విశాఖలో వరుస కూల్చివేతలు.. వైసీపీ ఎజెండా ఇదేనా?

ABN , First Publish Date - 2020-10-31T15:54:45+05:30 IST

విశాఖ‌లో జీవీఎంసీని లక్ష్యంగా చేసుకుని వైసీపీ పావులు కదుపుతోందా? ప్రత్యర్థులను బెదిరించి పార్టీలో చేర్చుకోవ‌డం.. లేదంటే వారి ఆర్థిక మూలాల‌ు, మ‌నో ధైర్యాన్ని దెబ్బతీయ‌డం ద్వారా ల‌బ్ధి పొందాలని చూస్తోందా?

విశాఖలో వరుస కూల్చివేతలు.. వైసీపీ ఎజెండా ఇదేనా?

విశాఖ‌లో జీవీఎంసీని లక్ష్యంగా చేసుకుని వైసీపీ పావులు కదుపుతోందా? ప్రత్యర్థులను బెదిరించి పార్టీలో చేర్చుకోవ‌డం.. లేదంటే వారి ఆర్థిక మూలాల‌ు, మ‌నో ధైర్యాన్ని దెబ్బతీయ‌డం ద్వారా ల‌బ్ధి పొందాలని చూస్తోందా? విశాఖలో జరుగుతున్న వ‌రుస పరిణామాలు, ఘటనలు చూస్తే.. అవుననే సమాధానం వినిపిస్తోంది? మరి జీవీఎంసీపై పట్టు కోసం వైసీపీ చేస్తున్న ప్రయత్నం ఫలించే అవకాశం ఎంత? ప్రత్యేక కథనం మీకోసం..


సర్వేలో షాకింగ్ విషయాలు...

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నగరంలో వైసీపీకి పట్టులేదని 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనే తేలిపోయింది. దీంతో అక్కడ వైసీపీ బలోపేతానికి అటు పార్టీ, ఇటు ప్రభుత్వంలో నెంబర్‌ టూగా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డిని రంగంలోకి దించారు. విశాఖలో పార్టీ వ్యవహారాలన్నీ ఆయన దగ్గరుండి చూసుకుంటున్నారు. ఎన్నిక‌ల ముందు కూడా విశాఖలోనే ఆయన ఉన్నప్పటికీ.. ఇక్కడ మాత్రం విజ‌యం సాధించ‌లేక‌పోయారు. జీవీఎంసీపైనైనా పార్టీ జెండా ఎగురవేయాలన్న ఆలోచనతో.. క‌రోనా వైరస్ ప్రబలడానికి ముందే ప్లాన్ చేశారు. అప్పుడు జీవీఎంసీ ఎన్నిక‌లలో పోటీచేసే పార్టీ అభ్యర్థులకు ఆర్థిక వ‌న‌రే ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్లారు. అంతేకాక అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంతలో క‌రోనా కారణంగా ఆ ఎన్నికల ప్రక్రియ ఆగిపోయింది. అప్పుడు ఇక్కడ వైసీపీ జరిపిన సర్వేలో 98 స్థానాలకుగాను పార్టీకొచ్చేవి 40 కూడా దాటవని తేలిందట.


ఆ ఎజెండాతోనే బాబును అడ్డుకున్నారట...

ఇదిలాఉంటే, ఇప్పుడు విశాఖను పరిపాలనా రాజధానిగా జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రశాంత వాతావరణం కోరుకునే విశాఖవాసులు.. ఈ నగరాన్ని రాజధాని చేస్తుండటాన్ని పెద్దగా ఇష్టపడటం లేదు. ఈ విషయం బ‌య‌ట‌ప‌డ‌కుండా ఉండేందుకే.. గ‌తంలో వైసీపీ నేతలే మద్దతు ర్యాలీలు నిర్వహించారనీ, విశాఖకు వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడుని కూడా ఇదే ఎజెండాతో అడ్డుకున్నారనీ టాక్. అయితే ఇందులో ఏ విష‌యంలోనూ విశాఖవాసుల మ‌ద్దతు లేద‌ని స్పష్టమవుతోంది. మరోవైపు స్థానిక వైసీపీ నాయకుల్లోనూ చాలా మంది.. విశాఖలో పరిపాలనా రాజధానిపై సానుకూల ధృక్పథంతో లేరట. దీంతో జీవీఎంసీలో ఓట‌మి చెందుతామ‌నే భ‌యం పార్టీ పెద్దల్లో మొదలైందట. అదే జరిగితే  అధికార పార్టీ ప‌రువు పోతుందనీ, పైగా ఇక్కడికొస్తే ప్రభుత్వానికి జీవీఎంసీ మేయ‌ర్ రూపంలో ఇబ్బందులు తలెత్తుతాయనీ వారిలో ఆందోళన నెలకొందట. ఈ సమస్య ఎదురుకాకుండా ఉండేందుకు.. నగరంలోని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ఎరవేస్తున్నారని చర్చ జరుగుతోంది.


ఎప్పటికప్పుడు వ్యూహం మారుస్తూ...

2019 సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ నగరంలోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లోనూ టీడీపీకి చెందినవారే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఈ నలుగురిని వైసీపీకి లాక్కోవాలని పార్టీ పెద్దలు ఎప్పటికప్పుడు వ్యూహం మారుస్తూ వస్తున్నారట. ఇందులో భాగంగా ఇప్పుడు వైసీపీ దండోపాయం ఎజెండాతో ముందుకెళ్తుందోనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్థిక మూలాలు దెబ్బతీస్తామనడంతో.. ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ టీడీపీని వీడి అధికార వైసీపీలో చేరారని టాక్. గంటా శ్రీనివాసరావు, గ‌ణబాబులు కూడా పార్టీ మార‌తారని ప్రచారం జరుగుతోంది. మరో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ.. తాను ప్రాణాలైనా వదులుకుంటా కానీ, పార్టీ మారే ప‌రిస్థితి లేద‌ని తెగేసి చెప్పేశార‌ట. అలాగే నాయకులు పార్టీ మారినా.. కార్యకర్తలు మాత్రం వెళ్లే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. దీంతో వైసీపీ.. విశాఖలో కొత్త సంప్రదాయానికి తెరతీసిందట. ఇందులో భాగంగానే ఇటీవల మాజీ ఎంపీ స‌బ్బంహరి జీవీఎంసీ స్థలం ఆక్రమించారని ఆయన ఇంటిపక్కన ఉన్న గోడ‌ను కూల్చారట. తర్వాత ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజీ రోడ్డులోని  ఉన్న షాపులు తొలగించారు. అనంతరం గీతం కాలేజీ ప్రభుత్వ భూముల‌ు ఆక్రమించిందని.. వాటిని తొల‌గించి ఫెన్సింగ్ వేశారు.


మాట విననందుకే...

మాజీ ఎంపీ సబ్బంహరి.. టీడీపీ తరఫున ప్రతి విషయంలోనూ తన వాణిని వినిపిస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నందుకు ఆయన్ను టార్గెట్ చేశారని టాక్. అలాగే ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజీ రోడ్డులో షాపులు కూల్చడం వెనుక కూడా దండోపాయం ఉందట. స్థానికంగా ఉండే టీడీపీ కార్పొరేటర్‌ అభ్యర్థి.. అధికార వైసీపీలో చేరేందుకు నిరాకరించారనీ, ఆయనపై కోపంతో సానుభూతిపరుల షాపులు కొట్టేశారనీ ప్రచారం జరుగుతోంది. ఇక రెండు రోజుల క్రితం గీతం యూనివర్సిటీకి చెందిన కట్టడాలను తొలగించారు. టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన గీతం విశ్వవిద్యాలయం అధ్యక్షుడు భరత్.. విశాఖలో పార్టీకి వెన్నుదన్నుగా ఉంటున్నారు. ఆయనపైనా పార్టీ మారాల‌ని ఒత్తిడి చేశారనీ, అందుకు అంగీకరించనందుకే గీతం వర్సిటీ కట్టడాలను కూల్చారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


దండోపాయమే ఎజెండాగా...

మొత్తంమీద, విశాఖలో వైసీపీని బలోపేతం చేసేందుకే దండోపాయం ఎజెండాను ఎంచుకున్నారని చర్చ జరుగుతోంది. అయితే అధికార వైసీపీ అనుసరిస్తున్న ధోరణి.. ప్రజల్లో పార్టీకి చెడ్డపేరు తెస్తుందనే భావన విశాఖలోని పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. జీవీఎంసీ ఎన్నికల్లో గెలుస్తారా? అని అధికార పార్టీ నాయకులను అడిగితే.. గెలుస్తామని గట్టిగా చెప్పే పరిస్థితుల్లో వారు లేకపోవడం గమనార్హం. మరి జీవీఎంసీపై ఎలాగైనా వైసీపీ జెండా ఎగురవేసేందుకు ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయో.. వికటిస్తాయో.. వేచిచూడాలి.

Updated Date - 2020-10-31T15:54:45+05:30 IST