-
-
Home » Andhra Pradesh » what business do the police have assigned lands
-
ఇలాగైతే కేంద్ర హోం శాఖకు లేఖ రాస్తామంటూ హెచ్చరిక
ABN , First Publish Date - 2020-03-13T08:21:21+05:30 IST
‘ఇళ్ల స్థలాల పంపిణీ’ పేరుతో ఒకరి భూమిని తీసుకుని మరొకరికి ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది. గతంలో పంపిణీ చేసిన భూములకు పరిహారం చెల్లించి వెనక్కి...

అసైన్డ్ భూముల్లో పోలీసులకేం పని?
ఒకరి భూమి తీసుకుని మరొకరికా?..
భూములివ్వని ఎస్సీ, ఎస్టీలపై కేసులా?
ఇలాగైతే కేంద్ర హోం శాఖకు లేఖ రాస్తాం..
రికార్డుల్లో పేర్లు తారుమారు
బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోక తప్పదు
ఇంటి స్థలాలకోసం భూసేక‘రణం’పై హైకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం
అమరావతి, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): ‘ఇళ్ల స్థలాల పంపిణీ’ పేరుతో ఒకరి భూమిని తీసుకుని మరొకరికి ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది. గతంలో పంపిణీ చేసిన భూములకు పరిహారం చెల్లించి వెనక్కి తీసుకోవడం... వాటిని మళ్లీ వేరొకరికి ఇవ్వడమంటే ట్యాక్స్ పేయర్ల సొమ్ము (ప్రజా ధనం)ను దుర్వినియోగం చేయడమేనని అభిప్రాయపడింది.
సుదీర్ఘకాలంగా సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూముల్ని బలవంతంగా తీసుకుని వేరొకరికి ఎలా కేటాయిస్తారని నిలదీసింది. పేదలకు ఇంటి స్థలాలకోసం జరుగుతున్న భూసేకరణపై దాఖలైన వ్యాజ్యాల్లో గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన త్రిసభ ధర్మాసనం విచారణ జరిపింది. ‘‘తమ అసైన్డ్ భూముల్ని అప్పగించేందుకు అంగీకరించని ఎస్సీ, ఎస్టీలపై కేసులు పెడతారా? ఇది సరైనా చర్యేనా?’ అని నిలదీసింది. కొందరు రెవెన్యూ అధికారులు భూరికార్డుల్లో పేర్లను తారుమారు చేస్తున్నారని, ఇందుకు బాధ్యులైన అధికారులపైనా చర్యలు తప్పవని... అలాంటి వారిపై 467, 468 సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
‘‘అసలు రాష్ట్రంలో చట్ట నిబంధనలు అమలవుతున్నాయా? ఇది రాష్ట్రమా మరేమైనానా? అసైన్డ్ భూముల్లోకి పోలీసులు వెళ్లి బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. వారికి అక్కడేం పని’’ అని నిలదీసింది. పోలీసుల చర్యలు హద్దు మీరుతున్నాయని, ఇలాగైతే కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తామని మిగతాది కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుందని హెచ్చరించింది. గురువారం హైకోర్టుకు హాజరైన డీజీపీని ఉద్దేశించి... ‘‘ఆయన తగు చర్యలకు ఉపక్రమించాలి. ఇలాంటి సంఘటనల వల్లే ఆయనను హైకోర్టుకు పిలిపించాల్సి వచ్చింది’’ అని వ్యాఖ్యానించింది. అలాగే... ఇళ్ల స్థలాల కోసం ఆయా భూముల్లో ఉన్న చెట్లను నరకడం నేరమని, సుప్రీంకోర్టు సైతం దీనిని తీవ్రంగా పరిగణించిందని ధర్మాసనం గుర్తు చేసింది. చెట్ల నరికివేతకు బాధ్యులైన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించింది.
కోడ్ వేళ.. ఇళ్ల స్థలాల పంపిణీ వద్దు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన వచ్చినందున ఇళ్ల స్థలాల పంపిణీ చేపట్టరాదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం మార్చిలోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్నారని, మరోవైపు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు హడావుడిగా భూములు సమీకరిస్తున్నారని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది.
వీటిపైనే విచారణ...
రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది దళితులు, గిరిజనులకు చెందిన అసైన్డ్ భూములను ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకుంటోందని... కనీస హెచ్చరికలు లేకుండానే భూములు లాక్కుంటోందని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. విశాఖ జిల్లాలో ఇళ్ల స్థలాల పంపిణీ కోసం నిబంధనలకు విరుద్ధంగా 6 వేల ఎకరాలకు పైగా అసైన్డ్ భూముల్ని సమీకరిస్తున్నారంటూ ‘భూసేకరణ ల్యాండ్ పూలింగ్ రైతు కూలీ నిర్వాసితుల సంక్షేమ సంఘం’ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంతోపాటు ఇదే జిల్లా దొండపూడిలో తమ వ్యవసాయ భూముల్లో తహసీల్దార్ జోక్యాన్ని సవాలు చేస్తూ 74 మంది దాఖలు చేసిన పిటిషన్‌పైనా ధర్మాసనం విచారణ జరిపింది.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా గర్హించింది. గత ఏడాది నుంచి తీసుకున్న భూముల ఆర్‌ఎ్‌సఆర్, అడంగల్ రికార్డులను తమ ముందుంచాలని ఆదేశించింది. భూముల స్వాధీనానికి 30 రోజుల ముందుగా నోటీసులు ఇవ్వాల్సి ఉందని... కానీ, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని రైతు కూలీల నిర్వాసితుల సంఘం తరఫు న్యాయవాది ధర్మాసనానికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరాం వాదనలు వినిపిస్తూ.. విశాఖలో చాలా వరకు యజమానుల అంగీకారంతోనే భూములు తీసుకుంటున్నామన్నారు. ప్రజా ప్రయోజనం కోసం భూములు తీసుకోవచ్చని తెలిపారు. భూములిస్తున్న వారికి తగిన పరిహారం చెల్లిస్తున్నామన్నారు.