్ల స్థాయిలోనూ... 

ఫీడర్ల వద్ద కాకుండా... ఇంకా సూక్ష్మ స్థాయిలో కూడా వ్యవసాయ విద్యుత్‌ వినియోగాన్ని లెక్కించవచ్చు. అది... ట్రాన్స్‌ఫార్మర్లకు మీటర్లు ఏర్పాటు చేయడం! క్షేత్రస్థాయిలో వ్యవసాయ, గృహ, పరిశ్రమలకు విద్యుత్‌ సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మర్లు వేర్వేరుగా ఉంటాయి. అందువల్ల... వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లకు సులువుగా మీటర్లు పెట్టవచ్చు. ఇందుకు, గరిష్ఠంగా లక్ష మీటర్లు కొంటే సరిపోతుంది.


అయినా సరే... ప్రతి పంపుసెట్టుకు మీటరు పెట్టి తీరతాం అని ప్రభుత్వం చెబుతోంది. నిజానికి... ఫీడర్‌ లేదా ట్రాన్స్‌ఫార్మర్ల స్థాయిలో మీటర్లు పెట్టాలని విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌ ఎప్పుడో సూచించింది.


ఖర్చు తడిసి మోపెడు!

‘మీటర్ల భారం మాదే’ అని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ఆ భారం విషయానికి వద్దాం! త్రీఫేజ్‌ సాధారణ మీటరు ధర రూ.2100. (వ్యవసాయ కనెక్షన్‌కు త్రీఫేజ్‌ మాత్రమే వాడాలి). దాదాపు 18 లక్షల మీటర్లకు అయ్యే ఖర్చు రూ.380 కోట్లు. అయితే, సాధారణ మీటర్లు పెడితే రీడింగ్‌ కోసం సిబ్బందిని నియమించుకోవాలి.


రాష్ట్రంలో మూలమూలన ఉన్న వ్యవసాయ పంపుసెట్లకు వెళ్లి మీటర్‌ రీడింగ్‌ తీసుకోవాలి. మీటర్ల నిర్వహణ ఖర్చు కూడా ఉంటుంది. అయితే... పంపుసెట్లకు స్మార్ట్‌ మీటర్లనే పెడతామని ప్రభుత్వం తెలిపింది. అప్పుడు మీటర్‌ రీడింగ్‌ కోసం సిబ్బందిని పంపాల్సిన అవసరం లేదు. సిమ్‌ కార్డు ద్వారా రీడింగ్‌ నమోదై... డిస్కమ్‌ సర్వర్లకు దానంతటదే చేరుతుంది. 


త్రీఫేజ్‌ స్మార్ట్‌ మీటర్‌  ధర రూ.10,750. అంటే... 18 లక్షల మీటర్ల వ్యయం రూ.1935 కోట్లు. ఇది అంతటితో అయ్యేది కాదు. స్మార్ట్‌ మీటర్‌ రీడింగ్‌కు సిగ్నల్స్‌ కోసం మొబైల్‌ టవర్లు, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. ఈ ఖర్చు అదనం. ప్రస్తుతానికి... మీటర్ల ఏర్పాటుకు 1800 కోట్ల వ్యయంకోసం ఈఆర్‌సీ అనుమతి కోరినట్లు తెలిసింది.  


మీటర్‌ వ్యాపారం... 

ప్రభుత్వం సొంతంగా మీటర్లు తయారు చేయడంలేదు. కాబట్టి... 18.26 లక్షల మీటర్లు ఏదైనా కంపెనీ నుంచి మీటర్లను కొనుగోలు చేయాల్సిందే. ఈ మొత్తం వ్యవహారంలో ఇదే కీలకమైన అంశమని నిపుణులు చెబుతున్నారు. దేశంలో ఇంతవరకు ఎక్కడా మీటర్ల వ్యాపారం భారీ స్థాయిలో  మొదలుకాలేదు.


అది ఏపీ నుంచే ప్రారంభయ్యే సూచనలు ఉన్నాయి. ఇక్కడ విజయవంతమైతే, కంపెనీలు మెల్లమెల్లగా దేశంలోని ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తాయి. దీంతో దేశంలోని వ్యవసాయ విద్యుత్‌ రంగంలో మీటర్ల వ్యాపారం జోరుగా సాగతుందని నిపుణులు అంచనావేస్తున్నారు. ఒక రాష్ట్రంలో ప్రభుత్వానికి మీటర్లు అమ్మిన కంపెనీకి ఇతర రాష్ట్రాల నుంచి కూడా కళ్లుచెదిరే ఆఫర్లు వస్తుంటాయి. దీని వల్ల వద్దన్నా బిజినెస్‌ వచ్చిపడుతుంది. 


మీటర్లతో ఏం సాధించవచ్చు?

1) ధనిక రైతులను, ఆదాయపన్ను అసె్‌సమెంట్‌ చేయించుకునే రైతులకు విద్యుత్‌ సబ్సిడీని కట్‌చేయడం! దీనివల్ల సబ్సిడీ భారం భారీగానే తగ్గుతుందని ఒక అంచనా. నగదు బదిలీ, విద్యుత్‌ కనెక్షన్లకు ఆధార్‌ అనుసంధానం చేయవ చ్చు. దీనివల్ల అధిక ఆదాయం ఉన్న రైతులెవరో తెలిసిపోతుంది.


సబ్సిడీ పేదలకే ఇస్తాం, సంపన్న రైతులకు ఇవ్వమ ని ప్రభుత్వం చెబితే విమర్శించే వారెవరుంటారు?  ఇది కేవ లం ఉచిత విద్యుత్‌కు మాత్రమే కాదు.. రైతు భరోసాతోపా టు ఇతర న గదు బదిలీ పథకాలకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇప్పటికే రేషన్‌కు ఆధార్‌ అనుసంధా నం చేసిఅధికాదాయం ఉన్నవారిని జాబితానుంచి తొలగించారు. 

2) ‘ఈ నెలలో ఉచిత  విద్యుత్తు ద్వారా ఇంత లబ్ధి చే కూర్చాం’ అని ఒక్కో రైతుకు విడివిడిగా చెప్పవచ్చు. ‘ఇది మీ మీద పెట్టిన ఖర్చు’ అని కొత్తగా లెక్కలు తీయవచ్చు. ఇది రాజకీయంగా లాభించే విషయం! 


Updated Date - 2020-09-06T07:00:49+05:30 IST