-
-
Home » Andhra Pradesh » Vacation for land disputes with the Reserve
-
రీసర్వేతో భూవివాదాలకు సెలవు!
ABN , First Publish Date - 2020-12-10T08:12:27+05:30 IST
వైఎ్‌సఆర్-జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ కార్యక్రమమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రప్రభుత్వం-

సువర్ణాక్షరాలతో లిఖించే కార్యక్రమం
తరతరాల సమస్యలకు పరిష్కారం
స్థిరాస్తికి టైటిల్ ఇచ్చాక
అభ్యంతరాలకు అవకాశం
సచివాలయాల్లో రెండేళ్లు పరిశీలన
ఆ తర్వాత శాశ్వత భూహక్కు
అనంతరమూ ప్రభుత్వానిదే బాధ్యత
కలెక్టర్లతో సీఎం జగన్
సర్వే ఆఫ్ ఇండియాతో ఎంవోయూ
అమరావతి, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): వైఎ్‌సఆర్-జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ కార్యక్రమమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రప్రభుత్వం-సర్వే ఆఫ్ ఇండియా కలిసి సమగ్ర సర్వే చేస్తున్నాయని తెలిపారు. బుధవారం సర్వే జనరల్ ఆఫ్ ఇండియా లెఫ్టినెంట్ జనరల్ గిరీశ్‌కుమార్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది.
అనంతరం సీఎం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో తొలిసారిగా భారీ స్థాయిలో సర్వే చేస్తున్నామన్నారు. ఎక్కడా ఇంత పెద్ద స్థాయిలో ఎప్పుడూ సర్వే జరగలేదని చెప్పారు. ‘గ్రామాల్లో తరతరాలుగా పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యలు తీరిపోతాయి. భూవివాదాలకు చెక్ పడుతుంది. గ్రామాల్లో మంచి వాతావరణం ఏర్పడుతుంది. భూములపై న్యాయమైన, చట్టబద్ధమైన హక్కులు లభిస్తాయి. కుటుంబాలు, వారసులకు మంచి వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఇంటి స్థలం, పొలం, మరో స్థిరాస్తి.. దేనికైనా ఒక టైటిల్ ఇచ్చిన తర్వాత రెండేళ్ల పాటు పరిశీలనలో అదే గ్రామ సచివాలయంలో పెడతాం. ఆ టైటిల్ మీద ఏమైనా అభ్యంతరాలుంటే తెలియజేయాలని కోరతాం. రెండేళ్ల తర్వాత టైటిల్‌కు శాశ్వత భూహక్కు లభిస్తుంది. ఆ తర్వాత కూడా ఏమైనా అభ్యంతరాలుంటే ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది.
వందేళ్ల తర్వాత ఈ సర్వే జరుగుతోంది. 100 ఏళ్లలో సబ్ డివిజన్లు, పంపకాలు క్షేత్రస్థాయిలో నమోదు కాలేదు. వాటన్నిటినీ రికార్డులోకి ఎక్కించి రాళ్లు కూడా వేస్తాం. తర్వాత యూనిక్ ఐడెంటిటీ నంబర్‌తో కార్డు కూడా ఇస్తాం. ఆ కార్డులో క్యూఆర్ కోడ్ ఉంటుంది. హార్డ్‌కాపీ కూడా ఇస్తారు. ల్యాండ్ పార్సిళ్లు, మ్యాపులు కూడా గ్రామాల్లో అందుబాటులో ఉంచుతాం. రికార్డులన్నిటినీ కూడా డిజిటలైజ్ చేస్తాం. గ్రామ హ్యాబిటేషన్‌కు సంబంధించి మ్యాపులు కూడా అందుబాటులోకి తెస్తాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ సర్వే రికార్డులుంటాయి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్, రెవెన్యూ సేవలు అందుబాటులోకి వస్తాయి’ అని పేర్కొన్నారు.
కచ్చితమైన కొలతలుంటాయి
తేడా 5 సెం.మీ. ఉండొచ్చు: సర్వేయర్ జనరల్
అమరావతి, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): ‘కచ్చితమైన కొలతలు ఉంటాయి. తేడా అత్యంత సూక్ష్మస్థాయిలో 5 సెం.మీ.కు అటూ ఇటుగా ఉంటుంది. అత్యాధునిక సదుపాయాలు, కార్స్ టెక్నాలజీ, డ్రోన్లు, రోవర్లు వాడతాం’ అని సర్వేయర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ గిరీశ్‌కుమార్ తెలిపారు. బుధవారం రాష్ట్రప్రభుత్వంతో రీసర్వేపై ఎంవోయూ కుదుర్చుకున్న అనంతరం.. సీసీఎల్‌ఏ నీరబ్‌కుమార్ ప్రసాద్, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం, సర్వే ఆఫ్ ఇండియా ఇండియా కలిసి 70 బేస్‌స్టేషన్లు పెడుతున్నట్లు చెప్పారు.
సీసీఎల్‌ఏ మాట్లాడుతూ.. రాష్ట్రం మొత్తమ్మీద 3 దశల్లో 1.26 లక్షల చ.కి.మీ. మేర సర్వే చేస్తున్నట్లు తెలిపారు. డ్రోన్ల ద్వారా సర్వే మొదలుపెట్టే సమయానికి గ్రామాల సరిహద్దులు, వాటి మార్కింగ్స్‌ను పూర్తిచేయాల్సి ఉంటుందన్నారు. ప్రతి మండలంలో ఒక డ్రోన్ టీం, డేటా ప్రాసెసింగ్, రీసర్వే టీంల ఏర్పాటుపై కలెక్టర్లు దృష్టి పెట్టాలని సూచించారు. ‘తొలిదశ 21న ప్రారంభమవుతుంది. 5వేల రెవెన్యూ గ్రామాల్లో వచ్చే జూలై వరకు సాగుతుంది. వచ్చే ఆగస్టు నుంచి 6,500 రెవెన్యూ గ్రామాల్లో రెండోవిడత ప్రారంభమై 2022 ఏప్రిల్ వరకు కొనసాగుతుంది. మిగిలిన గ్రామాల్లో 2022 జూలై నుంచి 2023 జనవరి వరకుసాగుతుంది
. రెండోవిడత ప్రారంభమయ్యేలోపు సంబంధిత గ్రామ సచివాలయాల్లో సబ్ రిజిస్ట్రార్ సేవలు అందుతాయి. అక్కడే రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయి. వివాదాలు పరిష్కరించడానికి 660 మొబైల్ మేజిస్ట్రేట్ ట్రైబ్యునళ్లు పెడుతున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 14వేల మంది సర్వేయర్లను ప్రభుత్వం నియమించింది. వారు గ్రామ/వార్డు సచివాలయాల్లో ఉన్నారు. 9,400 మంది ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్నారు. జనవరి 26కల్లా మిగిలిన వారికీ శిక్షణ పూర్తవుతుంది. సర్వే సన్నద్ధతపై కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలి. రాష్ట్ర స్థాయిలో ల్యాండ్ టైటిలింగ్ అథారిటీని ఏర్పాటు చేస్తున్నాం. జిల్లా స్థాయిలో ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయాలి’ అని నిర్దేశించారు.