పన్నుల పెంపును అడ్డుకుంటాం

ABN , First Publish Date - 2020-12-30T09:14:54+05:30 IST

సంస్కరణల పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి, నీరు, సీవరేజ్‌ పన్నులను పెంచడాన్ని అడ్డుకుని తీరతామని ఆంధ్రప్రదేశ్‌ పట్టణ పౌర సమాఖ్య హెచ్చరించింది. కరోనా విపత్తు నేపథ్యంలో పన్ను పెంపు యోచనకు వెంటనే స్వస్తి పలకాలని డిమాండ్‌ చేసింది.

పన్నుల పెంపును అడ్డుకుంటాం

  • 10 లక్షల సంతకాలు సేకరిస్తాం 
  • 6న మున్సిపాలిటీల వద్ద ఆందోళన
  • సంక్రాంతి తర్వాత భారీ ఉద్యమం
  • ఏపీ పట్టణ పౌర సమాఖ్య హెచ్చరిక 

అమరావతి, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): సంస్కరణల పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి, నీరు, సీవరేజ్‌ పన్నులను పెంచడాన్ని అడ్డుకుని తీరతామని ఆంధ్రప్రదేశ్‌ పట్టణ పౌర సమాఖ్య హెచ్చరించింది. కరోనా విపత్తు నేపథ్యంలో పన్ను పెంపు యోచనకు వెంటనే స్వస్తి పలకాలని డిమాండ్‌ చేసింది.  విజయవాడలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ‘సమాఖ్య’ కన్వీనర్‌ సీహెచ్‌ బాబూరావు మాట్లాడుతూ దీనిపై తాము రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పట్టణ ప్రజాభేరి యాత్రలు విజయవంతమయ్యాయని చెప్పారు. పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ ఆస్తి పన్నులు 15 శాతానికి మించి పెరగబోవని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.


పొరుగునున్న తెలంగాణలో ఈ పన్నులను సగానికి తగ్గించగా, జగన్‌ సర్కారు మాత్రం భారీగా పెంచనుండటం గర్హనీయమన్నారు. దీనిపై 10 లక్షల సంతకాల సేకరణ, వార్డు సచివాలయాల ముంగిట నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. వచ్చే నెల 6న అన్ని మున్సిపల్‌ కార్యాలయాల ఎదుట ఆందోళనలు జరుపుతామని, అప్పటికీ ప్రభుత్వం దిగిరాకుంటే సంక్రాంతి తర్వాత అన్ని సంఘాలు, రాజకీయ పక్షాలు, సంస్థలు, అపార్ట్‌మెంట్‌-కాలనీ అసోసియేషన్లు కలుపుకొని ఉద్యమిస్తామన్నారు.

Updated Date - 2020-12-30T09:14:54+05:30 IST