హైకోర్టులో ఇద్దరు ఉద్యోగులకు పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-06-26T07:44:46+05:30 IST

హైకోర్టులో కరోనా కలకలం రేగింది. ఇద్దరు ఉద్యోగులకు పాజిటివ్‌ అని తేలడంతో హైకోర్టుతో పాటు, విజయవాడలో..

హైకోర్టులో ఇద్దరు ఉద్యోగులకు పాజిటివ్‌

28 వరకు కార్యకలాపాల నిలిపివేత..

సిబ్బంది మొత్తానికీ పరీక్షలు


అమరావతి, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): హైకోర్టులో కరోనా కలకలం రేగింది. ఇద్దరు ఉద్యోగులకు పాజిటివ్‌ అని తేలడంతో హైకోర్టుతో పాటు, విజయవాడలో ఉన్న మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జిల యూనిట్‌లో ఈ నెల 28వరకు కార్యకలాపాలను నిలిపేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచనల మేరకు రిక్రూట్‌మెంట్‌ రిజిస్ట్రార్‌ గురువారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. అదేవిధంగా ఇటీవల బదిలీ ఉత్తర్వులు పొందిన వివిధ జిల్లాల జడ్జీలు రిలీవ్‌ అయ్యేందుకు, కొత్త పదవిలో బాధ్యతలు స్వీకరించేందుకు మరో 15రోజుల వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు గడువు పొడిగిస్తున్నట్లు మరో ప్రకటనలో పేర్కొన్నారు.


ఇదిలాఉండగా, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా హైకోర్టుకు చెందిన మొత్తం సిబ్బందికి, భద్రతా సిబ్బందికి కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా గురువారం మధ్యాహ్నం నుంచి సుమారు 300 మందికి పరీక్షలు చేశారు. శుక్రవారం కూడా ఈ పరీక్షలు కొనసాగనున్నట్లు కోర్టు వర్గాలు తెలిపాయి. అదేవిధంగా న్యాయమూర్తులకు సైతం పరీక్షలు జరుపనున్నారు. కాగా, బుధవారం మృతిచెందిన ఇన్‌చార్జ్‌ రిజిస్ట్రార్‌ జనరల్‌కు పాజిటివ్‌ అని ప్రచారం జరుగుతుండటంతో హైకోర్టు సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆయనతో సన్నిహితంగా ఉన్న వారంతా స్వీయ క్వారంటైన్‌కు వెళ్లినట్లు కోర్టు వర్గాలు తెలిపాయి. 

Updated Date - 2020-06-26T07:44:46+05:30 IST