తేలిగ్గా తీసుకుంటారా?

ABN , First Publish Date - 2020-05-09T10:16:25+05:30 IST

విశాఖ గ్యాస్‌ లీకేజీ ఘటనను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తేలిగ్గా తీసుకుంటున్నారన్న అభిప్రాయం ఆయన మాటల్లో ధ్వనించిందని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

తేలిగ్గా  తీసుకుంటారా?

స్టైరిన్‌ ప్రభావంపై శాస్త్రీయ నిర్ధారణ జరగాలి

రూ.కోటి పరిహారంతో పోయినోళ్లు తిరిగిరారు

పరిశ్రమను తక్షణం మూసివేయాలి: చంద్రబాబు


అమరావతి, మే 8 (ఆంధ్రజ్యోతి): విశాఖ గ్యాస్‌ లీకేజీ ఘటనను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తేలిగ్గా తీసుకుంటున్నారన్న అభిప్రాయం ఆయన మాటల్లో ధ్వనించిందని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు  అన్నారు. ఇదంత తేలిగ్గా తీసుకునే దుర్ఘటన కాదని, ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ప్రముఖ వైద్యులను పిలిపించి లోతైన అధ్యయనం చేయించాల్సిన అంశమన్నారు. జూమ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఆస్పత్రుల్లో ఉన్నవారికి ఇప్పటికిప్పుడు చికిత్స చేసి పంపిస్తే సరిపోదు. వారి ఆరోగ్యంపై భవిష్యత్‌లో ఈ గ్యాస్‌ ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంటుందో నిశిత పరిశీలన జరగాలి. దీనిపై అనుభవమున్న శాస్త్రవేత్తలు ప్రపంచంలో ఎక్కడున్నా పిలిపించాలి. వారికి ప్రముఖ వైద్యులను జత కలిపి అధ్యయనం చేయించాలి. ఇది మనకు మనంగా తుది నిర్ధారణకు వచ్చే వ్యవహారం కాదు’ అని తెలిపారు. దీనిపై ప్రధానమంత్రికి, కేంద్ర హోం మంత్రికి తాను లేఖలు రాయబోతున్నట్లు తెలిపారు. ‘విశాఖలో ముఖ్యమంత్రి పరిహారం గురించి, ఉద్యోగాల గురించి మాట్లాడారు.


లీకేజికి కారణమైన కంపెనీ ప్రముఖ కంపెనీ అని కితాబిచ్చారు. ఆయన మాటల్లో సీరియ్‌సనెస్‌ కనిపించలేదు. ఆ కంపెనీపై చిన్న చిన్న సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా పైపైన కారణాలు చూపిస్తూ ప్రకటన చేసింది. ఈ ముఖ్యమంత్రికి అవగాహనా లోపం. చెబితే వినడు. ఎవరితో మాట్లాడడు.  ప్రమాదం జరిగిన వెంటనే ప్రధాని హైపవర్‌ కమిటీ సమావేశం ఏర్పాటుచేసి చర్చించారు. కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి కూడా రంగంలోకి దిగి అందరితో మాట్లాడారు. హైకోర్టు, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఈ సంఘటనపై తమంతట తాముగా స్పందించి నోటీసులు జారీ చేశాయి. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ రూ.50 కోట్ల పరిహారాన్ని డిపాజిట్‌ చేయాలని ఆ కంపెనీని ఆదేశించింది. సమస్య తీవ్రత వల్లే వీరంతా ఈ స్ధాయిలో స్పందించారు’ అని చె ప్పారు. గ్యాస్‌ లీకేజీకి కారణమైన కంపెనీని తక్షణం మూసివేయాలని డిమాండ్‌ చేశారు. కోటి రూపాయల పరిహారంతో పోయిన మనుషులు తిరిగి వస్తారా అని ప్రశ్నించారు. 


నా మనసంతా అక్కడే..

తన మనసంతా విశాఖలోనే ఉందని, రాత్రి సరిగా నిద్ర కూడా పట్టలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేంద్రం  అనుమతి కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు. లాక్‌డౌన్‌ ఆంక్షలు బాగా బలంగా ఉన్నాయని, దానివల్లే అనుమతి రావడంలో జాప్యం జరుగుతోందని భావిస్తున్నానని, ఎప్పుడు వస్తే అప్పుడు వెంటనే వెళ్తానని తెలిపారు. ప్రమాదానికి టీడీపీయే కారణమని సోషల్‌ మీడియాలో పోస్టింగులు పెడుతున్న వైసీపీ నేతలను చూస్తే వారు సైకోలో, దుర్మార్గులో అర్థం కావడం లేదని మండిపడ్డారు. ఎడాపెడా లిక్కర్‌ షాపులు తెరిచి.. వాటి ముందు వేల మంది బారులు తీరితే అదీ టీడీపీ కుట్రేనని మాట్లాడారని, చేసిన తప్పులు దిద్దుకోలేక ఎదుటివారిపై రుద్దాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.

Updated Date - 2020-05-09T10:16:25+05:30 IST