108 కోసం ఎదురు చూస్తూ ఆగిన ఊపిరి

ABN , First Publish Date - 2020-08-12T09:11:18+05:30 IST

శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడిన ఓ వ్యక్తి 108 వాహనం కోసం అరగంట వేచి చూసి చి వరకు రోడ్డుపైనే కుప్పకూలి మృతిచెందాడు. విశాఖ పరిధిలోని

108 కోసం ఎదురు చూస్తూ ఆగిన ఊపిరి

  • మృతుడు ఎల్‌జీ పాలిమర్స్‌ ప్రమాద బాధితుడు 

గోపాలపట్నం (విశాఖపట్నం), ఆగస్టు 11: శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడిన ఓ వ్యక్తి 108 వాహనం కోసం అరగంట వేచి చూసి చి వరకు రోడ్డుపైనే కుప్పకూలి మృతిచెందాడు. విశాఖ పరిధిలోని గోపాలపట్నం పెట్రోల్‌ బంక్‌ కూడలిలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీ సమీపాన ఉన్న వెంకటాపురానికి చెందిన గాలి రవిశంకర్‌(32) రెండు రోజుల క్రితం అస్వస్థత కు గురయ్యాడు. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో కుటుంబసభ్యులు బంక్‌ కూడలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్య సేవలు లేవని చెప్పడంతో సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లగా వైద్యులు ప్రథమ చికిత్స చేసి, నగరంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. అక్కడ నుంచి తన బంధువుకు చెందిన ద్విచక్ర వాహనంపై బంక్‌ కూడలికి వచ్చిన రవిశంకర్‌ ఫుట్‌పాత్‌పైనే కూర్చుని 108 వాహనం కోసం ఎదురుచూశాడు.


అరగంట గడిచినా వాహనం రాలేదు. ఇంతలో తీవ్ర అస్వస్థతకు గురైన రవిశంకర్‌ శ్వాస అందక ఫుట్‌పాత్‌పైనే కుప్పకూలిపోయాడు. వెంటనే అతడి బంధువులు సపర్యలు చేసి ఓ ప్రైవేటు వాహనంలో నగరంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. రవిశంకర్‌కు భార్య, ఆరు నెలల కుమార్తె ఉన్నారు. రవిశంకర్‌ ఎల్‌జీ పాలిమర్స్‌ప్రమాదంలో అస్వస్థతకు గురై కేజీహెచ్‌లో చికిత్సపొందాడు.

Updated Date - 2020-08-12T09:11:18+05:30 IST