విశాఖలో ఆ రెండు ఘటనలకు మూలం ఎవరు?

ABN , First Publish Date - 2020-03-12T17:12:11+05:30 IST

విశాఖలో ఆ రెండు ఘటనలకు మూలం ఎవరు?

విశాఖలో ఆ రెండు ఘటనలకు మూలం ఎవరు?

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇప్పటికే ఒకసారి హైకోర్టు ముందు నేరుగా హాజరయ్యారు. మరోసారి హాజరుకావాలని ఆయనకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా హైకోర్టులో డీజీపీ హాజరుకి దారితీసిన రెండు ఘటనలు కూడా విశాఖ నగరానికి సంబంధించినవే! మరీ విశాఖలో ఆ రెండు ఘటనలకు మూలం ఎవరు? ఒక పోలీసు ఉన్నతాధికారి వల్ల ఎదురైన చిక్కులు ఏంటి? ఈ మొత్తం వ్యవహారంపై పోలీస్ వర్గాలు ఏమనుకుంటున్నాయి? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.


   ఆడించేది ఒకరు, ఆటాడేది మరొకరు అంటారే.. అలాగే ఉందట విశాఖ నగర పోలీస్ ఉన్నతాధికారుల్లో ఒకరి వ్యవహారశైలి. ఆ పోలీస్ ఉన్నతాధికారి పక్షపాత వైఖరి.. ఏకంగా రాష్ట్ర డీజీపీని చిక్కుల్లో పడేసిందనే చర్చ జరుగుతోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపట్ల రాష్ట్ర హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పోలీస్ ఉన్నతాధికారులను నేరుగా హైకోర్టుకి హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. విశాఖ నగరంలో నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యాభర్తలను అక్రమంగా నిర్బంధించిన కేసులో డీజీపీ గౌతమ్ సవాంగ్ సహా నగర పోలీస్ కమిషనర్ ఆర్.కె.మీనా కూడా నేరుగా హైకోర్టు ఎదుట హాజరై సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇది జరిగి కొన్నిరోజులు కూడా కాకముందే.. డీజీపీ గౌతమ్ సవాంగ్ కు మరోసారి హైకోర్టు నుంచి పిలుపు వచ్చింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై విశాఖ ఎయిర్ పోర్టు వద్ద దాడి వ్యవహారంపై విచారణకు హాజరు కావాలని ఆయన్ను కోర్టు ఆదేశించింది. గతనెల 27న విశాఖ విమానాశ్రయం వద్ద చంద్రబాబునాయుడుని పోలీసులు అడ్డుకున్నారు. ముందుగా విశాఖలో చంద్రబాబు పర్యటనకు పోలీస్ అధికారులు అనుమతి ఇచ్చారు. అయితే అక్కడికి వెళ్లిన ఆయన్ను సీఆర్పీసీ 151 కింద నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది.


   విశాఖలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనకు అసలు పోలీసులే అనుమతి ఇచ్చి.. ఎలా అరెస్ట్ చేస్తారు? విశాఖ ఎయిర్ పోర్టులోకి వైసీపీ నాయకులు, కార్యకర్తలను ఎలా అనుమతించారు? అని హైకోర్టు ప్రశ్నించింది. వీటిపై రాష్ట్ర డీజీపీ, విశాఖ నగర పోలీస్ కమిషనర్ వేర్వేరుగా పిటీషన్ కౌంటర్లు వేయాలనీ, ఈనెల 12న కోర్టులో విచారణకు హాజరుకావాలనీ ఆదేశాలు జారీ చేసింది. డీజీపీ వరుసగా రెండవసారి హైకోర్టు ముందు హాజరు కానుండటం చర్చనీయాంశంగా మారింది. ఇది రాష్ట్ర పోలీస్ శాఖకు తలవంపులు లాంటిదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 


    రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కి ఈ పరిస్థితి ఎదురవడానికి విశాఖ నగరంలో పనిచేస్తున్న ఒక పోలీసు ఉన్నతాధికారి పక్షపాత వైఖరే కారణమని పోలీస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అడిషనల్ డీజీ స్థాయి కలిగిన వ్యక్తి విశాఖ పోలీస్ కమిషనర్ గా ఉన్నప్పటికీ.. నగరంలో ఆ ఉన్నతాధికారి ఏం చెబితే అదే డిపార్ట్ మెంటులో జరుగుతుందట. విశాఖ నగరంలో నాల్గవ పట్టణ పోలీసు స్టేషన్ లో ఇద్దరి అక్రమ నిర్బంధం విషయంలోనూ ఆయన ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. "ఒక కేసులో తప్పు చేసినవాడిని వెంటనే అరెస్ట్ చేస్తే వాడికేం బాధ తెలుస్తుంది..   ఒక వారంరోజుల పాటు ఉంచండి.." అంటూ ఆ పోలీస్ ఉన్నతాధికారి మౌఖికంగా ఆదేశాలు ఇవ్వడంతో.. వారిద్దరిని ఆ స్టేషన్ లోనే ఉంచేశారట.  ఇంతలో ఈ అంశంపై హైకోర్టులో దాఖలైన హెబీయస్‌ కార్పస్‌ పిటీషన్‌ విచారణ సందర్భంగా తమ ముందు హాజరుకావాలని డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో గౌతమ్ సవాంగ్ ఉన్నత న్యాయస్థానం ముందు హాజరయ్యారు. ఇద్దరి అక్రమ నిర్బంధం విషయంలో కోర్టుకి సంజాయిషీ ఇచ్చుకున్నారు.


   ఇక విశాఖ ఎయిర్ పోర్టులో చంద్రబాబుని అడ్డుకోవడం వెనుక కూడా సదరు పోలీస్ ఉన్నతాధికారి ఉన్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నగర నగర పోలీస్ బాస్, కిందిస్థాయి అధికారులు.. ఆ ఉన్నతాధికారి ఆదేశాల ప్రకారమే నడుచుకున్నారనే విమర్శలున్నాయి. ఎయిర్ పోర్టులోకి వైసీపీ నాయకులు, కార్యకర్తలను విడిచిపెట్టాలనీ, ఎలాంటి అరెస్టులు, లాఠీ చార్జీలు చేయవద్దనీ మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారట. ఇందులో భాగంగానే చంద్రబాబు కాన్వాయ్ ని అడ్డుకున్న వారిని అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు వదిలేశారట. అయితే మళ్లీ హైకోర్టు ఆదేశాలతో వారిపై కేసులు నమోదు చేయాల్సి వచ్చిందనీ, ఇప్పుడు డీజీపీ గౌతమ్ సవాంగ్ మరోసారి హైకోర్టుకు కూడా హాజరుకానున్నారనీ పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


   ఆ పోలీసు ఉన్నతాధికారి.. ప్రభుత్వ పెద్దల సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. అంతేగాక ఆయన ప్రభుత్వ పెద్దలకు దగ్గర మనిషిలా చలామణి అవుతుంటారు. దీంతో విశాఖ నగరంలో పోలీసులకు ఆయనే అనధికారిక బాసులా ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ పోలీస్ ఉన్నతాధికారి ఏది చెబితే.. అదే కరెక్ట్!  ఆయన ఏది తప్పు అంటే అదే తప్పు! ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా నిరసన కార్యక్రమం చేస్తామన్నా సరే.. ఆయనకు ఇష్టం ఉండదట. పోలీస్ అధికారులు అందరూ అనుమతి ఇచ్చినా.. ఆయన మాత్రం అందుకు అంగీకరించరట. ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రభుత్వ పక్షపాతిగా సదరు పోలీస్ ఉన్నతాధికారి ఉంటారని డిపార్టుమెంటులో పలువురు చెవులు కొరుక్కుంటున్నారు.


   మొత్తంమీద ప్రభుత్వ పెద్దల సామాజికవర్గానికి చెందిన సదరు పోలీస్ ఉన్నతాధికారికి.. రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వల్లమాలిన ప్రేమ పోలీస్ శాఖకు తలనొప్పులు తెచ్చిపెడుతోందనే వాదనలు విశాఖ పోలీసుల్లో వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో ఒక జిల్లాకు ఎస్పీ పోస్టింగ్ ను తనకు ఇవ్వాలని సదరు పోలీస్ ఉన్నతాధికారి అడిగారట. అయితే అందుకు ఆయన పైస్థాయి అధికారులు వెనుకడుగులు వేశారట. "ప్రభుత్వంపై మీకున్న అతిప్రేమ మళ్లీ మా కొంప ముంచుతుందేమో.. మీరు ఇక్కడే ఉండండి.. అదే మాకు చాలు.." అని వారు చెప్పుకొచ్చారట. అయినప్పటికీ సదరు పోలీస్ ఉన్నతాధికారి వారి మాటలను ఏమీ పట్టించుకోకుండా తన పంథాలోనే దూసుకెళ్తున్నారట. ఆయనగారికి ప్రభుత్వం, అందులోని పెద్దల సామాజికవర్గంపై ఉన్న అభిమానం.. పోలీస్ శాఖకు ఇంకా ఎన్ని ఇబ్బందులు తెచ్చిపెడతాయో అని పోలీస్ వర్గాలు లోలోపల మదన పడుతున్నారు. మరి ఇప్పటికైనా ఆ ఉన్నతాధికారి పక్షపాత ధోరణికి రాష్ట్ర పోలీస్ బాస్ బ్రేక్ వేస్తారో లేదో చూడాలి.

Updated Date - 2020-03-12T17:12:11+05:30 IST