అన్ని రాష్ట్రాలకు సమప్రాధాన్యమివ్వండి.. కేంద్రానికి విజయసాయి విజ్ఞప్తి

ABN , First Publish Date - 2020-09-16T20:48:58+05:30 IST

ఆయుర్వేద విద్య, పరిశోధనలో జాతీయ ప్రాధాన్యత కలిగిన సంస్థలను దేశంలో కొన్ని రాష్ట్రాలకే పరిమితం చేయకుండా అన్ని రాష్ట్రాలలోను నెలకొల్పాలని రాజ్యసభలో...

అన్ని రాష్ట్రాలకు సమప్రాధాన్యమివ్వండి.. కేంద్రానికి విజయసాయి విజ్ఞప్తి

న్యూఢిల్లీ: ఆయుర్వేద విద్య, పరిశోధనలో జాతీయ ప్రాధాన్యత కలిగిన సంస్థలను దేశంలో కొన్ని రాష్ట్రాలకే పరిమితం చేయకుండా అన్ని రాష్ట్రాలలోను నెలకొల్పాలని కేంద్రాన్ని వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కోరారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టీచింగ్‌ అండ్‌ రీసెర్చి ఇన్‌ ఆయుర్వేద బిల్లు - 2020 బిల్లుపై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. భారతీయ వైద్య విధాన జాతీయ కమిషన్‌ను బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు యోగా, నేచురోపతి వంటి వైద్య విధానాలను విస్మరించినట్లుగా కనిపిస్తోందని అన్నారు. ఆయుర్వేదంతో పాటు యోగా, నేచురోపతి ఇతర ప్రాచీన భారతీయ వైద్య విధానాలకు కూడా సమ ప్రాధాన్యత కల్పించినపుడు మాత్రమే భారతీయ వైద్య విధానాలలో అత్యుత్తమ ప్రమాణాల నెలకొల్పడం సాధ్యపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇతర భారతీయ వైద్య విధానాలను కూడా సమూలంగా సంస్కరించాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. 


ఆయుర్వేద వైద్య విద్యా బోధన, పరిశోధనకు సంబంధించిన ఈ బిల్లు ద్వారా ఆయుర్వేద వైద్య రంగంలో నెలకొన్న అనేక సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని విజయసాయి రెడ్డి అన్నారు. ఆయుర్వేద విద్యలో ప్రమాణాలు, మదింపు, విద్యా సంస్థల అక్రిడిటేషన్‌ వంటి ప్రక్రియలు క్రమబద్ధం కాగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వాటిని విస్మరించడం వలన భారతీయ వైద్య విధానంలో వృత్తిపరంగా ఉన్నత ప్రమాణాలు, అక్రిడిటేషన్ ప్రక్రియ అమలు సాధ్యం కాదన్నారు. అలాగే నేషనల్ ఎగ్జిట్ టెస్ట్‌లో అర్హత సాధించని వారు కూడా ఆయుర్వేద వైద్యాన్ని ప్రాక్టీస్‌ చేయడానికి అనుమతించడంతో నకిలీ వైద్యుల సమస్య ఉత్పన్నమవుతోంది. దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

Updated Date - 2020-09-16T20:48:58+05:30 IST