బలిపశువులను చేశారు!

ABN , First Publish Date - 2020-09-05T09:04:13+05:30 IST

విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ హోటల్లో సంభవించిన అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి రమేశ్‌ ఆస్పత్రి ..

బలిపశువులను చేశారు!

రమేశ్‌ ఆస్పత్రి సిబ్బందికి అగ్నిప్రమాదంతో ఏం సంబంధం?

అనుమతులిచ్చిన అధికారుల సంగతేంటి?

పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం

డాక్టర్లు రాజగోపాలరావు, సుదర్శన్‌,

కోఆర్డినేటర్‌ వెంకటేశ్‌లకు బెయిల్‌ 


అమరావతి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ హోటల్లో సంభవించిన అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి రమేశ్‌ ఆస్పత్రి చీఫ్‌ ఆపరేటింగ్‌ అధికారి డాక్టర్‌ కె.రాజగోపాలరావు, జనరల్‌ మేనేజర్‌ డాక్టర్‌ కె.సుదర్శన్‌, కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ కో-ఆర్డినేటర్‌ పి.వెంకటేశ్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపడంపై హైకోర్టు ఆగ్ర హం వ్యక్తం చేసింది. ప్రమాదంతో వారికేం సంబంధముందని పోలీసులను నిలదీసింది. ఘటనతో పిటిషనర్లకు ఎలాంటి సంబంధమో రిమాండ్‌ రిపోర్టులోనే చెప్పలేదని పేర్కొంది. ఆ ఆస్పత్రిలో పని చేస్తున్నారన్న ఏకైక కారణంతో వారిని బలి పశువులను చేశారని కటువుగా వ్యాఖ్యానించింది. అసలు స్వర్ణ ప్యాలె్‌సలో కొవిడ్‌ కేంద్రం నిర్వహణ కోసం అనుమతి ఇచ్చిన అధికారుల విషయాన్ని ఎందుకు పక్కనబెట్టారని ప్రశ్నించింది. ముగ్గురు పిటిషనర్లకు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసు దర్యాప్తునకు సహకరించాలని వారిని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలిత శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.


స్వర్ణ ప్యాలెస్‌ అగ్ని ప్రమాద ఘటన కేసులో రమేశ్‌ ఆస్పత్రి సిబ్బందిని పోలీసులు అరెస్టు చేయగా.. వారు బెయిల్‌ కోసం దిగువ కోర్టుకు వెళ్లారు. అయితే అక్కడ నిరాశ ఎదురవడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్లపై శుక్రవారం న్యాయమూర్తి ముందు విచారణ జరిగింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. అధికారుల అనుమతితోనే స్వర్ణ ప్యాలె్‌సలో కొవిడ్‌ కేంద్రం ఏర్పాటైందన్నారు. ఆ ప్రమాదంతో పిటిషనర్లకు ఎలాంటి సంబంధం లేకపోయినా.. పోలీసులు వారిని అరెస్టు చేశారని తెలిపారు. ఆస్పత్రి యాజమాన్యాన్ని, హోటల్‌ యాజమాన్యాన్ని నిందితులుగా పేర్కొన్న పోలీసులు.. ఆ ఆస్పత్రిలో పని చేస్తున్నారన్న ఒకే ఒక్క కారణంతో ముగ్గురు పిటిషనర్లను అరెస్టు చేశారని పేర్కొన్నారు. సంబంధం లేని వ్యవహారంలో అరెస్టయిన ముగ్గురూ ఇప్పటికే చాలా రోజులు జైల్లో ఉన్నారని, అందువల్ల బెయిల్‌ మంజూరు చేయాలని అభ్యర్థించారు. ఇందుకు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అభ్యంతరం తెలుపుతూ బెయిల్‌ ఇవ్వరాదని కోరారు. ఇరు పక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ముగ్గురు పిటిషనర్లకు బెయిల్‌ మంజూరు చేశారు.

Updated Date - 2020-09-05T09:04:13+05:30 IST