వీటీపీఎస్‌ బంద్‌!

ABN , First Publish Date - 2020-05-11T09:25:35+05:30 IST

విజయవాడ సమీపంలోని వీటీపీఎస్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో 6 యూనిట్ల మూతకు రంగం సిద్ధమవుతోంది.

వీటీపీఎస్‌ బంద్‌!

  • ఆరు యూనిట్ల మూతకు రంగం సిద్ధం
  • 1,260 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిపివేత?
  • కమిటీ ఏర్పాటు చేసిన ఇంధన శాఖ
  • నెలలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం
  • ఎథెనా ప్లాంట్‌ కొనుగోలుకు దారి సుగమం?


అమరావతి, మే 10(ఆంధ్రజ్యోతి): విజయవాడ సమీపంలోని వీటీపీఎస్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో 6 యూనిట్ల మూతకు రంగం సిద్ధమవుతోంది. దీనిపై సిఫారసులు చేయడానికి ఇంధన శాఖ ఒక కమిటీని వేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక డిస్కమ్‌కు గతంలో సీఎండీగా పనిచేసిన గోపాలరెడ్డిని దీనికి చైౖర్మన్‌గా నియమించారు. ఈ కమిటీ నెలలో నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. పాత థర్మల్‌ విద్యుత్కేంద్రాల్లో కాలుష్యం తగ్గడానికి అదనపు ఏర్పాట్లు చేసుకోవాలని.. లేని పక్షంలో వాటిని మూసివేయాలని కేంద్ర పర్యావరణ శాఖ కొన్నాళ్లక్రితం ఆదేశించింది. ఆ జాబితాలోకి వీటీపీఎ్‌సలోని 6 యూనిట్లు వచ్చాయి.


ఇందులో ఒక్కో యూనిట్‌ విద్యుదుత్పత్తి సామర్థ్యం 210 మెగావాట్లు. కాగా, కేంద్రం ఆదేశాల మేరకు కాలుష్య నివారణ ఏర్పాట్లకు ఒక మెగావాట్‌కు రూ.40 లక్షలు అవుతుందని ఇంధన శాఖ అంచనా వేసింది. 6 యూనిట్లకు ఈ లెక్కన రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని.. అయితే అంత ఖర్చు పెట్టగలిగే పరిస్థితుల్లో విద్యుత్‌ సంస్థలు లేవని ఉన్నతాధికారులు ఆంతరంగిక సంభాషణల్లో చెబుతున్నారు.  


ఎథెనా కోసమేనా.?

కొత్తగా నియమించిన గోపాలరెడ్డి కమిటీకి ఇచ్చిన పరిశీలనాంశాల్లో కొన్ని ఆసక్తికర ప్రతిపాదనలున్నాయి. ‘ప్రస్తుతం లభ్యమవుతున్న తక్కువ ధర విద్యుత్‌ను దృష్టిలో పెట్టుకుని మున్ముందు ఏ ధరకు విద్యుత్‌ లభ్యమవుతుందో కమిటీ ఒక అంచనాకు రావాలి. దానిని దృష్టిలో ఉంచుకుని పాత యూ నిట్లపై పెట్టుబడి పెట్టడం సమంజసమా లేక ఇతరత్రా త క్కువకు వచ్చే విద్యుత్‌ను సేకరించుకోవడం మంచిదా అ న్నది కూడా సూచించాలి’ అని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రంలో ప్రైవేటు సంస్థలు పూర్తి చేయకుండా వదిలిపెట్టిన ఎథెనా, అమర్‌ కంఠక్‌ థర్మల్‌ విద్కుత్‌ ప్లాంట్లు కొనుగోలు చేయాలని జెన్‌కోపై కొంత కాలంగా ఒత్తిడి వస్తోంది. ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్నవారు ఈ ప్రతిపాదనను తే వడంతో విద్యుత్‌ సంస్థలు పరిశీలన మొదలు పెట్టాయి.


ఒక యూనిట్‌ రూ.3.80కి లభ్యమైతే ఛత్తీ‌స్‌గఢ్‌ ప్లాంట్‌ కొనుగోలుకు అభ్యంతరం లేదని విద్యుత్‌ కొనుగోళ్లను పర్యవేక్షించే ఏపీపీసీసీ కొంతకాలం కింద జెన్‌కో ఎండీకి లేఖ రాసింది. 1,200 మెగావాట్ల సా మర్థ్యం ఉన్న ఎథెనా ప్లాంటును కొనుగోలు చేస్తే వీటీపీఎస్‌ యూనిట్లను మూసివేసినా ఇబ్బంది ఉండదని.. జెన్‌కో బేస్‌లోడ్‌ అంతే ఉంటుందని ప్రభుత్వానికి సన్నిహితులైన కొందరు అధికారులు వాదిస్తున్నారు. ఈ ప్లాంటు కొనుగోలుకు జెన్‌కో సుమారు రూ.5 వేల కోట్లు ఖ ర్చు పెట్టాల్సి ఉంటుందని అంచనా. ‘వీటీపీఎస్‌ ప్లాంట్ల నవీకరణకు రూ.500 కోట్లు లేవంటున్న అధికారులు.. రూ.5 వేల కోట్లు పెట్టి ఎక్కడో దూరంగా మరో రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు ప్లాంటును ఎలా కొంటారు? పైగా అక్కడ తక్కువ ధరకే విద్యుత్‌ వస్తుందన్నది అబద్ధం. మా అంచనా ప్రకారం అన్ని ఖర్చులూ కలిపితే.. అక్కడి విద్యుత్‌ ఇక్కడకు వచ్చేసరికి ఒక యూనిట్‌ రూ.6 అవుతుంది’ అని ఇంజనీర్ల సంఘం నాయకుడొకరు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ కమిటీ సిఫారసులు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.  

Updated Date - 2020-05-11T09:25:35+05:30 IST