ఇలలో వైకుంఠ శోభ!

ABN , First Publish Date - 2020-12-26T08:16:23+05:30 IST

ఇల వైకుంఠం..తిరుమల పుణ్యక్షేత్రం వైకుంఠ ఏకాదశి శోభతో అలరారింది. భక్తుల జయజయధ్వానాల నడుమ శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు సాఫీగా సాగాయి.

ఇలలో వైకుంఠ శోభ!

తిరుమల భూలోక వైకుంఠమైంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా శుక్రవారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి స్వర్ణరథంపై కొలువుదీరి నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. గోవింద నామస్మరణలతో తిరుమల కొండ మార్మోగింది.


తిరుమల, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఇల వైకుంఠం..తిరుమల పుణ్యక్షేత్రం వైకుంఠ ఏకాదశి శోభతో అలరారింది. భక్తుల జయజయధ్వానాల నడుమ శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు సాఫీగా సాగాయి. గురువారం అర్ధరాత్రి 12.05 గంటలకు తిరుప్పావైతో శ్రీవారిని మేల్కొలిపి 3.30 గంటల వరకు ఏకాంతంగా ధనుర్మాస కైంకర్యాలు, అభిషేకం, తోమాల, అర్చన సేవలను నిర్వహించారు. వైకుంఠ ద్వారాలను పుష్పాలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. తర్వాత  వీఐపీ బ్రేక్‌లో శుక్రవారం ఉదయం 8 గంటల వరకు ప్రముఖులు, ఆ తర్వాత సర్వదర్శన భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం స్వామివారి స్వర్ణరథోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి స్వర్ణరథంపై కొలువుదీరి మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం ద్వాదశి సందర్భంగా పుష్కరిణిలో చక్రస్నాన కార్యక్రమాన్ని ఏకాంతంగా నిర్వహించనున్నారు. 40-42 వేల మందికి దర్శనం కల్పించే అవకాశముందని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.  




శ్రీవారిసేవలో న్యాయమూర్తులు

 వైకుంఠ ఏకాదశి సందర్భంగా పలువురు న్యాయమూర్తులు శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సుప్రీం కోర్టు సీజే జస్టిస్‌ అరవింద్‌ బాబ్డే, న్యాయమూర్తి ఇందు మల్హోత్ర, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు రాకేశ్‌కుమార్‌, మానవేంద్రనాథ్‌రాయ్‌, వెంకటరమణ, దుర్గాప్రసాదరావు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి అమర్నాథ్‌గౌడ్‌ వేకువజామున వైకుంఠ ద్వార ప్రవేశం చేసి స్వామిని దర్శించుకున్నారు. అలాగే  ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, మంత్రులు సురేశ్‌, బాలినేని శ్రీనివా్‌సరెడ్డి దర్శనం చేసుకున్నారు. కాగా, శీవారి దర్శనార్థం ఇచ్చే సుపథం ప్రవేశ టికెట్‌ ధరను టీటీడీ రూ.300 నుంచి రూ.వెయ్యికి పెంచింది. టీటీడీకి  శుక్రవారం రూ.2.62 కోట్లు విరాళంగా అందింది. శ్రీవారి హుండీ ఆదాయం రికార్డుస్థాయిలో లభించింది. గురువారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు హుండీలో సమర్పించిన కానుకలతో పాటు శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శనంలోనూ వచ్చిన హుండీ కానుకలను శుక్రవారం సాయంత్రం లెక్కించారు. రికార్డుస్థాయిలో రూ.4.39 కోట్లు హుండీ ఆదాయం లభించింది. 

Updated Date - 2020-12-26T08:16:23+05:30 IST