వివేకా కేసు సీబీఐకి

ABN , First Publish Date - 2020-03-12T09:07:43+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై హైకోర్టు సంచలన ఉత్తర్వులు ఇచ్చింది

వివేకా కేసు సీబీఐకి

  • హైకోర్టు సంచలన తీర్పు
  • ఏడాదైనా హంతకుల్నే తేల్చలేదు
  • సిట్‌ ఇంతకాలం చేసిన దర్యాప్తులో
  • పురోగతే లేకపోవడం ఆశ్చర్యకరం
  • వైఎస్‌ వివేకాది క్రూరమైన హత్య
  • ఆయన ప్రతిష్ఠ, సంబంధాల రీత్యా
  • అంతర్రాష్ట్ర హత్యగా అనుమానాలు
  • అందుకే కేసును సీబీఐకి ఇస్తున్నాం
  • రికార్డులిచ్చి పోలీసులు సహకరించాలి
  • సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు పూర్తి
  • సీబీఐని ఆదేశించిన రాష్ట్ర హైకోర్టు
  • బీటెక్‌ రవి, ఆది పిటిషన్లు కొట్టివేత
  • సునీత, సౌభాగ్యమ్మవే పరిగణనలోకి...
  • జగన్‌ పిటిషన్‌ ఉపసంహరణకు ఓకే
  • అయితే ఆ ప్రభావం సీబీఐ దర్యాప్తును
  • ప్రభావితం చేయరాదని స్పష్టీకరణ


వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి ఇవ్వాలని హైకోర్టు నిర్ణయించింది. ఈ కేసు దర్యాప్తు సాఫీగా సాగుతున్నందున సీబీఐకి ఇవ్వాల్సిన అవసరం లేదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. వివేకాది క్రూరమైన హత్య అని అభిప్రాయపడింది. హత్య జరిగి ఏడాది కావస్తున్నా ఇంతవరకూ ఎలాంటి సాక్ష్యాధారాలు లభ్యం కాకపోవడం, దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ హత్య మిస్టరీని పోలీసులు ఛేదించలేకపోయారని, ఇప్పటివరకూ ఆయనను ఎవరు హత్య చేశారన్నది ఇదమిత్థంగా చెప్పలేకపోతున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.


అమరావతి, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై హైకోర్టు సంచలన ఉత్తర్వులు ఇచ్చింది. ‘‘రాజకీయ కారణాల వల్ల ఈ హత్య జరిగిందా? ఆస్తి తగాదాల వల్ల జరిగిందా? భూ తగాదాల వల్ల జరిగిందా? మరే ఇతర కారణాల వల్ల జరిగిందనేది పోలీసులు ఇప్పటివరకూ తేల్చలేకపోయారు. ఈ హత్య కేవలం రాష్ట్రానికి సంబంధించినదని భావించలేం. వివేకాకు ఉన్న రాజకీయ నేపథ్యం వల్ల ఆయన హత్య కేవలం రాష్ట్రానికే పరిమితం కాదు. ఆయన ప్రతిష్ఠ, వ్యాపారాల నేపథ్యంలో అంతర్రాష్ట్ర హత్యగా కూడా భావించవచ్చు’’ అని హైకోర్టు పేర్కొంది. హంతకులు ఎక్కడో సంతోషంగా ఉండి ఉంటారని, కానీ బాధితులైన వివేకా భార్య, కుమార్తె న్యాయం కోసం ఆక్రోశిస్తూ కుమిలిపోతున్నారని వ్యాఖ్యానించింది. రాష్ట్ర పోలీసులు దర్యాప్తు సక్రమంగా చేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ ఆ చర్యలు ఫలప్రదం కాలేదని పేర్కొంది. వివిధ కోణాలున్న ఈ హత్యపై సీబీఐ దర్యాప్తు చేస్తే నిజానిజాలు బయటకు రావడానికి అవకాశం ఉందని అభిప్రాయపడిన హైకోర్టు.. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. సీబీఐ సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్‌ ఫైల్‌ చేయాలని ఆదేశించింది. ఇలాంటి హత్య దర్యాప్తులో ‘సమయం’ చాలా కీలకమైనదని వ్యాఖ్యానించింది. రాష్ట్ర పోలీసులు రికార్డులన్నీ వెంటనే సీబీఐకి అప్పగించి, దర్యాప్తుకు సహకరించాలని ఆదేశించింది. సీబీఐ దర్యాప్తు కోరుతూ టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, మాజీ మంత్రి సీ ఆదినారాయణరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఆదినారాయణరెడ్డి, బీటెక్‌ రవి ప్రత్యక్షంగా బాధితులు కారని, వివేకాకు రాజకీయ ప్రత్యర్థులైన వారు కేవలం తమను ఈ కేసులో నిందితులుగా చేరుస్తారేమోనన్న ఆందోళనతోనే పిటిషన్లు దాఖలు చేశారని పేర్కొన్న హైకోర్టు.. వాటికి విచారణార్హత లేదని స్పష్టం చేసింది. అదేవిధంగా తన పిటిషన్‌పై ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వినతిని ఆమోదించిన హైకోర్టు..  ఈ వ్యవహారం సీబీఐ దర్యాప్తుపై ఎలాంటి ప్రభావం చూపకూడదని స్పష్టం చేసింది. జగన్‌ పిటిషన్‌తో ఎలాంటి సంబంధం లేకుండా సీబీఐ దర్యాప్తు చేపట్టాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు బుధవారం సంచలన తీర్పు వెల్లడించారు. 


ఎప్పుడు.. ఎవరు..

2019 మార్చి 15వ తేదీన వైఎస్‌ వివేకా దారుణ హత్యకు గురి కాగా దర్యాప్తు కోసం నాటి టీడీపీ ప్రభుత్వం ‘ప్రత్యేక దర్యాప్తు బృందం’ (సిట్‌) ఏర్పాటు చేసింది. అయితే పోలీసుల దర్యాప్తు సక్రమంగా సాగడం లేదని, టీడీపీ ప్రభుత్వం కేసును పక్కదోవ పట్టించే అవకాశమున్నందున ఆ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ అదే నెల 19వ తేదీన వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, నాటి ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో హత్యకేసులో అసలు దోషుల్ని వదిలేసి అమాయకుల్ని ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందువల్ల కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి గత డిసెంబరు 11వ తేదీన, మాజీ మంత్రి సి.ఆదినారాయణరెడ్డి డిసెంబరు 30వ తేదీన పిటిషన్లు దాఖలు చేశారు. కాగా రాష్ట్ర పోలీసుల దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, అందువల్ల సీబీఐకి ఇవ్వాలంటూ వివేకా కుమార్తె ఎన్‌.సునీతా, అల్లుడు ఎన్‌.రాజశేఖర్‌రెడ్డి సంయుక్తంగా గత జనవరి 24వ తేదీన పిటిషన్‌ దాఖలు చేశారు. అందులో 15 మంది వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసు వాదనలు గత ఫిబ్రవరి 24వ తేదీన ముగియడంతో తీర్పు రిజర్వు చేసిన న్యాయమూర్తి బుధవారం వెలువరించారు. 


ఎవరి వాదనలు.. ఎలా!

సునీత, సౌభాగ్యమ్మల తరఫున సీనియర్‌ న్యాయవాది వీరారెడ్డి వివిధ సందర్భాల్లో వాదనలు వినిపిస్తూ.. ‘‘వివేకా హత్య కేసులో అనేక అనుమానాలున్నాయి. అప్పట్లో ప్రతిపక్షనేతగా వున్న జగన్మోహన్‌రెడ్డి సీబీఐ విచారణ కోసం హైకోర్టులో పిటిషన్‌ వేశారు. గవర్నర్‌ను కలిసి మెమొరాండం కూడా ఇచ్చారు. ఇప్పుడు అదే కేసును సీబీఐకి ఇవ్వాలని వివేకా కుమార్తె ఎన్నిమార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోవడం లేదు. అంతేగాక తన పిటిషన్‌పై ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని జగన్‌ మెమో దాఖలు చేయడం సబబు కాదు. వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌లోని సభ్యులను ప్రభుత్వం పలుమార్లు ఎందుకు మార్చాల్చి వచ్చింది? వివేకా మృతదేహంపై ఉన్న గాయాలను చూస్తే ఒక్కరు దాడి చేసినట్లుగా అనిపించడం లేదు. వివేకా మృతదేహం వద్దకు బంధువుల్లో మొదటిగా చేరుకున్నది ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి. ఆయన తరువాతే ఒక్కొక్కరుగా బంధువులు వచ్చారు. అయితే ఎవరూ హత్యప్రదేశానికి రాకుండా తలుపులు మూసేశారు. ఆ సమయంలో అక్కడ ముగ్గురు వైద్యులు, పారా మెడికల్‌ స్టాఫ్‌, సీఐ, ఎస్సైతో పాటు మొత్తం 15 మంది ఉన్నారు. వారంతా అక్కడున్న రక్తాన్ని శుభ్రం చేసి, గాయాలకు బ్యాండేజ్‌ కట్టి, మృతదేహాన్ని బెడ్‌షీట్లో చుట్టి తొలుత బెడ్‌పైకి, ఆ తరువాత ఆసుపత్రికి చేర్చారు. సాక్ష్యాలు తారుమారు చేసేందుకు ప్రయత్నించారు. మరి ఈ విషయంలో అందరిపైనా కేసులు పెట్టకుండా కేవలం ముగ్గురిపైనే ఎందుకు కేసు పెట్టారు? ఇలా రక్తం శుభ్రం చేసి గుండెపోటులా ఎందుకు చిత్రీకరించాల్సి వచ్చింది? ఇందులో ఉన్న మర్మమేంటి? ఈ 15 మందిలో ఎప్పుడూ వివేకా ఇంటికి రానివారు కూడా అప్పుడక్కడ ఉన్నారు. వైసీపీ నేత శివశంకర్‌రెడ్డికి, వివేకాకు అసలు పడదు. కానీ ఆ రోజు అతను దగ్గరుండి వ్యవహారాన్ని పర్యవేక్షించారు. వివేకాది హత్య కేసులా నమోదు చేయవద్దని గంగిరెడ్డి పోలీసుల్ని ఎందుకు అడిగారు? మృతదేహం వద్ద నాలుగు లైన్లతో చిన్న లేఖ దొరికింది. డ్రైవర్‌ ప్రసాద్‌పై అనుమానం రేగేలా అందులో రాసి ఉంది. నిజానికి అందులో వివేకా సంతకంగా చెబుతున్నది తెలుగులో ఉంది. ఆయన తెలుగులో సంతకం చేయరు. వివేకా హత్యలో రాజకీయ ప్రముఖులున్నారు. ఇందులో ఐదుగురు బడా నేతల జోక్యముంది. తేలిగ్గా వదిలేయాల్సిన సాధారణ కేసు కాదిది. అందువల్ల హత్యలోని కుట్రలు బయటకు రావాలంటే సీబీఐ చేత దర్యాప్తు చేయించండి’’ అని విన్నవించారు.


రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం వాదనలు వినిపిస్తూ.. ‘‘ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దర్యాప్తు సాఫీగా సాగుతోంది. దర్యాప్తుపై ఎలాంటి రాజకీయ ప్రభావం లేదు. సిట్‌లో సభ్యుల్ని మార్చినంత మాత్రాన ఆ ప్రభావం దర్యాప్తుపై పడదు. ఇప్పటికే 104 మంది సాక్షుల్ని, పులివెందులలోని ఏడు గ్యాంగులను, 1461 మంది అనుమానితుల్ని, 31 మంది కరడుగట్టిన నేరగాళ్లను, జైళ్ల నుంచి విడుదలై ఉన్న 185 మంది నేరస్తులను, 75 మంది కిరాయి హంతకులను విచారించాం. మృతుని కుమార్తె వ్యక్తం చేస్తున్న సందేహాల కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. దర్యాప్తు ఆలస్యమవుతోందని సీబీఐ తో దర్యాప్తు చేయించాలని కోరడం సమంజసం కాదు. దర్యాప్తులో ఏవేని సందేహాలు ఉంటే తొలిగా మేజిస్ట్రేట్‌ ముందు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దర్యాప్తు మరో రెండు నెలల్లో పూర్తయ్యే అవకాశముంది. దర్యాప్తును కొనసాగించేందుకు అనుమతించండి’’ అని అభ్యర్థించారు. అయితే ఆయన వాదనను హైకోర్టు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. 



సునీత దృష్టిలో అనుమానితులు వీరే.. 

రంగయ్య (వాచ్‌మెన్‌), ఎర్రా గంగిరెడ్డి (40 ఏళ్లుగా  వివేకాకు సన్నిహితుడు), ఉదయ్‌కుమార్‌ (యూసీఐఎల్‌ ఉద్యోగి- డి.శివశంకర్‌రెడ్డి, ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డికి సన్నిహితుడు), డి.శివశంకర్‌రెడ్డి (వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి సన్నిహితుడు), పరమేశ్వర్‌రెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి (దర్యాప్తు సమయంలో మృతి), వైఎస్‌ భాస్కర్‌రెడ్డి (వైఎస్‌ అవినాశ్‌రెడ్డి తండ్రి), వైఎస్‌ మనోహర్‌రెడ్డి, వైఎస్‌ అవినాశ్‌రెడ్డి (పార్లమెంటు సభ్యుడు), శంకరయ్య (సర్కిల్‌ ఇన్ప్‌పెక్టర్‌), రామకృష్ణారెడ్డి (ఏఎ్‌సఐ), ఈసీ సురేంద్రనాధ్‌రెడ్డి, సీ ఆదినారాయణరెడ్డి (మాజీ మంత్రి), బీటెక్‌ రవి (ఎమ్మెల్సీ), సురేందర్‌రెడ్డి (పరమేశ్వర్‌రెడ్డి బావమరిది)



సీఎం జగన్‌ రాజీనామా చేయాలి

‘‘వివేకా కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయం శుభపరిణామం. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిగేందుకు మార్గం సుగమం అయింది. ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ ఈ కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టును ఆశ్రయించి.. ముఖ్యమంత్రి అయ్యాక పట్టించుకోలేదు.సిట్‌ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, అనుమానాలు ఉన్నాయని, సీబీఐకి కేసును అప్పగించాలని ఆయన సోదరే (బాబాయి కుమార్తె) హైకోర్టును ఆశ్రయించారు. కేసులో నిష్పక్షపాత విచారణ జరిగి అసలైన దోషులను గుర్తించాలంటే ముఖ్యమంత్రి జగన్‌ తన పదవికి రాజీనామా చేయాలి’’

- బీటెక్‌ రవి, టీడీపీ ఎమ్మెల్సీ

Updated Date - 2020-03-12T09:07:43+05:30 IST