‘పరిశోధన’ పర్యవేక్షణలో మాయ

ABN , First Publish Date - 2020-06-22T09:15:38+05:30 IST

రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల్లో పరిశోధన పర్యవేక్షకుల కేటాయింపులో మాయ జరుగుతోంది. యూజీసీ-2016 నిబంధనల ప్రకారం

‘పరిశోధన’ పర్యవేక్షణలో మాయ

  • యూజీసీ నిబంధనలు గాలికొదిలిన వర్సిటీలు
  • కాంట్రాక్టు, కోర్టు ఆర్డర్‌పై ఉన్న వారూ గైడ్లు!
  • వర్సిటీల ర్యాంకుల కోసం అడ్డదారులు 
  • లెక్కకు మించి పరిశోధకుల కేటాయింపు

అమరావతి, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల్లో పరిశోధన పర్యవేక్షకుల కేటాయింపులో మాయ జరుగుతోంది. యూజీసీ-2016 నిబంధనల ప్రకారం కేవలం రిఫరీడ్‌ జర్నల్స్‌లో నిర్ణీత సంఖ్యలో పరిశోధన పత్రాలు ప్రచురింపజేసిన రెగ్యులర్‌  అధ్యాపకులనే ఎం.ఫిల్‌, పీహెచ్‌డీ కోర్సులకు పరిశోధన పర్యవేక్షకులుగా కేటాయించాలి. తదనుగుణంగానే వర్సిటీల అకడమిక్‌ సెనేట్‌లు పరిశోధన నిబంధనలను రూపొందించాయి. కాగా ఆచార్య నాగార్జున, శ్రీకృష్ణదేవరాయ వంటి విశ్వవిద్యాలయాలు పరిశోధన పర్యవేక్షకుల కేటాయింపులో యూజీసీ నిబంధనలను తుంగలో తొక్కాయి. ఆచార్య నాగార్జున వర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకులను సైతం పరిశోధన పర్యవేక్షకులుగా కేటాయించడానికి రంగం సిద్ధం చేయడం యావత్తు అకడమిక్‌ సమాజాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అధికార పార్టీ వ్యక్తులుగా ముద్రపడ్డ కొందరు కాంట్రాక్టు అధ్యాపకులకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా పరిశోధన పర్యవేక్షకులుగా కేటాయించనుంది.


వర్సిటీలో ఇంజనీరింగ్‌, ఫార్మసీ కళాశాలతోపాటు ఆర్ట్స్‌, సైన్స్‌ కళాశాలల్లో కాంట్రాక్టు అధ్యాపకులు ఉన్నారు. కానీ కేవలం ఇంజనీరింగ్‌, ఫార్మసీ కళాశాలల్లో మాత్రమే పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను పరిశోధన పర్యవేక్షకులుగా నియమించాలని తీర్మానం చేశారు. ఈ విధంగా యూజీసీ నిబంధనలను అతిక్రమించడమే కాకుండా వర్సిటీలకు ర్యాంకింగ్‌ ఇచ్చే సంస్థలను సైతం మోసం చేసే ఉద్దేశంతో వ్యవహరిస్తున్నారని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో 21 మంది గత పదేళ్ల నుంచి నియామకాల్లో అక్రమాల ఆరోపణల కేసు నేపథ్యంలో నేటికీ రెగ్యులరైజ్‌ కాకుండా కేవలం కోర్టు ఆర్డర్‌ మీదనే అధ్యాపకులుగా కొనసాగుతున్నారు.


వారికి రెగ్యులర్‌ ఆచార్యులతో పాటు జీతభత్యాలు సైతం ఏళ్లు గడచినా ఫిక్స్‌ కాలేదు. ప్రస్తుతం పూర్తి అదనపు బాధ్యతలతో ఉన్న ఇన్‌చార్జి వైస్‌ చాన్సెలర్‌ని కొందరు ఉన్నతాధికారులు తప్పుదారి పట్టించినట్లు తెలుస్తోంది. కోర్టు ఆర్డర్‌ మీద కొనసాగుతున్న ఈ 21 మంది అధ్యాపకులను పరిశోధన పర్యవేక్షకులుగా కేటాయించడానికి రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. అకడమిక్‌ సెనేట్‌ ఆమోదం కూడా లేకుండానే వీరిని పరిశోధన పర్యవేక్షకులుగా కేటాయించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. యూజీసీ నిబంధనల ప్రకారం ఒక ఆచార్యుడికి ఏ సమయంలోనైనా 8మందికి మించి పీహెచ్‌డీ పరిశోధకులను కేటాయించరాదు. అలాగే అసోసియేట్‌ ప్రొఫెసర్‌కి ఆరుగురు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కి నలుగురికి మించి పీహెచ్‌డీ పరిశోధకులను కేటాయించరాదు. పలు వర్సిటీలలో చాలామంది పరిశోధన పర్యవేక్షకుల దగ్గర ఈ సంఖ్య దాటినా, కొత్తగా పీహెచ్‌డీ పరిశోధకులను కేటాయించి నిబంధనలను అతిక్రమిస్తున్నారు. కొందరు అధ్యాపకుల దగ్గర ప్రస్తుతం 30 మందికి మించి కూడా పరిశోధకులు రిజిస్టర్‌ అయినట్లు సమాచారం. 

Updated Date - 2020-06-22T09:15:38+05:30 IST