శిశుపాలుడికి పట్టిన గతే జగన్‌కు పడుతుంది: వర్ల

ABN , First Publish Date - 2020-11-07T19:30:32+05:30 IST

వైసీపీ ప్రభుత్వం ప్రశ్నించేవారి గొంతు నొక్కుతోందని, ఇవాళ అది కళ్లకుకట్టినట్లు..

శిశుపాలుడికి పట్టిన గతే జగన్‌కు పడుతుంది: వర్ల

అమరావతి: వైసీపీ ప్రభుత్వం ప్రశ్నించేవారి గొంతు నొక్కుతోందని, ఇవాళ అది కళ్లకుకట్టినట్లు కనిపిస్తోందని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. శనివారం దళితులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే మహిళా పోలీసులు మహిళలను ఈడ్చుకుంటూ, పీకల్ని అదిమిపట్టుకుని తీసుకువెళుతున్న దానిపై స్పందించిన ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ప్రశ్నిస్తున్న మహిళా ఉద్యమకారిణి గొంతు నొక్కుతున్నారని అన్నారు. రాష్ట్రంలో దళితవర్గాలపై దాడులు జరుగుతున్నాయని, ఈ దాడులు ఆపాలని, ప్రభుత్వం కళ్లు తెరవాలని ప్రశ్నిస్తుంటే.. ఆ గొంతును నొక్కుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ చేసిన తప్పులు రోజు రోజుకు పెరిగి పోతున్నాయని, శిశుపాలుడికి పట్టిన గతే జగన్‌కు పడుతుందన్నారు. సీఎం రాజకీయ జీవితం అంతమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.


దళితులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే మహిళలని కూడా చూడకుండా మహిళా పోలీసులు ఈడ్చుకుంటూపోతున్నారని వర్ల రామయ్య మండిపడ్డారు. జగన్ సీఎం కావాలని ఎగిరెగిరి ఎవరు ఓట్లు వేశారో వాళ్లే ఇప్పుడు సమాధానం చెప్పాలన్నారు. దళిత ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వాళ్లపై దాడులు చేయిస్తూ, ఊచకోత కోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-11-07T19:30:32+05:30 IST