వ్యక్తిగత ద్వేషంతోనే రమేష్‌కుమార్‌ను తొలగించారు : వర్ల

ABN , First Publish Date - 2020-04-28T16:46:39+05:30 IST

వైసీపీ ప్రభుత్వం వ్యక్తిగత ద్వేషంతోనే ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను..

వ్యక్తిగత ద్వేషంతోనే రమేష్‌కుమార్‌ను తొలగించారు : వర్ల

అమరావతి: వైసీపీ ప్రభుత్వం వ్యక్తిగత ద్వేషంతోనే ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తొలగించారని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. మంగళవారం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. ప్రస్తుత పరిస్థితిలో ఎన్నికలు జరపలేమని పేర్కొంటూ స్థానిక ఎన్నికలను వాయిదా వేశారన్నారు. ఈ విషయంపై ప్రభుత్వంతో చర్చించాల్సిన అవసరం లేదన్నారు. రాజ్యంగంపై వైసీపీ నేతలకు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని వర్ల రామయ్య మండిపడ్డారు. ఎన్నికలు వాయిదా వేశారనే కోపంతో.. ఆయనపై ద్వేషం పెంచుకుని పదవి నుంచి తొలగించారన్నారు. 


ఎన్నికలు వాయిదావేసి వైరస్ నుంచి తమను రక్షించారంటూ రాష్ట్ర ప్రజలు రమేష్ కుమార్‌ను కొనియాడుతుంటే.. ముఖ్యమంత్రి జగన్‌కు వైసీపీ నేతలకు మాత్రం నచ్చలేదని, అందుకే కక్షగట్టి ఆయనను తప్పించారని వర్ల రామయ్య ఆరోపించారు. స్థానిక ఎన్నికలపై సీఎం ఎందుకు ఇంత ప్రేమ, అభిమానం చూపిస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ను అరికట్టడంలో సీఎం జగన్ ఘోరంగా విఫలమయ్యారని, అందుకే పాజిటీవ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని విమర్శించారు. 

Updated Date - 2020-04-28T16:46:39+05:30 IST