గోడలపై రంగులు నింపడం మాని.. ప్రజల జీవితాల్లో నింపండి: విష్ణువర్దన్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-06-06T18:11:48+05:30 IST

అనంతపురం: రాష్ట్రంలో అధికార.. ప్రతిపక్షాలు మాటల తూటాలు పేల్చుతున్నాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి విమర్శించారు.

గోడలపై రంగులు నింపడం మాని.. ప్రజల జీవితాల్లో నింపండి: విష్ణువర్దన్‌రెడ్డి

అనంతపురం: రాష్ట్రంలో అధికార.. ప్రతిపక్షాలు మాటల తూటాలు పేల్చుతున్నాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి విమర్శించారు. వైసీపీ.. టీడీపీ బహిరంగ చర్చను బీజేపీ ఆహ్వానిస్తోందన్నారు. జగన్మోహన్ రెడ్డి సంవత్సరం పాలనలో ఏమి చేశారో బహిరంగ చర్చకు రావాలన్నారు. రెండు పార్టీల మాటల్లో చిత్తశుద్ధి ఉంటే బహిరంగ చర్చకు వేదికను విజయవాడలో బీజేపీ ఏర్పాటు చేస్తుందన్నారు. సీఎం జగన్ బిజీగా ఉంటే పార్టీ ప్రతినిధులను పంపాలని విష్ణువర్దన్‌రెడ్డి పేర్కొన్నారు. 


ఇసుక అక్రమ వ్యాపారం వల్ల అధికార పార్టీ నేతలు పది వేల కోట్లు సంపాదిస్తున్నారన్నారు. అధికార పార్టీ నేతలు ఇసుక అక్రమాలపై బహిరంగంగా మాట్లాడుతున్నారన్నారు. ఇళ్ల పట్టాల పేరుతో అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని.. వాటిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతిని ఏకీకృతం చేశారని విష్ణువర్దన్‌రెడ్డి విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి సంవత్సరం పాలనలో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదన్నారు. గోడల మీద రంగులు నింపడం మానుకొని ప్రజల జీవితాల్లో రంగులు నింపాలన్నారు. 


జగన్మోహన్ రెడ్డి 365 రోజుల పాలనలో ఏమి చేశారో ప్రగతి నివేదికను బయటపెట్టాలన్నారు. రాష్ట్రంలో ఆదాయాన్ని పెంచాలని... ప్రభుత్వంలో అనుభవ రాహిత్యం కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. గతంలో కేంద్రంలో స్కామ్‌లు జరిగితే.... ప్రధాని నరేంద్రమోడీ హయాంలో స్కీంలు ప్రారంభించామని విష్ణువర్దన్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2020-06-06T18:11:48+05:30 IST