సుప్రీంకు వెళ్లి.. ఏం సాధించారు?

ABN , First Publish Date - 2020-03-19T10:00:58+05:30 IST

కరోనాపై మొత్తం దేశమంతా కలవరపడుతుంటే.. ఎన్నికలే కావాలన్న మొండి పట్టుదలతో సుప్రీంకోర్టుకు వెళ్లి రాష్ట్రప్రభుత్వం ఏం సాధించిందని మాజీ ముఖ్యమంత్రి...

సుప్రీంకు వెళ్లి.. ఏం సాధించారు?

  • కోర్టు మొట్టికాయ వేసింది
  • ఎవరి పరిధేంటో తేల్చేసింది
  • కరోనాపై చేతులు కట్టుకుని కూర్చున్నారు
  • చంద్రబాబు ఆగ్రహం


అమరావతి, మార్చి 18(ఆంధ్రజ్యోతి): కరోనాపై మొత్తం దేశమంతా  కలవరపడుతుంటే.. ఎన్నికలే కావాలన్న మొండి పట్టుదలతో సుప్రీంకోర్టుకు వెళ్లి రాష్ట్రప్రభుత్వం ఏం సాధించిందని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల వాయిదాను సమర్థించి సుప్రీంకోర్టు మొట్టికాయ వేసిందని, ఎన్నికల సంఘం నిర్ణయంలో జోక్యం చేసుకోబోమని చెప్పడం ద్వారా ఎవరి పరిధి ఏమిటో తేటతెల్లం చేసిందని వ్యాఖ్యానించారు. బుధవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ బాధ్యతారాహిత్యం తెలిసిపోయిందని, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కమిషనర్‌ ఎన్నికల వాయిదాకు నిర్ణయం తీసుకుంటే ఆయన్ను తిట్టిపోశారని తప్పుబట్టారు. ఈరోజు కూడా ఒక వైసీపీ ఎమ్మెల్యే కమిషనర్‌ను వెధవ అని తిట్టాడని ఆక్షేపించారు. ఇప్పటివరకూ జరిగిన ఎన్నికలు రద్దు చేసి మళ్లీ కొత్తగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని అన్ని ప్రతిపక్షాలు కోరుతున్నాయని, దానిపై కార్యాచరణను త్వరలోనే ఖరారు చేస్తామని చెప్పారు. కరోనా నిరోధానికి తీసుకోవలసిన జాగ్రత్తలపై పార్టీ ప్రచురించిన కరపత్రం, పుస్తకాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు విడుదల చేశారు. ఇంకా ఏమన్నారంటే..

కమిషనర్‌ చెప్పినా వినిపించుకోలేదు

‘ఎన్నికలు వాయిదా పడితే రూ.5 వేల కోట్లు రావని జపం చేశారు. కానీ సుప్రీంకోర్టులో ఆ విషయమే చెప్పలేదు. తీర్పులోనూ ఆ ప్రస్తావన లేదు. విజ్ఞతతో ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకుంటే దానిని ఆమోదించాల్సిందిపోయి తిట్టి పోస్తారా? స్పీకర్‌ పదవిలో ఉండి మాట్లాడే పద్ధతి అదేనా? మేం తిట్టలేమా? మాకు సభ్యత, సంస్కారం ఉన్నాయి కాబట్టి మాట్లాడలేదు.’

ఏదీ చేయనది మనమే!

‘కరోనాపై దేశం మొత్తం ఎలా స్పందిస్తోంది? మన రాష్ట్రం ఏం చేస్తోంది? దేశంలో 16 రాష్ట్రాలు విద్యా సంస్థలు, పబ్లిక్‌ ప్రదేశాలను మూసివేశాయి. ఏదీ చేయనిది మన రాష్ట్రం ఒక్కటే. చివరకు ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఆలయాలు కూడా మూసివేస్తున్నారు.  కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం గత కొద్ది రోజుల్లో 11 వేల మంది విదేశాల నుంచి మన రాష్ట్రంలోకి వచ్చారు. వారిని గుర్తించి పరీక్షలు చేశారా? ఏకాంత వాసంలో ఉంచారో లేదో ఎవరికీ తెలియదు. రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతున్నా ఎన్నికలు ఎక్కడ వాయిదా పడతాయోనని వాటిని బయట పెట్టడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.’

ప్రయోగాలు చేసి కనుక్కున్నారా?

పారసిటమల్‌, బ్లీచింగ్‌ పౌడర్‌తో కరోనా పోతుందని ప్రయోగాలు చేసి కనుక్కున్నారా? కనుక్కుంటే అదే విషయం చెప్పండి. ప్రపంచమంతా దానిని వాడుకుంటుంది. నోబుల్‌ ప్రైజ్‌ కూడా వస్తుంది. బ్లీచింగ్‌ పౌడర్‌ ఎవరిపై చల్లుతారు? మనిషిపై చల్లుతారా? కరోనా వైరస్‌ నిరంతర ప్రక్రియ అని ముఖ్యమంత్రి తానే తీర్పు ఇచ్చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు చూసి దేశమంతా నవ్వుకుంటోంది. ఒకోసారి తప్పు జరగవచ్చు. దానిని సమర్థించుకోకూడదు. సుప్రీంకోర్టుకు న్యాయవాదులు కూడా రావొద్దని చెబుతుంటే అదే కోర్టుకు ఎన్నికలు పెడతామని వెళ్తారా? జగన్‌ ఒక వ్యక్తిగా ఏది మాట్లాడినా ఇబ్బంది లేదు. కానీ ముఖ్యమంత్రిగా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. బయటి దేశాల నుంచి ఎవరు  వచ్చినా వారిని 14 రోజులపాటు కచ్చితంగా ఏకాంతవాసంలో ఉంచేలా జాగ్రత్తలు పాటిస్తున్నారని, జగన్‌ కుమార్తెలిద్దరూ విదేశాల నుంచి తిరిగి వచ్చారని వింటున్నాం. వారిని ఆయన ఏకాంతవాసంలో ఉంచారో లేదో తెలియదు. మన రాష్ట్రానికి చెందిన విద్యార్థులు, ఉద్యోగులు ప్రపంచమంతటా ఉన్నారు. ఒక్క గల్ఫ్‌లోనే ఐదు లక్షల మంది ఉన్నారు. ఆ దేశాల నుంచి అందరినీ పంపించి వేస్తున్నారు. వారు ఇక్కడకు వచ్చినప్పుడు చేయాల్సిన పరీక్షలు, ఏకాంతవాసానికి ఏర్పాట్ల  వంటి వాటి విషయంలో ప్రభుత్వంలో జాగ్రత్త లోపిస్తోంది. అందరూ తిరిగే ఆస్పత్రుల్లో ఏకాంతవాస ఏర్పాట్లు చేయడం సరికాదు. కొంత దూరంగా వేరేచోట్ల ఆ ఏర్పాట్లు చేయాలి. ఇటువంటి సమయంలో ప్రజలే ఎవరి జాగ్రత్తలు వారు పాటించాలి. ప్రతి కుటుంబంలో ఎవరికి వారుగా చర్చించుకుని జాగ్రత్తలు తీసుకోవాలి. సామాజిక బాధ్యతగా కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ ఒక పుస్తకం.. ఒక కరపత్రం ప్రచురించాం.’


ఉన్మాదానికి మందులేదు..

విశాఖకు తరలివెళ్లడానికి ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని సచివాలయ ఉద్యోగ సంఘం చెప్పడాన్ని ప్రస్తావించినప్పుడు.. ఉన్మాదానికి మందు లేదని చంద్రబాబు తెలిపారు. కొన్నింటికి కాలమే సమాధానం చెబుతుందన్నారు.


Updated Date - 2020-03-19T10:00:58+05:30 IST