అన్న వచ్చి ఏం చేశాడు?

ABN , First Publish Date - 2020-12-30T08:27:51+05:30 IST

‘అన్న వస్తున్నాడు.. అంటూ ఊదరగొట్టారు. వచ్చి ఏం పీకాడు, ఏపీని రైతులు లేని రాష్ట్రంగా చేస్తున్నాడు’ అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు.

అన్న వచ్చి ఏం చేశాడు?

19 నెలల్లో 767 మంది రైతుల ఆత్మహత్య.. ఏపీని రైతులు లేని రాష్ట్రంగా చేస్తున్నాడు

  • ఇంత దరిద్రపు పాలన ఎప్పుడూ చూడలేదు
  • రాష్ట్రంలో రౌడీరాజ్యం: నారా లోకేశ్‌ ధ్వజం
  • ప్రకాశం జిల్లాలో దెబ్బతిన్న పంటల పరిశీలన
  • ఎకరాకు 50 వేల పరిహారానికి డిమాండ్‌
  • జగన్‌ పత్రిక ప్రతులను తగలబెట్టిన రైతులు
  • పలు నియోజకవర్గాల్లో టీడీపీ రచ్చబండ 


అమరావతి(ఆంధ్రజ్యోతి),మార్కాపురం, శావల్యాపురం, డిసెంబరు 29: ‘అన్న వస్తున్నాడు.. అంటూ ఊదరగొట్టారు. వచ్చి ఏం పీకాడు, ఏపీని రైతులు లేని రాష్ట్రంగా చేస్తున్నాడు’ అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. ‘రైతుల కోసం తెలుగుదేశం’ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మేడపి, దోర్నాల మండలం యడవల్లిల్లో నివర్‌ తుఫాన్‌కు దెబ్బతిన్న మిరప, బొప్పాయి పంటలను మంగళవారం ఆయన పరిశీలించారు. రైతులతో ముఖాముఖి నిర్వహించి నష్టం వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక 19 నెలల కాలంలో 767 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఏపీలో ఇంత దరిద్రపు పాలన ఎప్పుడూ చూడలేదన్నారు. సీఎంకు విమానాల్లో తిరిగేందుకు, వ్యవసాయ మంత్రికి రికార్డింగ్‌ డ్యాన్సులు చూసేందుకు ఉన్న శ్రద్ధ పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు లేదన్నారు. రాష్ట్రాన్ని దున్నపోతు పాలిస్తోందని, దాన్ని అదిలించడానికి ప్రజలు ముళ్లకర్రలు సిద్ధం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. టీడీపీ ఏర్పాటుచేసిన బృందాలు తుఫాన్‌కు దెబ్బతిన్న పంటలను పరిశీలించి రాష్ట్రంలో సుమారు రూ.10 వేల కోట్ల నష్టం వాటిల్లిందని అంచనాలు వేశాయన్నారు. కానీ, ప్రభుత్వం మొక్కుబడిగా కేవలం రూ.600 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొందన్నారు.


అసెంబ్లీలో చంద్రబాబునాయుడు ప్రశ్నించిన తర్వాతే రైతులకు బీమా డబ్బులు మంజూరు చేశారన్నారు. రైతు రాజ్యమని చెప్పుకుంటున్న వైసీపీ నేతలు రాష్ట్రంలో రౌడీరాజ్యాన్ని నెలకొల్పారన్నారు. నివర్‌ తుఫాన్‌ కారణంగా నష్టపోయిన రైతులకు వరికి ఎకరాకు రూ.30 వేలు, ఉద్యాన పంటలకు రూ.50వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు పాలనలో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి తక్షణమే రూ.3,500 కోట్లు విడుదల చేశారన్నారు. రైతులతో ముఖాముఖి సందర్భంగా మంగళవారం జగన్‌ పత్రికలో ‘రైతులకు ముందే వచ్చిన సంక్రాంతి’ అంటూ వచ్చిన ప్రకటనపై  లోకేశ్‌ రైతుల అభిప్రాయాలు అడిగారు. అదంతా అబద్ధమని చెప్పిన రైతులు అక్కడే జగన్‌ పత్రిక ప్రతులను తగులబెట్టారు. 


పంట నష్టం జాబితాల దహనం

‘రైతు కోసం తెలుగుదేశం’ ఆం దోళనల్లో భాగంగా మంగళవారం టీడీపీ నేతలు పలు నియోజకవర్గాల్లో రచ్చబండ సమావేశాలు నిర్వహించారు. పంట నష్టం ఎ న్యూమరేషన్‌లో అక్రమాలపై ధ్వజమెత్తారు. ఆ జాబితాలను దహనం చేశారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో లోకేశ్‌, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. కృష్ణాజిల్లా కంచికచర్ల మండలంలో మాజీ మంత్రులు దేవినేని ఉమా, నెట్టెం రఘురామ్‌, తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో పత్తిని రోడ్డుపై వేసి దహనం చేశారు. వివిధ నియోజకవర్గాల్లో పార్టీ రాష్ట్ర, జిల్లా, స్థానిక నాయకులు ఆందోళనల్లో పాల్గొన్నారు. 


సుబ్బయ్య హత్యకు నిరసనగా కొవ్వొత్తుల ప్రదర్శన

వైసీపీ నాయకులు హత్యా రాజకీయాలకు పాల్పడితే సహించేది లేదని లోకేశ్‌ హెచ్చరించారు. పొద్దుటూరులో టీడీపీ అధికార ప్రతినిధి సుబ్బయ్య హత్యకు నిరసనగా గుంటూరు జిల్లా శావల్యాపురంలో నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శనలో లోకేశ్‌ పాల్గొన్నారు. టీడీపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రొద్దుటూరులో బుధవారం సుబ్బయ్య అంత్యక్రియలకు లోకేశ్‌ హాజరుకానున్నారు.

Updated Date - 2020-12-30T08:27:51+05:30 IST