విశాఖపట్టణంలో మళ్లీ గ్యాస్ లీక్

ABN , First Publish Date - 2020-05-08T10:26:12+05:30 IST

విశాఖపట్టణంలో ఎల్ జి పాలిమర్స్ లో గురువారం అర్దరాత్రి మరోసారి గ్యాస్ లీక్ అయింది.

విశాఖపట్టణంలో మళ్లీ గ్యాస్ లీక్

విశాఖపట్టణం : విశాఖపట్టణంలో ఎల్ జి పాలిమర్స్ లో గురువారం అర్దరాత్రి మరోసారి గ్యాస్ లీక్ అయింది. ఎల్ జి పాలిమర్స్ కెమికల్ కంపెనీలో గ్యాస్ లీకై 11 మంది మరణించిన ఘటన జరిగిన 22 గంటల్లోనే మరోసారి గ్యాస్ లీక్ అవడంతో ఈ ప్రాంత ప్రజలను ఖాళీ చేయించారు.కెమికల్ ప్లాంటు చుట్టుపక్కల రెండుకిలోమీటర్ల పరిధిలోని ఇళ్లలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కెమికల్ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ ఇంకా వెలువడుతున్నందున 5కిలోమీటర్ల పరిధిలోని ప్రాంత ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, వారిని బస్సుల్లో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని విశాఖపట్టణం అగ్నిమాపకశాఖ అధికారి సురేంద్ర ఆనంద్ చెప్పారు. ఫ్యాక్టరీ సమీప ప్రజలను వారి బంధువులు, స్నేహితుల ఇళ్లకు తరలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గ్యాస్ లీక్ సందర్భంగా ఎలాంటి పేలుడు సంభవించకున్నా ముందుజాగ్రత్త చర్యగా గోపాలపట్నం ప్రాంతంలోని అడవివారం ప్రాంతంలోని ప్రజలను ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి తాము ఖాళీ చేయిస్తున్నామని అగ్నిమాపక శాఖ అధికారి సురేంద్ర ఆనంద్ చెప్పారు. కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ ను నివారించడానికి గుజరాత్ నుంచి ప్రత్యేకంగా ఎయిర్ ఇండియా కార్గో విమానంలో పారా టెర్షియరీ బ్యుటైల్ కెటెహాల్ ను  రప్పించామని సురేంద్ర ఆనంద్ పేర్కొన్నారు. పది అగ్నిమాపక వాహనాలు, రెండు ఫోమ్ టెండర్స్ , అంబులెన్సులను ప్లాంటు వద్ద సిద్ధంగా ఉంచామని అధికారులు చెప్పారు. 


Updated Date - 2020-05-08T10:26:12+05:30 IST