విజయసాయిరెడ్డికి సీన్‌ సితార అయ్యిందా?

ABN , First Publish Date - 2020-06-18T15:52:57+05:30 IST

విజయసాయిరెడ్డికి సీన్‌ సితార అయ్యిందా?

విజయసాయిరెడ్డికి సీన్‌ సితార అయ్యిందా?

విజయసాయిరెడ్డికి ఏమైంది? వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో నెంబర్‌ టూ హోదా ఉందా.. ఊడిందా? ఎంపీ పదవిలో ఉన్నా కనీసమాత్రపు హ్యాపీ అయినా మిగిలిందా.. లేదా? పార్టీలో ఎందుకు ఒంటరి అయ్యారు? జగన్‌ ఎందుకు ఆయనను దూరం పెట్టారు? జంటగా వర్థిల్లిన జైలుపక్షుల స్నేహం ఎక్కడ బెడిసికొట్టింది? షాడో సీఎంగా వెలిగిపోవాలన్న విజయసాయి అత్యుత్సాహమే ఆయన్ని దెబ్బకొట్టిందా? ఈ ప్రశ్నలకు సమాధానం ఏంటో ఈ కథనంలో తెలుసుకోండి.


     పాలిటిక్స్‌లో కొందరికి కొన్ని కొన్ని సీజన్‌లు కలిసివస్తూ ఉంటాయి. ఆయా సమయాల్లో సదరు నేతలు వెలిగిపోతారు. మిగతా సమయాల్లో సైలెన్స్‌ మెయింటైన్‌ చేస్తుంటారు. వైసీపీలో నిన్నమొన్నటివరకు నెంబర్‌ టూగా వెలిగిపోయిన విజయసాయిరెడ్డి విషయంలోనూ ఇదే మాట వినిపిస్తోంది. ఆయనకి ప్రస్తుతం అన్‌సీజన్‌ నడుస్తోందన్నది పొలిటికల్‌ అనలిస్టుల వ్యాఖ్య! ఇటీవల కొన్ని సందర్భాల్లో సాయిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్‌ బాధితులను పరామర్శించడానికి జగన్‌తో కలిసి వెళ్లాల్సిన ఆయనకు రివర్స్‌ గేర్‌ పడింది. సీఎం కాన్వాయ్‌లోకి ఎక్కికూర్చున్న తర్వాత ఆయనను దిగమని జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఆయన ప్లేస్‌లో డిప్యూటీ సీఎం ఆళ్లనానికి చోటు దక్కింది. పార్టీలో నెంబర్‌ టూకి ఈ పరిస్థితి రావడం అనూహ్యమే. అందుకే ఈ వార్త సోషల్‌మీడియాలోకి క్షణాల్లో పాకిపోయింది. చిలవలు పలువులుగా కథనాలు వెలువడ్డాయి. జగన్‌ పార్టీలో విజయసాయి సీన్‌ సితారా అయ్యిందంటూ విపక్ష నేతలు రాగాలు కూడా తీశారు.


   లోపలేం జరుగుతుందో తెలియదు కానీ.. ప్రస్తుతానికి విజయసాయిరెడ్డి ముఖంలో కొంత కళ తప్పిన మాట నిజం. ఈ మధ్య ఆయన ఓ వివరణ కూడా ఇచ్చుకున్నారు. తాను చనిపోయేవరకు సీఎం జగన్‌కు, ఆయన కుటుంబానికి విధేయుడిగానే ఉంటానని చెప్పుకున్నారు. ఇలా చెప్పుకోవాల్సిన అగత్యం ఆయనకు ఎందుకొచ్చిందీ అన్న లాజిక్కుకి ఆస్కారమిచ్చేలా ఆయన వివరణ ఉండటంతో అసలు వ్యూహం వికటించింది. విజయసాయి ప్రకటన బూమరాంగ్‌ అయ్యిందంటూ విశ్లేషకులు కూడా శ్లేష లేకుండా చెప్పడం గమనార్హం. 


    ఇంతకీ విజయసాయి డిఫెన్స్‌లో పడ్డారా? ఆయనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై వైసీపీ మంత్రులు ఎందుకు కౌంటర్లు ఇవ్వడం లేదు? అసలు విజయసాయి ఎవరికైనా ఫేవర్‌ చేయగల స్థితిలో ఉన్నారా.. లేరా? అన్న ప్రశ్నలు కూడా పరిశీలకులు మెదళ్లకు పదునుపెడుతున్నాయి. జగన్‌కి నమ్మినబంటు, జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఏ2గా ఉండి ఆ తర్వాత వైసీపీలో నెంబర్‌ టూ అనిపించుకున్న విజయసాయిరెడ్డిపై ఇలాంటి అనుమానాలు వ్యక్తంకావడం ఆశ్చర్యకర పరిణామమే. నిప్పులేనిదే పొగ రాదు అన్నట్టుగా ఈ ప్రశ్నలు తలెత్తడం వెనుక తప్పనిసరిగా కార్యకారణ సంబంధం ఉండే ఉంటుందన్నది ప్రతిపక్షాల గట్టి వాదన!


    వైసీపీలో విజయసాయిరెడ్డి నెంబర్‌ టూ కాదా? అంటే అనుమానమే అని కొందరు తేల్చేస్తున్నారు. కొంత కాలంగా సాయిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు, పెడుతున్న ట్వీట్లు వివాదానికి కేంద్రబిందువులు అవుతున్నాయి. ఈ వ్యవహారం వైసీపీలో కూడా ఇంటర్నల్ డిస్కషన్‌కి దారితీస్తోంది. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల రద్దు, పోలవరం రీటెండరింగ్‌ వంటి జగన్‌ ప్రభుత్వ నిర్ణయాలు తీవ్ర చర్చకి దారితీశాయి. ఈ సమయంలో సాయిరెడ్డి కల్పించుకుని "ప్రధాని మోదీ, అమిత్‌షాలతో చర్చించిన తర్వాతే తాము ఏ నిర్ణయమైనా తీసుకుంటున్నాం'' అని ప్రకటించారు. ఈ ప్రకటన కూడా తమ ఇమేజ్‌ని డ్యామేజ్‌ చేసిందని సీఎం జగన్‌ భవించారట. దీనిపై ఇప్పటికీ బీజేపీ నేతలు వాతలు వేస్తున్న మాట నిజం!


     విజయసాయిరెడ్డిని దగ్గరగా యెరిగినవారు "ఆయన మెత్తని మనిషి'' అని చెబుతారు. కానీ ఆయన పోస్ట్‌చేసే ట్వీట్లు, చేస్తున్న కామెంట్లు మాత్రం అందుకు భిన్నం. వాటిలోని భాషపై కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సోషల్‌ మీడియాలో పోస్టుల విషయానికే వద్దాం. అవి ఆయన సన్నిహితుల్లో ఎవరో ఒకరు రాసిచ్చేవని కొందరి వాదన. మీడియా మైకుల ముందుకొచ్చినప్పుడు చెప్పే మాటలు మాత్రం తాను గట్టిగా మాట్లాడగలను అని చాటుకోవడం కోసమే అలా మాట్లాడతారట. ఇదంతా వింటుంటే మీకు అపరిచితుడు సినిమా గుర్తొస్తోందా? నిజమే కావచ్చు కానీ.. విజయసాయిరెడ్డిలోని అపరిచితుడు మాత్రం ఒట్టి నటుడేనంటండోయ్‌!


    ఎవరైనా స్టార్‌ పొలిటీషియన్‌కి "స్టార్‌'' అన్న బిరుదు ఊడిందనుకోండి! ఏమౌతుందీ- పొలిటికల్‌ సర్కిల్స్‌లో అదో పెద్ద టాపిక్‌ అవుతుంది. ప్రస్తుతం వైసీపీలో విజయసాయిరెడ్డి స్టేటస్‌పై కూడా ఇదే రకమైన చర్చ సాగుతోంది. జగన్‌తో సార్‌వాడికి ఎక్కడో బెడిసికొట్టిందన్న టాక్‌ మాత్రం బలంగానే వినిపిస్తోంది. ఈ పరిస్థితి చూసి పరిశీలకులు "ఇంతలో ఎంత మార్పు?'' అని ముక్కున వేలేసుకుంటున్నారు.


   నిజానికి లాబీయింగ్‌లోనూ, ఏదైనా విషయానికి పొలిటికల్ కలరింగ్‌ ఇవ్వడంలో సిద్ధహస్తుడిగా విజయసాయిరెడ్డికి పేరుంది. కష్టాల్లో ఉన్నప్పుడు జగన్‌కి తోడుగా ఉన్న వ్యక్తిగా వైసీపీలో ఆయనకి పెద్దపీటే వేశారు. ఆ మధ్య వరకూ ఆయన నుంచి ఫోన్‌ వస్తే మంత్రులే అలర్ట్‌ అయ్యేవారట. ఎమ్మెల్యేలు అయితే సాయిరెడ్డి ముందు వినయం ప్రదర్శించేవారట. అయితే ఈ పరపతి, పేరు ఇటీవల కాలంలో అడుగంటాయన్నది కొందరి వాదన. ఇప్పుడు ఆయన సీటు కిందకే నీళ్లు వచ్చాయని అంటున్నారు. జగన్‌ ఎంతో నమ్మకంతో ఇచ్చిన బాధ్యతలను, ప్రాధాన్యాన్ని ఆయన నిలుపుకోలేకపోయారట. ఈ పరిణామంతో గతంలో ఆయన్ని చూసి ఆసూయ చెందిన నలుగురైదుగురు రెడ్డి ప్రముఖలు లోలోపల ఉబ్బితబ్బిబవుతున్నారట.


   ఎల్జీ పాలిమర్స్‌ విషవాయు లీకేజీ ఘటనపై విపక్షాల్లో మరో మాట కూడా వినిపిస్తోంది. ఈ కంపెనీ నుంచి విజయసాయి ట్రస్ట్‌కి భారీ విరాళాలు అందాయనీ, ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఆ కంపెనీ వ్యవహారాల్లో సాయిరెడ్డి కల్పించుకుంటున్నారన్న విమర్శలూ ఉన్నాయి. విశాఖను ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా సీఎం జగన్‌ ప్రకటించక ముందునుంచే అక్కడ హవా చెలాయిస్తూ వచ్చిన విజయసాయిరెడ్డి విషవాయు లీకేజీ వార్తతో తీవ్ర అభద్రతాభావానికి గురయ్యారట. ఈ పరిణామం ఆయన స్పీడుకి సడెన్‌ బ్రేక్‌ వేసిందట. ఇటీవల కాలంలో జగన్‌ సహచరి భారతి కూడా విజయసాయిరెడ్డి వ్యవహారశైలిపై అసంతృప్తిగా ఉన్నారని వైసీపీ శ్రేణుల గుసగుస! ఆయనకి ప్రియారిటీ తగ్గించేందుకే సజ్జల రామకృష్ణారెడ్డిని రంగంలోకి తెచ్చారని కొందరు చెప్పుకుంటున్నారు. ఇవన్నీ నిజాలే అయితే.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి టైమ్‌ బాగోలేదనే భావించాల్సి ఉంటుంది!

Updated Date - 2020-06-18T15:52:57+05:30 IST