జల వివాదాలపై మౌనమేల?

ABN , First Publish Date - 2020-07-05T09:30:12+05:30 IST

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ విస్తరణ కోసం ఆంధ్రప్రదేశ్‌ జారీ చేసిన 203 నంబరు జీవోపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఏపీ సీఎం

జల వివాదాలపై మౌనమేల?

  • జీఆర్‌ఎంబీ, కేఆర్‌ఎంబీలకు పరస్పరం ఫిర్యాదులు
  • కేంద్రానికి నివేదించిన గోదావరి, కృష్ణా బోర్డులు
  • ‘అపెక్స్‌’ ముందుకు వెళ్లని రెండు ప్రభుత్వాలు
  • సామరస్య పరిష్కారానికి సీఎంల యోచన!


అమరావతి, జూలై 4(ఆంధ్రజ్యోతి): పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ విస్తరణ కోసం ఆంధ్రప్రదేశ్‌ జారీ చేసిన 203 నంబరు జీవోపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి కూడా అదేస్థాయిలో స్పందించారు. కృష్ణా నదీ వివాదాల ట్రైబ్యునల్‌ ఆదేశాల మేరకు నీటిని వాడుకుంటామని.. శ్రీశైలం జలాశయం నుంచి తెలంగాణతో సమానంగా 800 అడుగుల నుంచి నీటిని వినియోగించుకుంటామని స్పష్టం జేశారు. రాష్ట్ర విభజన చట్టం మార్గదర్శకాలకు విరుద్ధంగా కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలు జరిగాయంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు పరస్పరం గోదావరి నదీ జల యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ), కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)లకు ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదులపై గత నెల 4,5 తేదీల్లో హైదరాబాద్‌లో కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీలు సమావేశాలు నిర్వహించి మినిట్స్‌ సిద్ధం చేశాయి. రెండు రాష్ట్రాల ఫిర్యాదులను, తాము సిద్ధం చేసిన మినిట్స్‌ను, వాటికి రెండు రాష్ట్రాలూ ఇచ్చిన సమాధానాలను బోర్డులు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాయి. ఈ సమస్యలో జోక్యం చేసుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖను కోరాయి. అయితే జల వివాదాల శాశ్వత పరిష్కారానికి కేంద్ర జలశక్తి మంత్రి అధ్యక్షతన ఏర్పడ్డ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మినిట్స్‌ను, తేదీని ఖరారు చేయడం లేదు. ఈ విషయంలో రెండు రాష్ట్రాలూ మౌనం పాటిస్తున్నాయి. అయితే జల వివాదాన్ని కేంద్రం చేతుల్లో పెట్టేందుకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుముఖంగా లేరని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పరస్పరం చర్చించి సమస్యను పరిష్కరించుకోవాలన్న అభిప్రాయంతో ముఖ్యమంత్రులు ఉన్నారని అంటున్నారు.

Updated Date - 2020-07-05T09:30:12+05:30 IST