-
-
Home » Andhra Pradesh » VEGETABLES OUT OF REACH
-
కూరలకు కటకట
ABN , First Publish Date - 2020-03-25T08:54:21+05:30 IST
మహారాష్ట్ర నుంచి తెలంగాణమీదుగా బంగాళదుంప రావాలి! కర్ణాటక సరిహద్దులనుంచి క్యారెట్, బీట్రూట్, క్యాప్సికం, బీన్స్ మన మార్కెట్‌కు చేరాలి! లాక్‌డౌన్‌తో రాష్ట్రాల...

క్యారెట్, బీట్రూట్, బీన్స్ కిలో 100
- ఏది కొందామన్నా దడే.. రైతుబజార్లలో కానని వైనం
- లాక్‌డౌన్‌తో సరిహద్దులను మూసివేయడమే కారణం
- అన్ని రిటైల్ మార్కెట్లలో 2 రోజుల్లోనే రేటు రెట్టింపు
- 60 పలికిన కిలో టమాట.. బంగాళదుంప రూ.80
- ఆకుకూరపై ‘బస్సు’ దెబ్బ
- ప్రైవేటే గతి కావడంతో రైతు బజార్లలోనూ మంటే
అమరావతి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్ర నుంచి తెలంగాణమీదుగా బంగాళదుంప రావాలి! కర్ణాటక సరిహద్దులనుంచి క్యారెట్, బీట్రూట్, క్యాప్సికం, బీన్స్ మన మార్కెట్‌కు చేరాలి! లాక్‌డౌన్‌తో రాష్ట్రాల సరిహద్దులు మూసేయడంతో మంగళవారం ఈ కాయగూరలు చూద్దామన్నా కనిపించలేదు. ఇప్పటికే నిల్వచేసుకొన్నమేరకు బంగాళదుంప ఎక్కువ రేటు పెడితే దొరికిందిగానీ, మిగతా కూరలు మాత్రం రైతుబజార్లలో కనిపించలేదు. బయట కొందామంటే రేట్లు భగ్గుమంటున్నాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి రావాల్సిన లోడ్లు లాక్‌డౌన్‌తో బాగా తగ్గిపోవడంతో ఆకుకూరలు, ఇతర కూరగాయలదీ ఇదే పరిస్థితి! దీంతో ఉగాది పచ్చడి కోసం కిలో చిన్నసైజు మామిడి కాయలను రూ.100 పెట్టి జనం కొనడం కనిపించింది. రెండు రోజుల్లోనే ఆకుకూరలు, కాయగూరల ధరలు రెట్టింపు అయ్యాయని రిటైల్ వ్యాపారులు పేర్కొంటున్నారు. రిటైల్ మార్కెట్‌లో మంగళవారం దాదాపు అన్ని రకాల కూరగాయలు కిలో రూ.80పైనే పలికాయి. క్యారెట్, బీన్స్, క్యాప్సికం ధర ఏకంగా రూ.100కి ఎగబాకింది. రెండురోజులక్రితం కిలో రూ.20 ఉన్న టమాట రూ.60కి చేరింది. రూ.40 మించని బంగాళదుంప రూ.80కి చేరింది. చిక్కుడు, కాకర, పచ్చిమిర్చి అదే రీతిలో మండాయి. ఆకుకూరల ధరలు ఆమాంతం పెంచేశారు. గోంగూర, తోటకూర కట్ట రూ.15 చెబుతుండగా, పాలకూర, చుక్కకూర రూ.20, కొత్తిమేర, పుదీన చిన్న కట్టలు రూ.50దాకా పలికాయి.
రైతుబజార్ల ముట్టడి..
ఇంతింత రేట్లు పెట్టి రిటైల్ మార్కెట్‌లో కొనలేని వినియోగదారులు తెలతెలవారుతుండగానే రైతుబజార్లను దాదాపు ముట్టడించేస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఉదయం తొమ్మిది లోపు కనిపించిన కాయగూరలను కొనేసుకొని ఇళ్లకు చేరుకోవడానికి ఆత్రుత పడుతున్నారు. ఈ క్రమంలో ఎంత చెబితే అంతే! మారుమాడ్లాడినా, బేరాలకు దిగినా వారి వెనుక ఉన్న వారు ముందుకు తోసుకొచ్చి.. అడిగినంత ఇచ్చేసి పట్టుకుపోతున్నారు. మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకే విశాఖ, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి రైతుబజార్లలో సరుకంతా ఆయిపోయింది. విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్‌లో ప్రత్యేకంగా స్టాల్స్ వద్ద విపరీతమైన రద్దీ ఏర్పడింది.
తోడైన ప్రైవేటు బాదుడు..
సహజంగా తోటల నుంచి రైతులు కూరగాయలను బస్సుల్లో మార్కెట్లు, రైతుబజార్లకు తరలిస్తారు. ప్రస్తుతం ప్రజారవాణా పూర్తిగా బంద్ అయింది. ప్రైవేటు వాహనదారులు ఎంత అడిగితే అంత ఎక్కువ బాడుగలిచ్చి మార్కెట్లకు తమ సరుకును రైతులు తెస్తున్నారు. ధరలు పెరిగిపోవడానికి ఇదీ ఒక కారణమే! నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరల పర్యవేక్షణకు ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ కార్యదర్శి అధ్యక్షతన కమిటీని నియమించింది. కానీ ధరల అదుపునకు ఎక్కడా తనిఖీలు జరిగిన దాఖలా లేదు. రైతుబజార్లలో నిర్ణయించిన ధరలకే కూరగాయలు అమ్ముతున్నట్లు ఆ బజార్ల సీఈవో చెబుతున్నారు. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రైతు బజార్లు, మార్కెట్లలో సామాజికదూరం పాటించాలని ప్రభుత్వం ఎంత సూచిస్తున్నా.. సరుకు అయిపోతుందేమోనన్న కంగారులో వినియోగదారులు ఎగబడుతూనే ఉన్నారు. కూరగాయలు నిత్యావసరం కావడంతో అధికారులూ ఏమీ చేయలేకపోతున్నారు. ఉదయం 9గంటల వరకే సరుకుల కొనుగోలుకు అనుమతిస్తామని పోలీ్‌సశాఖ చెబుతున్నా, చాలా చోట్ల గంటల తరబడి ప్రజలు గుమిగూడుతున్నారు.