విడదల రజనీ ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంలో ట్విస్ట్...!

ABN , First Publish Date - 2020-10-31T17:46:52+05:30 IST

గుంటూరు జిల్లా వైసీపీలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై రహస్య విచారణ కొలిక్కి వచ్చిందా? ఆ దర్యాప్తు పూర్తవడమేగాక నివేదిక సైతం ప్రభుత్వం చెంతకు చేరిందా? ఇంతకీ విచారణ నివేదిక ఏం చెబుతోంది?

విడదల రజనీ ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంలో ట్విస్ట్...!

గుంటూరు జిల్లా వైసీపీలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై రహస్య విచారణ కొలిక్కి వచ్చిందా? ఆ దర్యాప్తు పూర్తవడమేగాక నివేదిక సైతం ప్రభుత్వం చెంతకు చేరిందా? ఇంతకీ విచారణ నివేదిక ఏం చెబుతోంది? ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరి ప్రమేయం ఉందని తేలింది? ఈ స్టోరీ చదవండి.


వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా...

గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నారు. టీడీపీ నుంచి వైసీపీలో చేరటం.. చేరిన వెంటనే అసెంబ్లీ టికెట్‌ దక్కించుకోవడం.. గెలవడం చకచక జరిగిపోయాయి. ఎమ్మెల్యే అయిన తర్వాత వైసీపీ సీనియర్‌ నేత మర్రి రాజశేఖర్‌తో రజనీ వివాదాలు పార్టీలు హాట్ హాట్‌ చర్చకు దారితీశాయి. ఆ తర్వాత నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులతో గొడవలు తారాస్థాయికి వెళ్లాయి. తనకు చెప్పకుండా నియోజకవర్గానికి వచ్చారని రెండుసార్లు ఆమెవర్గం ఎంపీని అడ్డుకోవడం సంచలనంగా మారింది. ఆమె దూకుడుగా వ్యవహరించడంతో కోరి శత్రువర్గాన్ని పెంచుకుందని పార్టీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. ఇప్పుడు మరో విధంగా పార్టీలో చర్చకు కారణమయ్యారు రజని. ఆమె ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపులు తిరుగుతోంది.


సీఎం జగన్ సీరియస్...

ఫోన్‌ ట్యాపింగ్‌ తతంగం మొత్తాన్ని ఆధారాలతో విడదల రజని నేరుగా సీఎం జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. బీసీ వర్గానికి చెందిన తనను వేధిస్తున్నారనీ, తనతోసహా తన అనుచరుల కాల్‌డేటాను బయటకు తీశారనీ వాపోయారట. దీంతో విషయాన్ని సీఎం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా వైసీపీలో రేగిన ఫోన్ ట్యాపింగ్ వివాదం.. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేదిలా ఉండటంతో..ఈ వ్యవహారం బయటకు రాకుండా తొక్కిపెట్టే ప్రయత్నం చేశారు. అయితే అది బయటకు పొక్కడం.. రాజకీయంగా ఎంతటి దుమారం రేపిందో, పోలీసుశాఖలో కూడా అదే స్థాయిలో చర్చకు దారితీసింది. ఇప్పటికే గురజాల డీఎస్పీతోపాటుగా సీఐపై సస్పెన్షన్ వేటు పడటంతో తీవ్ర కలకలం రేగింది. పోలీసు అధికారులపై అందులోనూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సస్పెన్షన్ అంటే.. అది ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతుంది కాబట్టి.. వారిని వీఆర్‌కు పంపి చర్యలు తీసుకోవాలని పల్నాడు ప్రాంతానికి చెందిన కొందరు వైసీపీ నాయకులు పట్టుబడుతున్నట్లు సమాచారం.


దొంగతనం కేసులో పెట్టి...

మరోవైపు ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంలో పోలీసు అధికారులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో పోలీసు అధికారులు విచారణను మరింత వేగవంతం చేశారు. ఒక ఏటీఎం సెంటర్‌లో డబ్బులు పోగొట్టుకున్న బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతోపాటు మరొక చోరీకి సంబంధించిన కేసుల్లో ఆధారాల కోసం అన్నట్లుగా రికార్డులు చూపించి ఎమ్మెల్యే విడదల రజనీతోసహా ఆమె ముఖ్య అనుచరుల్లోని ఆరుగురి ఫోన్‌ ట్యాపింగ్ చేయించారట. ఇదే ఇప్పుడు అసలు సమస్యగా మారిందట. దొంగతనం కేసుల్లో ఎమ్మెల్యే రజనీ, ఆమె అనుచరులకు చెందిన ఫోన్ నెంబర్లు పెట్టి.. వాటి కాల్‌డేటా బయటకు తీయడమే తీవ్ర దుమారం రేగడానికి కారణమైందని చర్చ జరుగుతోంది.


కక్ష సాధింపులో భాగంగానే...

ఈ విషయం డీజీపీ దృష్టికి వెళ్లడంతో విచారణ మరింత వేగవంతమైనట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్‌కు ముఖ్య కారణాలతోపాటు ఇందులో ప్రమేయం ఉన్న నేతల వివరాలు.. ఇప్పటికే నిఘా వర్గాల ద్వారా డీజీపీకి వెళ్లాయట. ఈ విషయాలను సీఎంకు కూడా వివరించారని చెబుతున్నారు. ఎంపీతోపాటుగా పల్నాడుకు చెందిన ఓ ముఖ్యనేత ప్రమేయం కూడా ఉందని తెలిసి పోలీసులు ఆశ్చర్చానికి గురయ్యారు. రాజకీయ కక్షసాధింపు చర్యల కోసమే.. ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడ్డారనీ, ఈ కోణంలోనే జిల్లా ఎస్పీ నివేదిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపారనీ విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. మరి వైసీపీలో ఈ వ్యవహారం మున్ముందు ఇంకా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.

Read more