వంగపండు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు

ABN , First Publish Date - 2020-08-16T23:10:47+05:30 IST

ఇటీవల చనిపోయిన ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు కుటుంబ సభ్యులను ఉపముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాస్, పాముల పుష్ప శ్రీవాణి, మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని

వంగపండు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు

పార్వతీపురం: ఇటీవల కన్నుమూసిన విప్లవ గాయకులు వంగపండు ప్రసాదరావు కుటుంబాన్ని ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణ దాసు, పాముల పుష్ప శ్రీవాణి, మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని పరామర్శించారు. పార్వతీపురంలో వంగపండు స్వగృహానికి వచ్చిన వీరు వంగపండు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ వంగపండు జీవితాన్ని కీర్తించారు.


తొలుత ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణ దాసు మాట్లాడుతూ.. వంగపండు ప్రసాదరావు మరణం పేదలకు, అణగారిన వర్గాలకు తీరనిలోటు అని అన్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్‌కు తోడుగా ఉన్న మంచి నాయకురాలు వంగపండు ఉష అని పేర్కొన్నారు. పేదల అవసరాలను తన గొంతు ద్వారా, నాట్యం ద్వారా తెలియపరచే ప్రయత్నం పార్టీకి మంచి ఫలితాలు ఇచ్చిందన్నారు. వంగపండు ప్రసాదరావు తన కవితలతో, గేయాలతో ప్రజలను చైతన్య పరచిన ప్రజాభిమాని అని కీర్తించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తరపున తామంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నామని, సీఎం జగన్ తరఫున వంగపండు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వంగపండు కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని మంత్రి ధర్మాన భరోసా ఇచ్చారు.


మంత్రి శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ.. విప్లవ కవిగా గీతాలతో, పాటలతో, రచనలతో ఉత్తరాంధ్ర వెనుకబాటు తనాన్ని ప్రతి ఒక్కరికీ తెలిసేలా చేసిన గొప్ప వ్యక్తి వంగపండు ప్రసాదరావు అని కొనియాడారు. పాటలతో, ఆటలతో ప్రజలలో చైతన్యం తీసుకువచ్చారన్నారు. భౌతికంగా ఆయన ప్రజల మధ్య లేనప్పటికీ గజ్జకట్టి నాట్యం చేసే కళాకారుల రూపంలో బ్రతికే ఉంటారని అన్నారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చి వైసీపీ అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన వంగపండు ఉషకు రాష్ట్ర సృజనాత్మక, సాంస్కృతిక కమిషన్ చైర్ పర్సన్ పదవి ఇచ్చి సీఎం జగన్ ఉన్నత స్థాయి కల్పించారని పేర్కొన్నారు. వంగపండు కుటుంబానికి సీఎం జగన్ అండగా ఉంటారని అన్నారు.


అణగారిన వర్గాల గొంతై జీవించిన వంగపండు ప్రసాదరావు మన మధ్య లేకపోవడం బాధాకరం అని మంత్రి పేర్ని నాని అన్నారు. వంగపండు ప్రసాదరావు భౌతికంగా లేకపోయినా ఆయన పాట, మాట, ఆట ఎల్లప్పుడూ జీవించే ఉంటాయన్నారు. వంగపండు మృతి తనను తీవ్రంగా కలచివేసిందని, ఆయన కుటుంబ సభ్యులకు పేర్ని నాని ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి వంగపండు ప్రసాదరావు అని మరో మంత్రి కొడాలి నాని అన్నారు. ఆయన మరణం కళా రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని మంత్రి ప్రార్థించారు.


ఇదిలాఉండగా, ఈ కార్యక్రమంలో తెలుగు భాషా పరిరక్షణ సమితి, సముద్రాల గురుప్రసాద్ రచించిన ప్రజాకవి వంగపండు పుస్తకాన్ని మంత్రులు ఆవిష్కరించారు. వంగపండు కుటుంబాన్ని పరామర్శించటానికి మంత్రుల వెంట ఎమ్మెల్యే అలజంగి జోగారావు, అరకు వైసీపీ నేత శత్రుచర్ల పరీక్షత్ రాజు, కళాకారులు వచ్చారు.


Updated Date - 2020-08-16T23:10:47+05:30 IST