పసిపిల్లల నరకయాతన!

ABN , First Publish Date - 2020-05-09T09:09:21+05:30 IST

ఎల్జీ పాలిమర్స్‌ నుంచి వెలువడిన విషవాయువు విశాఖ వాసులను అతలాకుతలం చేసేసింది. ముఖ్యంగా చిన్నారులు ఆ సమయంలో నరకయాతన అనుభవించారు.

పసిపిల్లల నరకయాతన!

ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటనలో కళ్లు మంట.. కడుపు నొప్పి

ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది

ప్రస్తుతం కేజీహెచ్‌లో 52 మంది

నిలకడగానే చిన్నారుల ఆరోగ్యం 

మరోమారు పరీక్షలకు ఏర్పాట్లు


(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం):ఎల్జీ పాలిమర్స్‌ నుంచి వెలువడిన విషవాయువు విశాఖ వాసులను అతలాకుతలం చేసేసింది. ముఖ్యంగా చిన్నారులు ఆ సమయంలో నరకయాతన అనుభవించారు. స్టైరిన్‌ వాయువు పీల్చిన పిల్లలు ఊపిరాడక కొంతమంది, కళ్లు, గొంతు మంట, కడుపునొప్పితో మరికొంతమంది ఇబ్బందలు ఎదుర్కొన్నారు. కళ్లెదుటే పిల్లలు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఏం చేయాలో తోచక తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. గ్యాస్‌ లీక్‌ సమయంలో వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో.. పిల్లలు, వారి తల్లిదండ్రులు శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’కి ప్రతినిధికి తెలిపారు. 


ముగ్గురు పిల్లలకు కంటి సమస్య

పాలిమర్స్‌ నుంచి లీకైన విషవాయువును పీల్చి గురువారం 12 మంది చనిపోయారు. 554 మంది చికిత్సకు ఆస్పత్రుల్లో చేరారు. వారిలో 128 మంది పూర్తిగా కోలుకున్నారు. పిల్లలు 52 మంది వరకు ఉన్నారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ముగ్గురు పిల్లలకు కంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయి. వారి కళ్ల నుంచి ఆగకుండా నీరు కారుతోంది. మసకమసకగా కనిపిస్తోంది. వారిని కంటి వైద్యులకు చూపించడానికి వైద్యవర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. అలాగే కొందరు పిల్లలకు ఒంటిపై బొబ్బలు వచ్చాయి. పెదాలపై పుండ్లు ఏర్పడ్డాయి. 


కాలువలో పడిపోయాను .. ఎస్‌.బద్రీనాథ్‌

మూడు గంటలకు ఇంట్లో వాళ్లు కేకలు పెట్టడంతో లేచాను. అప్పటికే  ఊపిరి తీసుకోవడం కష్టమైంది. కళ్లు మంటలు ఎక్కువయ్యాయి. నాతోపాటు తమ్ముడు మణిదీ్‌పను పట్టుకుని అమ్మానాన్న పరుగులు పెట్టారు. మధ్యలో వారు ఎక్కడో తప్పిపోయారు. నేను ఏదో కాలువలో పడిపోయినట్టు గుర్తు. కళ్లు తెరిచి చూస్తే ఆస్పత్రిలో ఉన్నా. ఈ ఘటనలో నాన్న చనిపోయాడు. అమ్మ చికిత్స పొందుతోంది. 


పిల్లలిద్దరికీ గాయాలు.. యలమంచిలి కుమారి, చిన్నారుల తల్లి

ప్రమాదం విషయం తెలసి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోవాలని ఇద్దరు పిల్లలు కుందనశ్రీ, జోస్మిత, భర్త, మరిది, అత్త, మామలతో కలిసి బయటకు వచ్చాం. ఆటో స్టార్ట్‌  కావడం ఆలస్యమవుతోందని అత్తయ్య జోస్మితను తీసుకుని పరుగు పెట్టింది. మరిది కుందనను ఎత్తుకుని పరిగెత్తాడు. ఈ ప్రమాదంలో అత్తయ్య చనిపోయింది. తాను పడిపోయే ముందు పాపను దూరంగా విసిరేసింది. మరిది పాపను పట్టుకుని పరిగెట్టుకుంటూ వెళ్లినా ఎక్కడ పడిపోయిందో అతనికి తెలియలేదు. మా పాపలిద్దరికీఈ ఈ ఘటనలో గాయాలయ్యాయి.


కళ్లు తిరిగి పడిపోయాను.. యల్లపు ప్రణీత్‌

మూడు గంటల సమయంలో ఊపిరాడక మెలకువ వచ్చింది. అప్పటికే అమ్మా, నాన్న ఏం జరిగిందో తెలియక అటుఇటూ చూస్తున్నారు. నిద్ర లేచిన వెంటనే వాంతులయ్యాయి. అమ్మ, అన్నయ్య కూడా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. గొంతు మండుతోందని నీరు తాగేందుకు వెళ్లి ఇంట్లో కళ్లుతిరిగి పడిపోయాను. 


కళ్ల నుంచి నీరు.. ఆయాసం.. పి.రామలక్ష్మి, అఖిలప్రియ తల్లి

ప్రమాదం జరిగిన ప్రాంతానికి దగ్గరలోనే మా ఇల్లు. విషవాయువు పీల్చిన దగ్గరి నుంచి మా పాప కళ్ల వెంట నీరు కారడం, ఆయాసంతో ఇబ్బంది పడుతోంది. ఇప్పటికీ కళ్లు మంటగా ఉన్నాయని ఏడుస్తోంది. దేవుడి దయ వల్ల సకాలంలో మేల్కోవడంతో మా ప్రాణాలు దక్కాయి. మేమే దగ్గరుండి పాపను ఆస్పత్రికి తీసుకువచ్చాం. 


Updated Date - 2020-05-09T09:09:21+05:30 IST