‘కులం’ ఎక్కడిది?
ABN , First Publish Date - 2020-12-26T07:42:12+05:30 IST
‘అన్ని కులాలకు చోటు లేని అమరావతి ఎందుకు.?......
- కోర్టు తీర్పునూ వక్రీకరిస్తారా!
- జగన్ వ్యాఖ్యలపై రాజధాని రైతుల విస్మయం
- అమరావతిలో పేదలకు 5 వేల ఎకరాలు కేటాయించాం
- 5 వేల ఇళ్లు కట్టినా పేదలకు ఇవ్వని జగన్: శ్రావణ్
గుంటూరు, డిసెంబర్ 25(ఆంధ్రజ్యోతి): ‘అన్ని కులాలకు చోటు లేని అమరావతి ఎందుకు?’... అని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై రాజధాని ప్రాంత రైతులు విస్మ యం వ్యక్తం చేశారు. సీఎం స్థాయిలో ఆయన హైకోర్టు తీర్పును వక్రీకరించి, అవస్తవాలు చెప్పడం సరికాదన్నారు. రాజధాని కోసం రైతులను ఇచ్చిన భూములను ఇళ్ల స్థలాలకు ఇస్తామనడం, మాస్టర్ ప్లాన్‌లోని జోన్లను మార్చడంపైనే కోర్టును ఆశ్రయించినట్లు గుర్తు చేశారు. పిటిషన్లలో ఎక్కడా కుల ప్రస్తావన లేదని తెలిపారు. ఇదే అంశంపై తాడికొండ మాజీ ఎమ్మెల్యే ఒక ప్రకటన జారీ చేశారు. ‘‘రాజధాని ప్రాంతంలో స్థానికులకు కాకుండా బయటి వారికి ఇవ్వడాన్ని తప్పు పడుతూ కోర్టు ను ఆశ్రయించడం జరిగింది. పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించడాన్ని అటు రైతు లు గానీ, హైకోర్టు గానీ తప్పు పట్టలేదు. అంతేగాకుండా ఇచ్చిన స్థలాలను ఏడాది తర్వాత విక్రయించుకోవచ్చునన్న జీవో చట్ట విరుద్ధం కాబట్టే కోర్టు దీనిని తప్పుపట్టింది’’ అని శ్రావణ్ కుమార్ తెలిపారు. నిజానికి... రాజధానిలో పేదలు కూడా ఉండాలనే ఉద్దేశంతోనే 5వేల ఎకరాలు కేటాయించామన్నారు. టీడీపీ ప్రభుత్వం 8 వేల మందికి ఇళ్లు కేటాయించిందని, 5024 ఇళ్లు కట్టించి సిద్ధం చేసిందని తెలిపారు. ‘‘పేదల కోసం రాజధాని ప్రాం తంలో తమ ప్రభుత్వం కట్టించిన ఈ ఇళ్లను జగన్ సర్కారు లబ్ధిదారులకు ఇవ్వకుండా పాడుబెట్టడంపై కూడా నేను కోర్టును ఆశ్రయించాను అయినా ఏదో ఒక సాకు చెబుతూ వాటిని ఇప్పటివరకూ అలాగే ఉంచారు’’ అని శ్రావణ్ తెలిపారు.
కళ్లుండీ చూడలేని జగన్: కొలికపూడి
‘‘అమరావతిలో అన్ని కులాలు, మతాలు, సంస్కృతుల ప్రజలు కలిసి జీవిస్తున్నా, కళ్లుండి సీఎం జగన్ చూడలేకపోతున్నారు. స్థలాల పంపిణీ సభలో సీఎం జగన్ చేసిన ప్రకటనను ఖండిస్తున్నాం’’ అని ఏపీ రాజధాని పరిరక్ష ణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు. అమరావతిలో కేవలం ఒకే సామాజికవర్గం కనపడడం ఆయన సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని మండిపడ్డారు.