అతితీవ్ర తుఫాన్‌గా ‘ఆంఫన్‌’

ABN , First Publish Date - 2020-05-18T08:58:50+05:30 IST

ఆగ్నేయ బంగాళా ఖాతంలో కేంద్రీకృతమైన ‘ఆంఫన్‌’ తుఫాన్‌ ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దశల్లో బలపడింది.

అతితీవ్ర తుఫాన్‌గా ‘ఆంఫన్‌’

  • అతితీవ్ర తుఫానుగా ఆంఫన్‌
  • పెనుతుఫానుగా మారే అవకాశం.. 
  • 20న తీరం దాటుతుందని అంచనా
  • ఉత్తర కోస్తాకు భారీ వర్షసూచన 
  • అల్లకల్లోలంగా బంగాళాఖాతం 
  • మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు 
  • వాతావరణ శాఖ హెచ్చరికలు 
  • అండమాన్‌లో ‘నైరుతి’ ప్రవేశం 
  • భీకరంగా మారే అవకాశం


అమరావతి/విశాఖపట్నం/న్యూఢిల్లీ, మే 17(ఆంధ్రజ్యోతి): ఆగ్నేయ బంగాళా ఖాతంలో కేంద్రీకృతమైన ‘ఆంఫన్‌’ తుఫాన్‌ ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దశల్లో బలపడింది. ఉదయానికి తీవ్ర తుఫాన్‌గా, సాయంత్రానికి అతి తీవ్రతుఫాన్‌గా మారింది. పారాదీ్‌పకు దక్షిణంగా 925 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్‌లోని డిఘాకు దక్షిణ నైరుతిగా 1,108 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న 24గంటల్లో మరింత బలపడి పెనుతుఫాన్‌గా (ఎక్స్‌ట్రీమ్లీ సీవియర్‌ సైక్లోన్‌) మారనున్నది. ఈ క్రమంలో తొలుత నెమ్మదిగా 12 గంటలపాటు ఉత్తరదిశగా పయనించి ఆ తరువాత దిశమార్చుకుని ఉత్తర ఈశాన్యంగా పయనిస్తుంది. తరువాత వేగం పెంచుకుంటూ వాయవ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం డైరెక్టర్‌ విజయభాస్కర్‌ తెలిపారు.


వాయవ్య బంగాళాఖాతం మీదుగా 20న మధ్యాహ్నం లేదా సాయంత్రం పశ్చిమ బెంగాల్‌లో సాగర్‌ దీవులు, బంగ్లాదేశ్‌లో హతియా దీవుల మధ్య తీరం దాటనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తుఫాన్‌ ప్రభావంతో కోస్తాంధ్రలో ఆదివారం 30-40కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడ్డాయి. సోమ, మంగళవారాల్లోనూ రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరుగా, ఉత్తరకోస్తాలో ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. రాయలసీమలో 41-43డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.  ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. 


ఒడిశా, బెంగాల్‌పై తీవ్ర ప్రభావం 

‘ఆంఫన్‌’ తుఫాన్‌ ప్రభావంతో ఒడిశా తీరప్రాంతం, పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో తీవ్ర పెనుగాలులతో పాటు భారీనుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. ఈ నెల 19, 20 తేదీల్లో ఉత్తర, దక్షిణ 24పరగణా జిల్లాలు, పశ్చిమ, తూర్పు మిడ్నాపూర్‌, కోల్‌కతా, హౌరా, హుగ్లీలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే ఒడిశాలో గజపతి, గంజాం, పూరి, జగత్సింగపూర్‌, కేంద్రపారా జిల్లాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. 


ఉత్తర కోస్తాకు భారీ వర్షసూచన 

నైరుతి ఆగమనం 

జూన్‌ మొదటి వారంలో కేరళకు 

10లోగా రాష్ట్రానికి రుతుపవనాలు

రైతులకు భారత వాతావరణశాఖ చల్లని కబురు అందించింది. దక్షిణ బంగాళాఖాతం, నికోబార్‌ దీవులు, అండమాన్‌ సముద్రంలో కొన్ని ప్రాంతాలకు ఆదివారం నైరుతీ రుతుపవనాలు ప్రవేశించాయని ప్రకటించింది. రానున్న రెండు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్‌ సముద్రంలో మిగిలిన ప్రాంతాలు, అండమాన్‌ దీవులు, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఇవి విస్తరించే అవకాశం ఉందని తెలిపింది.  ఈ నేపథ్యంలో కేరళకు జూన్‌ మొదటివారంలోగా, 10లోగా రాష్ట్రంలోకి వచ్చే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. 


20నుంచి కోస్తాలో వడగాడ్పులు 

బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌ తీరం దాటే క్రమంలో కోస్తాలో వడగాడ్పులు వీయనున్నాయి. ఈ నెల 20నుంచి 24 వరకు పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగనున్నాయి. ఈ నెల 22, 23 తేదీల్లో పశ్చిమగోదావరి నుంచి నెల్లూరు వరకు అక్కడక్కడా 45డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని ఇస్రో వాతావరణ నిపుణుడు తెలిపారు.  భూ ఉపరితలంలోని మొత్తం తేమను తుఫాన్‌ తీసుకెళ్తుందని, దీంతో కోస్తాలో వడగాడ్పుల తీవ్రత కొనసాగుతుందన్నారు.  

Updated Date - 2020-05-18T08:58:50+05:30 IST