‘తుంగభద్ర’ తూచ్‌!

ABN , First Publish Date - 2020-10-31T08:09:24+05:30 IST

‘తుంగభద్ర పుష్కరాలకు నిధులిచ్చాం. అయితే పుష్కర స్నానాలు మాత్రం చేయకండి’ అని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

‘తుంగభద్ర’ తూచ్‌!

పుష్కర స్నానాలు వద్దంటున్న ప్రభుత్వం 

కరోనా వ్యాప్తి అరికట్టడానికేనని సమర్థన

ఆన్‌లైన్‌ టైమ్‌స్లాట్‌ విధానానికి యత్నం? 

స్లాట్‌కు 25 మంది చొప్పున అనుమతులు 

కోట్లాది మంది భక్తుల్లో తీవ్ర అసంతృప్తి 

ఘాట్ల అభివృద్ధికి 52.91 కోట్లు విడుదల 

నేతల జేబులు నింపడానికేనని విమర్శలు 


(కర్నూలు-ఆంధ్రజ్యోతి): ‘తుంగభద్ర పుష్కరాలకు నిధులిచ్చాం. అయితే పుష్కర స్నానాలు మాత్రం చేయకండి’ అని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. కరోనా వ్యాప్తిని అరికట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతుండగా, పుష్కర ఘాట్ల అభివృద్ధికి విడుదల చేసిన రూ.52.91 కోట్లు ఎవరి జేబులు నింపడానికని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం హిందువుల మనోభావాలపై ప్రభావం చూపేలా ఉందని పలు హిందూ ధార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి. పుష్కరాలకు 37 రోజుల ముందు నిద్రలేచిన ప్రభుత్వం హుటాహుటిన నిధులు విడుదల చేసింది. తక్షణమే పనులు ప్రారంభించాలని కర్నూలు జిల్లా అధికారులపై ఒత్తిళ్లు తెచ్చింది. బిల్లులు వస్తాయో.. రావోనన్న సంశయంలో ఉన్న కాంట్రాక్టర్లను బతిమాలుకుని అధికారులు 10ు పనులు పూర్తిచేశారు. మరో 20 రోజుల్లో పుష్కరాలు ప్రారంభమవ్వాల్సిన తరుణంలో పుష్కర స్నానాలు చేయొద్దంటూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు అధికారులకు విసుగు తెప్పిస్తుండగా, ప్రజలకు అసహనం కలిగిస్తున్నాయి. కర్ణాటక, ఏపీలోని కర్నూలు, తెలంగాణలోని గద్వాల్‌ జిల్లాల్లో 12 ఏళ్ల్లకోసారి తుంగభద్ర పుష్కరాలు జరుగుతుంటాయి.


కర్నూలు జిల్లా కౌతాళం మండలం మేళగనూరు వద్ద ఈ నది రాష్ట్రంలోకి ప్రవేశిస్తోంది. కౌతాళం, నందవరం, సి.బెళగల్‌, కోసిగి, మంత్రాలయం, గూడూరు మండలాలతో పాటు కర్నూలు నగరం సహా 107కి.మీ. మేర తుంగభద్ర తీరప్రాంతం ఉంది. పుష్కరాల కోసం కోట్లాది మంది భక్తులు రావచ్చన్న అంచనాలతో ఈ నెల 13న పుష్కర ఘాట్ల నిర్మాణాలకు రూ.22.91కోట్లు, సౌకర్యాల కల్పనకు మున్సిపాలిటీలకు రూ.30కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. పుష్కరాల నాటికి భక్తులకు ఘాట్లు అందుబాటులో ఉంచుతామని అధికారులు చెబుతున్నారు. పనులు జరుగుతున్న క్రమంలో పుష్కర స్నానాలకు అనుమతి లేదన్న ప్రభుత్వ ప్రకటనతో విమర్శలు వస్తున్నాయి. 


ఆన్‌లైన్లో స్లాట్‌ బుకింగ్‌ 

పుష్కరాలకు వచ్చే కోట్లాది మంది భక్తులకు టైమ్‌స్లాట్‌ ఆధారంగా స్నానాలకు అనుమతించేలా ప్రయత్నాలు చేస్తామని కలెక్టర్‌ ఇటీవలే ప్రకటించారు. వృద్ధులు, చిన్నారులు పుష్కరాలకు రాకూడదన్నారు. ఒక్కో స్లాట్‌లో 25 మందిని స్నానాలకు పంపాలని, ఈ లోగా వచ్చినవారిని టెంట్లలో కూర్చోబెట్టేలా అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. కాగా, స్నానాలకు అనుమతుల్లేవంటూ ప్రభుత్వం నేరుగా ప్రకటించడంతో భక్తులు మండిపడుతున్నారు.  


ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం 

తుంగభద్ర పుష్కరాలపై ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేసింది. అధ్వాన స్థితిలో ఉన్న ఘాట్లు, స్నానాలకు అనుకూలంగా లేని వాతావరణం, వర్షాలకు కొట్టుకుపోయి గుంతలు పడ్డ రహదారులతో ఘాట్లు నిస్తేజంగా ఉన్నాయి. వాటిని పుష్కరాలకు అనుగుణంగా మార్చాలంటే ఏడాది ముందుగా పనులు ప్రారంభించాలి. పుష్కరాల ఏర్పాట్లపై స్పందించాలని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్‌తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు 2019 నవంబరు నుంచి మొత్తుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. పుష్కరాలకు 37 రోజులున్నాయనగా నిధుల విడుదల ప్రక్రియను ప్రారంభించింది. కేవలం నాయకుల జేబులు నింపేందుకే నిధులు విడుదల చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2020-10-31T08:09:24+05:30 IST