సభలో, మండలిలో నిలదీస్తాం: టీడీపీ
ABN , First Publish Date - 2020-06-16T17:12:28+05:30 IST
బీఏసీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

అమరావతి: బీఏసీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్నదానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సభ ప్రారంభం నుంచి ఆందోళనలు చేస్తోంది. సభలో తమ తమ స్థానాలవద్ద నిలుచుని తమ నాయకుల అక్రమ అరెస్టులకు నిరసన తెలిపారు. చివరికి గవర్నర్ ప్రసంగం మధ్యలోనే వాకౌట్ చేసి బయటకు వచ్చారు. గవర్నర్ ప్రసంగంలో ప్ర:భుత్వం అన్ని అబద్దాలు చెప్పించిందని టీడీపీ నేతలు విమర్శించారు. అలాగే ప్రభుత్వ వైఫల్యాలపై సభలో, మండలిలో నిలదీస్తామన్నారు.
స్పీకర్ తమ్మినేని సీతారాం నేతృత్వంలో బీఏసీ సమావేశం ప్రారంభమైంది. టీడీపీ తరఫున అచ్చెన్నాయుడు హాజరయ్యేవారు. ఈసారి మరోనేత నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. మొత్తం 16 అంశాలను బీఏసీ సమావేశంలో లేవనెత్తడంతోపాటు అయా అంశాలకు చర్చకు సంబంధించి సమయం కేటాయించాలని గట్టిగా డిమాండ్ చేయాలని టీడీపీ నిర్ణయించుకుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన తర్వాత తమ నాయకుల అక్రమ అరెస్టులు, కరోనా వ్యాప్తి నివారణలో ప్రభుత్వం విఫలం, అమరాతి నిర్మాణంలో ప్రభుత్వం వైఫల్యం, ప్రత్యేక హోదా సాధించడంలో ప్రభుత్వం విఫలం, పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో భూముల సేకరణ, అక్రమ ఇసుక తరలింపు, దళితులపై దాడులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిధులను ఇతర సంక్షేమ పథకాలకు తరలించడం తదితర అంశాలపై చర్చ చేపట్టడానికి ఈ సమావేశాల్లో సమయం కేటాయించాలని టీడీపీ డిమాండ్ చేయనుంది.