ఖైదీల్లో కరోనా వణుకు

ABN , First Publish Date - 2020-06-22T08:48:29+05:30 IST

కరోనా మహమ్మారి జైళ్లలో ఖైదీలను వణికిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా విజృంభిస్తోన్న ఈ వైరస్‌ జైళ్లకు కూడా పాకుతోంది. తాజాగా అనంతపురం జిల్లాలో

ఖైదీల్లో కరోనా వణుకు

  • సబ్‌జైలు నుంచి సెంట్రల్‌ జైలు వరకూ వ్యాప్తి 
  • సిబ్బంది, ఖైదీల బంధువుల్లో ఆందోళన 

అమరావతి, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి జైళ్లలో ఖైదీలను వణికిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా విజృంభిస్తోన్న ఈ వైరస్‌ జైళ్లకు కూడా పాకుతోంది. తాజాగా అనంతపురం జిల్లాలో ఇద్దరు ఖైదీలకు, కడప జిల్లాలో హెడ్‌వార్డర్‌కు, ఓ రిమాండ్‌ ఖైదీకి కొవిడ్‌ నిర్ధారణ అయింది. చిత్తూరు, శ్రీకాళహస్తి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, రాజమండ్రి, విశాఖ వరకూ ఏక్కడో ఒకచోట పాజిటివ్‌ కేసులు వస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలో 4 కేంద్ర కారాగారాలు, 8 జిల్లాజైళ్లతో పాటు మొత్తం 91 జైళ్లలో 5,800మంది ఖైదీలు ఉన్నారు. కొవిడ్‌ నేపథ్యంలో అధికారులు ఏప్రిల్‌లో 463మంది(7ఏళ్ల లోపు శిక్ష)కి పెరోల్‌(మధ్యంతర బెయిల్‌) ఇచ్చి ఇళ్లకు పంపారు. ఆ గడువు ముగుస్తుండటంతో వారంతా ఇప్పుడు తిరిగి వస్తున్నారు.


ఇన్నిరోజులూ వీరంతా ఎక్కడ తిరిగారో తెలియక జైలు సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఇటీవల అరెస్టులు ఎక్కువ కావడంతో రిమాండ్‌ ఖైదీల సంఖ్య కూడా పెరుగుతోంది. అయినా జైళ్లశాఖ తీసుకొంటున్న చర్యలు ఆశించిన స్థాయిలో లేవని సిబ్బంది, ఖైదీల బంధువులు వాపోతున్నారు. ములాఖత్‌లు పూర్తిగా రద్దుచేసిన అధికారులు ఖైదీలకు, సిబ్బందికి,  మాస్క్‌లు ఇస్తూ శానిటైజేషన్‌ చేయిస్తున్నారు. పెరోల్‌పై వెళ్లొచ్చిన ఖైదీలతో పాటు రిమాండ్‌ నిందితులకు కరోనా పరీక్షలు చేయించి లోపలకు అనుమతిస్తున్నారు. అయితే పరీక్షలు అయిన వెంటనే జైల్లోకి అనుమతించకుండా బయటే ఉంచి నెగిటివ్‌గా తేలిన తర్వాతే రానివ్వాలని సిబ్బంది కోరుతున్నారు. లోపలికొచ్చిన తర్వాత పాజిటివ్‌ వస్తే అప్పటివరకూ ఆ ఖైదీతో కలిసి ఉన్నవారిని కూడా ప్రమాదంలోకి నెట్టినట్లేనని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా జైళ్లలో ఒక్కచోట కూడా శానిటైజ్‌ టన్నెల్‌ లేదు. కేంద్ర, జిల్లా కారాగారాల్లో కూడా ఇవి ఏర్పాటు చేయకపోవడంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఖైదీలకు ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతున్న అధికారులు... డ్యూటీ వార్డర్లకు పీపీఈ కిట్లు అందించకుండా తాత్సారం చేస్తున్నారని ఆరోపణలున్నాయి. 


జాగ్రత్తలు తీసుకొంటున్నాం: డీజీ 

జైళ్లలో సిబ్బంది, ఖైదీలకు కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నట్లు జైళ్లశాఖ డీజీ మహ్మద్‌ హాసన్‌ రెజా తెలిపారు. ఏ జైలులోనూ ప్రమాదకర పరిస్థితుల్లేవని, బయటినుంచి వచ్చే ఖైదీలకు పరీక్షలు చేయిస్తున్నామన్నారు. శానిటైజర్‌, మాస్క్‌ల కొరత ఎక్కడా లేదన్నారు. విశాఖ, రాజమండ్రి జైళ్లలో అతిత్వరలో టన్నెల్స్‌ ఏర్పాటు చేస్తామని, అవసరమైన మరిన్ని చర్యలు తీసుకోబుతున్నామని వివరించారు. హరియాణా తరహాలో రాష్ట్రంలో కూడా కొవిడ్‌ పరీక్షలు చేసిన ఖైదీల కోసం జిల్లాకొకటి చొప్పున ప్రత్యేక జైళ్లు ఏర్పాటు చేయబోతున్నట్లు డీజీ వెల్లడించారు.

Updated Date - 2020-06-22T08:48:29+05:30 IST