స్నానమూ లేదు.. జల్లూ లేదు!

ABN , First Publish Date - 2020-11-21T08:40:22+05:30 IST

కరోనా కారణంగా తుంగభద్ర ఘాట్లలో పుష్కర స్నానాలకు అనుమతించబోమన్న రాష్ట్ర ప్రభుత్వానికి చాలావరకు భక్తులు సహకరించారు.

స్నానమూ లేదు.. జల్లూ లేదు!

సగం స్నానాలే భక్తులకు భాగ్యం.. సీఎం వచ్చివెళ్లగానే షవర్లు బంద్‌

కరోనాతో పిండప్రదానాలు, జల్లుకే అనుమతి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం

సహకరించిన భక్తులు.. కానీ, పిండ ప్రదానాలకూ అరకొర ఏర్పాట్లే

చాలా ఘాట్లలో కనిపించని బోర్డులు..ఐడీ కార్డులపై పురోహితుల ఆగ్రహం

తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం

ప్రహసనంలా తొలిరోజు తుంగభద్ర పుష్కరాలు 


కర్నూలు, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): కరోనా కారణంగా తుంగభద్ర ఘాట్లలో పుష్కర స్నానాలకు అనుమతించబోమన్న రాష్ట్ర ప్రభుత్వానికి చాలావరకు భక్తులు సహకరించారు. ఘాట్లలో ఏర్పాటుచేసిన షవర్ల వద్ద జల్లు స్నానం చేసి పెద్దలకు పిండ ప్రదానాలు చేసుకోవచ్చునంటే, సరేనని అంతవరకే పరిమితం అవుదామనుకొని వచ్చారు. కానీ, ఇంతగా పరిస్థితిని అర్థం చేసుకొని, ఎంతగానో సర్దుకొని పుష్కరాల విజయవంతానికి సిద్ధమయిన భక్తులకు అధికారులు మాత్రం ఏ కోశానా సహకరించలేదు. పలు ఘాట్లలో షవర్లు పనిచేయక జల్లు స్నానాల భాగ్యమూ చాలామంది భక్తులకు దక్కలేదు. పుష్కరాల్లో అతి ముఖ్య ఘట్టం పిండ ప్రదానం. అయితే, పిండ ప్రదానం చేసే ప్రాంతాన్ని సూచించే బోర్డులు లేకపోవడంతో.. ఆవేదనతో మనసులోనే పితృదేవతలను స్మరించుకొని కొందరు భక్తులు వెనుదిరిగారు.


తొలిరోజు పుష్కరం ఓ ప్రహసనంలా మిగిలిపోయిందన్న ఆవేదన ఎక్కువమంది భక్తుల్లో కలిగింది. పుష్కరాల మొదటిరోజు ఉదయం పుష్కర ఘాట్ల వద్ద కనిపించాల్సిన సందడి లేదు. భక్తులు లేక పలు ఘాట్లు శోభ కోల్పోయాయి. సీఎం వచ్చాక జనాలు వస్తారని అధికారులు అంచనా వేశారు. కానీ పరిస్థితుల్లో ఏమార్పూ కనిపించలేదు. ఒక్క వీఐసీ ఘాట్‌ వద్దే 300 పైగా భక్తులు కనిపించారు. వారిని కూడా సీఎం వెళ్లే వరకు పోలీసులు కిలోమీటరు దూరంలో నిలిపివేశారు. సీఎం వెళ్లిన 15 నిమిషాలకే వీఐపీ ఘాట్లోని షవర్లేవీ పనిచేయలేదు. దీంతో సగం తడిచిన దేహాలతో భక్తులు ఇబ్బందులు చవిచూశారు. తక్షణమే షవర్లలో నీళ్లను వదలాలని మైకులో సంబంధిత సిబ్బంది కోరుతుండటం రోజంతా వినిపిస్తూనే ఉంది. అధికారుల నుంచి మాత్రం స్పందన కరువయింది. కొంతమంది భక్తులు తమ వెంట తెచ్చుకున్న క్యాన్లు, ప్లాస్టిక్‌ బాటిళ్లతో నీళ్లు నింపుకొని స్నాహం ముగించామనిపించారు. రాఽఘవేంద్ర మఠం వద్ద కూడా షవర్లు పనిచేయలేదు. గొందిపర్ల, పంచలింగాల తదితర ఘాట్ల వద్ద షవర్లు మధ్య మధ్యలో మొరాయించాయి. 


పురోహితుల ఇక్కట్లు

పిండప్రదానాల నిర్వహణ కోసం విజయనగరం, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్‌ ప్రాంతాల నుంచి తుంగభద్ర పుష్కరాలకు వందలాది మంది పురోహితులు తరలివచ్చారు. అలా వచ్చిన వారిలో 300 మందికిపైగా గుర్తింపు కార్డులు అందించకపోవడంతో వారు ఘాట్ల వద్దే ఖాళీగా కూర్చున్నారు. కార్డులిచ్చిన పురోహితుల్లో అరకొర తప్ప అందరూ రాకపోవడంతో నాగసాయి టెంపుల్‌ ఘాట్‌ వద్ద జరిగిన పిండ ప్రదానం కార్యక్రమాల్లో నిండా ఐదుగురు పురోహితులూ లేరు. ఘాట్ల వద్ద పిండ ప్రదానాలు నిర్వహించే ప్రదేశాలపై సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ఎక్కడకు వెళ్లాలనేది భక్తులకు ఇబ్బందిగా మారింది. కేవలం ఈ-టిక్కెట్‌ ద్వారా టోకెన్లు తెచ్చిన వారికి మాత్రమే అనుమతిస్తున్నామని షిరిడీ సాయి టెంపుల్‌, నాగసాయి టెంపుల్‌ ఘాట్ల వద్ద వార్డు సచివాలయ ఉద్యోగులు చెప్పారు. చేసేది లేక కొందరు భక్తులు అరకొర జల్లు స్నానాలనంతరం పితృదేవతలకు మనసులో నమస్కారం చెప్పుకుని వెనుతిరిగారు. 


పుష్కర లాక్‌డౌన్‌

సీఎం రాకను పురస్కరించుకొని ఉదయం నుంచే సంకల్బాగ్‌ ఘాట్‌ పరిసరాల్లోని ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రానివ్వలేదు. ఎక్కడికక్కడ రోడ్లను బారికేడ్లతో మూసివేశారు. ఆ ఘాట్‌ పరిధిలోని నర్సింగరావు పేట, కొత్త పేట, ప్రకాశ్‌ నగర్‌లో 25వేల కుటుంబాలు నివాసముంటున్నాయి. వారెవరినీ బయటకు రానీయలేదు. దుకాణాలు తెరవాల్సిన వ్యాపారులు, విధులకు వెళ్లాల్సిన ఉద్యోగులు ఈ అనధికార లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడ్డారు. 


ఇంకా సా...గుతున్న పనులు

నాగాసాయి టెంపుల్‌ ఘాట్‌ వద్ద శుక్రవారం సాయంత్రం దాకా షవర్ల నిర్మాణాలే పూర్తి కాలేదు. ఈ ఘాట్‌లో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒకే పిండ ప్రదానం జరగడం విశేషం. 


ఉదయమే పుష్కరుడికి ఆహ్వానం..

అధికారికంగా శుక్రవారం మధ్యాహ్నం 1.21 గంటలకు పుష్కర స్నానాలకు ప్రభుత్వం సమయం నిర్ణయించింది. అయితే మంత్రాలయంలో ఉదయం 7.30 గంటలకే పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులుతో పాటు మఠం భక్తులు, అధికారులు స్నానాలాచరించారు. ఉత్సవమూర్తిని మఠం నుంచి ఊరేగింపుగా నదికి తీసుకొచ్చారు. అనంతరం సప్త నదుల నుంచి తీసుకొచ్చిన గంగా జలాలను మఠం ఘాట్ల వద్ద తుంగభద్రలో కలిపి, నూతనంగా ఏర్పాటుచేసిన గంగమ్మ నదీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం గంగమ్మకు పూజలు చేసి పుష్కర స్నానాలను ఆచరించారు. 9.30 గంటలకల్లా ఈ కార్యక్రమాలు ముగించుకుని మఠం సంబంధీకులు ఘాట్‌ నుంచి వెళ్లిపోయారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మంత్రాలయం మఠం ఘాట్లు పూర్తిగా వెలవెలబోయాయి. వినాయక, సంత మార్కెట్‌ ఘాట్లు మినహా మరెక్కడా జన సందోహం కానరాలేదు. అవి కూడా మధ్యాహ్నం నుంచి ఖాళీ అయ్యాయి. మంత్రాలయం, ఎమ్మిగనూరులో ప్రకటించిన ఘాట్లలో శుక్రవారం సాయంత్రం దాకా పుష్కర పనులు కొనసాగుతూ ఉండటంతో భక్తులు ఘాట్లలోకి వెళ్లలేదు. 


జల్లు స్నానాలన్నారు...ఏవీ ఎక్కడ?.. భాగ్యలక్ష్మి, భక్తురాలు, కర్నూలు

‘‘పుష్కరాలు అంటే కుటుంబ సమేతంగా వచ్చి స్నానాలాచరించి పెద్దలకు పిండ ప్రదానం చేసుకుంటుంటాం. గతంలో పలు పుష్కరాలు చూశాంకానీ, ఇలాంటి నీళ్లు రాని, స్నానాల్లేని పుష్కరాలు ఇప్పటిదాకా చూడలేదు. షవర్లలో నీళ్లు రావు. నదిలోకేమో వెళ్లనివ్వరు. పక్కనే ఉన్న అధికారులకు చెబితే పట్టించుకోవడంలేదు. ఇంకెందుకీ పుష్కరాలు?’’


హిందువుల మనోభావాలకు దెబ్బ: అల్లి చంద్రశేఖర శర్మ, బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు

‘‘ప్రవహించే నదిలో మునక వేస్తేనే పుష్కర పుణ్యం సిద్ధిస్తుంది. అసలు పుష్కరమంటేనే తీర్థ స్నానం, సంకల్పం, పిండ ప్రదానం. పిండ ప్రదానం అనేది స్నానమాచరించకుండా ఎవరూ చేయరు. వచ్చే భక్తులు ఆ ఉద్దేశంతోనే వస్తారు. అలాంటివారికి తలపై నీళ్లు చల్లుకోండి.. జల్లు స్నానాలు చేయండి అంటూ సీఎం జగన్‌ చెప్పడం హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే!’’


ఈ-టికెట్‌ తీసుకొన్నా దిక్కు లేదు : పసుమర్తి ఉమామహేశ్వరరావు, తిరువూరు, కృష్ణాజిల్లా

‘‘సుమారు 450 కిలోమీటర్ల దూరంలోని కృష్ణాజిల్లా నుంచి వచ్చాం. పిండ ప్రదానం చేసేందుకు పండితులు లేరని ఇక్కడి వచ్చాక తెలిసింది. ముందే ఆన్‌లైన్‌లో పిండ ప్రదానం చేసేందుకు టికెట్‌ బుక్‌ చేసుకున్నాం. అధికారులను అడిగితే పండితులు వస్తారని చెప్పి సుమారు గంటన్నర సేపు నిలబెట్టారు. స్నానాలు ఆచరించిన వెంటనే తడి వస్ర్తాలతో పిండ ప్రదానం చేస్తేనే పుణ్యం సిద్ధిస్తుంది. అయితే ఇక్కడ ఆ అవకాశం లేకుండా చేశారు. చివరికి అధికారులను నిలదీస్తే వేరే ఘాట్లకు వెళ్లాలని సలహా ఇచ్చారు’’

Updated Date - 2020-11-21T08:40:22+05:30 IST