ఏడాదయినా ఎక్కడిదక్కడే..

ABN , First Publish Date - 2020-03-12T09:08:50+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బాబాయి, మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగి ఏడాది కావస్తోంది

ఏడాదయినా ఎక్కడిదక్కడే..

కడప, మార్చి 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బాబాయి, మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగి ఏడాది కావస్తోంది. ఇంతకాలంలో పోలీసు దర్యాప్తులో కీలక మార్పులే జరిగాయి. కానీ, అత్యంత సంచనాత్మకంగా చోటుచేసుకొన్న ఈ హత్య కేసులో మాత్రం ఏ మలుపులూ లేవు. వైఎస్‌ వివేకానందరెడ్డి 2019 మార్చి 14వతేదీన జమ్మలమడుగు, దువ్వూరు మండలాల్లో ఎన్నికల ప్రచారం ముగించుకుని రాత్రి 11గంటలకు పులివెందులలోని భాకరాపురం మిల్క్‌డైరీ వెనుక ఉన్న స్వగృహానికి చేరుకున్నారు. 15వతేదీ ఉదయం తెల్లారగానే చూస్తే బాత్‌రూములో రక్తపు మడుగులో పడి ఉన్నారు. గుండెపోటుతో మృతి చెందారని మొదట్లో ఓ మీడియాలో వచ్చింది. తలపై అతి కిరాతకంగా నరకడంతో తీవ్ర గాయాలు ఉండడంతో హత్యకు గురైనట్లు గుర్తించి పోలీసులు కేసు నమోదు చేశారు. వెంటనే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సిట్‌ బృందాన్ని నియమించారు.  కడప ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ ఆ బృందానికి నేతృత్వం వహించారు. ప్రభుత్వం మారి.. వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక కడప ఎస్పీగా అభిషేక్‌ మహంతిని నియమించారు. ఆయన నేతృత్వంలో సిట్‌ దర్యాప్తు కొనసాగింది. దాదాపుగా విచారణ ఓ కొలిక్కి వస్తున్న తరుణంలో మహంతి దీర్ఘకాలిక సెలవులో వెళ్లారు. ఎస్పీగా నాలుగునెలల క్రితం కడపకు వచ్చిన కేకేన్‌ అన్బురాజన్‌ మూడో సిట్‌కు నాయకత్వం వహిస్తున్నారు. అయితే, కొత్త ఎస్పీ వచ్చిన తరువాత సిట్‌ దర్యాప్తు నత్తనడకన సాగుతోందంటూ వివేకా కుమార్తె ఎన్‌.సునీత తమ న్యాయవాది వీరారెడ్డి ద్వారా జనవరి 28న హైకోర్టులో వాదనలు వినిపించారు. విపక్ష నేతగా ఉండగా సిట్‌ కాదు, సీబీఐకి కేసు దర్యాప్తును అప్పగించాలని కోరిన జగన్‌.. ముఖ్యమంత్రై నెలలు గడిచినా ఈ కేసును సీబీఐకి అప్పగించలేదని ఆమె కోర్టు దృష్టికి తెచ్చారు. 15 మందిపై తనకు అనుమానం ఉందంటూ వారి పేర్లను వెల్లడించారు. సునీత పిటిషన్‌ ఆధారంగానే వివేకా కేసును సీబీఐకి అప్పగిస్తూ బుధవారం హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - 2020-03-12T09:08:50+05:30 IST