బాలికపై అత్యాచారానికి యత్నించిన గ్రామ వలంటీర్‌

ABN , First Publish Date - 2020-09-05T13:26:48+05:30 IST

అభంశుభం తెలియని ఓ బాలికపై గ్రామ వలంటీర్‌ లైంగిక దాడికి ఎగబడ్డాడు. తల్లిదండ్రులు లేని విషయం తెలుసుకుని ఇంటిలోనే కాపు కాసి మరీ అఘాయిత్యానికి ప్రయత్నించాడు.

బాలికపై అత్యాచారానికి యత్నించిన గ్రామ వలంటీర్‌

విశాఖపట్నం : అభంశుభం తెలియని ఓ బాలికపై గ్రామ వలంటీర్‌ లైంగిక దాడికి ఎగబడ్డాడు. తల్లిదండ్రులు లేని విషయం తెలుసుకుని ఇంటిలోనే కాపు కాసి మరీ అఘాయిత్యానికి ప్రయత్నించాడు. మాయమాటలు చెప్పి వలలో వేసుకోవాలని చూశాడు. బాధితురాలు భయంతో పరుగులు తీసి ఫోన్‌లో విషయం తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించగా వలంటీర్‌ నానాజీని అరెస్టు చేసి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. రోలుగుంట మండలం కుసర్లపూడి గ్రామంలో గురువారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి బాధిత కుటుంబీకులు, ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు తెలిపిన వివరాలిలా వున్నాయి.


కుసర్లపూడికి చెందిన బాలిక తల్లిదండ్రులు కూలి చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వారిద్దరూ ఉదయం పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి వస్తారు. పదో తరగతి చదువుతున్న బాలిక పాఠశాలకు సెలవులు కావడంతో ఇంటి వద్దనే ఉంటున్నది. ఈ విషయం గ్రహించిన గ్రామ వలంటీర్‌ తొత్తడి నానాజీ బాలికపై కన్నేశాడు. దీంతో బాలిక ఇంటిలోనే కాపు కాశాడు. ట్యూషన్‌కు వెళ్లిన బాలిక ఇంటికి వచ్చి తలుపు తీయగా లోపల వలంటీర్‌ నానాజీ కనిపించాడు. అతన్ని చూసి భయంతో కేకలు వేసింది. దీంతో నానాజీ వెంటనే బాలిక రెండు చేతులు పట్టుకుని అనేక మాయమాటలు చెప్పి లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ బాలిక భయంతో బయటకు పరుగు తీసి తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి భోరున విలపించింది. తల్లిదండ్రులు స్థానిక వైసీపీ నాయకులు, గ్రామ పెద్దలకు విషయం తెలపగా, వారు కేసు లేకుండా రాజీ ప్రయత్నం చేశారు. దీనికి అంగీకరించని తల్లిదండ్రులు శుక్రవారం బాలికతో పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో వలంటీర్‌ నానాజీని అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు తెలిపారు. వలంటీర్‌పై పోక్సో చట్టం, సెక్షన్‌ 354ఏ కింద కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు.

Updated Date - 2020-09-05T13:26:48+05:30 IST