మలి విడతలో మరిన్ని!

ABN , First Publish Date - 2020-05-25T08:37:59+05:30 IST

తొలుత తక్కువ విలువ కలిగిన భూముల అమ్మకాలకు శ్రీకారం.. తద్వారా విపక్షాలు, భక్తుల స్పందన తెలుసుకునే ప్రయత్నం.. తదుపరి దశల్లో విలువైన ఇతర ఆస్తులకూ ఎసరు పెట్టడం.. ఇదీ శ్రీవారికి భక్తులు

మలి విడతలో మరిన్ని!

  • విలువైన భూములకు టీటీడీ ఎసరు 


తిరుపతి, మే 24 (ఆంధ్రజ్యోతి): తొలుత తక్కువ విలువ కలిగిన భూముల అమ్మకాలకు శ్రీకారం.. తద్వారా విపక్షాలు, భక్తుల స్పందన తెలుసుకునే ప్రయత్నం.. తదుపరి దశల్లో విలువైన ఇతర ఆస్తులకూ ఎసరు పెట్టడం.. ఇదీ శ్రీవారికి భక్తులు కానుకగా సమర్పించిన భూములను నిరర్థక ఆస్తుల పేరిట తెగనమ్మేందుకు టీటీడీ పాలక మండలి అమలు చేస్తున్న వ్యూహం. పనిలో పనిగా రిషీకే్‌షలోని అత్యంత ఖరీదైన ఆస్తులకూ మంగళం పలికేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. టీటీడీ ఆస్తులను బహిరంగ వేలంలో విక్రయించేందుకు సిద్ధపడటం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. విషయం వెలుగు చూసిన తొలిరోజే విపక్షాలు, భక్తులు విరుచుకుపడటంతో టీటీడీ వెనుకడుగు వేస్తుందని పలువురు భావించారు. అయితే పాలక మండలి చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి శనివారం స్పందించిన తీరు ఆస్తుల విక్రయాలపై దేవస్థానం ప్రయత్నాలు ఆపదల్చుకోలేదన్న సంకేతాలిచ్చింది. తొలి ప్రయత్నం కింద తమిళనాడులోని రూ.1.53కోట్ల విలువ చేసే 23 ఆస్తులను విక్రయించడానికి సిద్ధపడటం వెనుక వ్యూహం దాగివున్నట్టు కనిపిస్తోంది. టీటీడీ ఆస్తులను విక్రయించడానికి, లీజుకు ఇవ్వడానికి, తాకట్టు పెట్టడానికి తమకు పూర్తి అధికారాలున్నాయని ప్రకటించిన పాలకవర్గం.. ఆస్తుల విక్రయాలకు భూములను కేటగిరీలుగా విభజించింది. ఓ కేటగిరీ భూములను జిల్లాల కలెక్టర్ల ద్వారా, మరో కేటగిరీ భూములను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా, ఇంకో కేటగిరీ టీటీడీ స్వయంగా విక్రయించేలా నిర్ణయం తీసుకుంది.


మలిదశలో ఇలా....

టేబుల్‌-2 కింద చిత్తూరు జిల్లాలో ఐదు ఆస్తులు, గుంటూరు జిల్లాలో ఒకటి, పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు, శ్రీకాకుళం జిల్లాలో ఒకటి, అనంతపురం జిల్లాలో ఒకటి, కృష్ణాజిల్లాలో రెండు, కడప జిల్లాలో రెండు, తూర్పు గోదావరి జిల్లాలో ఒకటి, విజయనగరం జిల్లాలో ఒకటి చొప్పున మొత్తం 17 ఆస్తులను విక్రయించేందుకు ఎంపిక చేశారు.

టేబుల్‌-3 కింద నగర ప్రాంతాల్లోని విలువైన భూములను పేర్కొన్నారు. అందులో తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో మూడు, తమిళనాడులోని వేలూరు జిల్లాలో ఒకటి, పాండిచ్చేరిలో ఒకటి, మహరాష్ట్రలోని నాందేడ్‌లో ఒకటి, బెంగళూరు సమీపంలోని నేలమంగళం వద్ద ఒకటి, ఒడిశాలోని కోరాపుట్‌ జిల్లాలో ఒకటి, గుంటూరు నగరంలో ఒకటి చొప్పున మొత్తం 9 విలువైన ఆస్తులను చేర్చారు. వీటిని విశాఖపట్టణం కేంద్రంగా ఉన్న ఎంఎ్‌సటీసీ సంస్థ ద్వారా విక్రయించే ప్రయత్నాల్లో ఉన్నారు.

టేబుల్‌-4 కింద ప్రస్తుతం తమిళనాడులో గుర్తించిన ఆస్తుల వేలం తర్వాత వీటిపై దృష్టి సారించనున్నారు.


రిషీకేష్‌లోనూ అమ్మేద్దాం... 

ప్రముఖ పుణ్యక్షేత్రం రిషీకే్‌షలో ఆంధ్రా ఆశ్రమం పేరిట టీటీడీకి ఉన్న అత్యంత ఖరీదైన భూమిని విక్రయించే ప్రయత్నాలు మొదలయ్యాయి. గత  నవంబరు 11న ఈవో, సీనియర్‌ అధికారులు అక్కడికి వెళ్లి వచ్చారు. అక్కడ టీటీడీకి ఒకచోట 1.20ఎకరాలు, మరోచోట 7.05ఎకరాలు చొప్పున భూములున్నాయి. ఇపుడు 1.20 ఎకరాల భూమిలో మామిడి చెట్ల వల్ల చాలా తక్కువ ఆదాయం వస్తోందనే కారణం చూపుతూ దాన్ని తెగనమ్మేందుకు టీటీడీ ప్రతిపాదనలు సిద్ధంచేసింది. ఆ భూమిని అమ్మగా వచ్చిన డబ్బుతో 7.05 ఎకరాల భూమిలో రిషీకేష్‌, చార్‌ధామ్‌ యాత్రికులకు వసతి సముదాయాలు నిర్మిస్తామంటూ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 1.20ఎకరాల భూమికి దాదాపు రూ.18- 25కోట్ల వరకూ వస్తుందని టీటీడీ అంచనా వేసింది. టేబుల్‌ 2, 3, 4 కేటగిరీల్లోని భూములన్నీ అమ్మినా కూడా రూ.5కోట్ల మేరకే రావచ్చని, అదే రిషీకే్‌షలోని స్థలానికి ఐదురెట్లు ఎక్కువ వస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలు, నగరాల్లో భూములు కలిగి ఉండటం ఏ దేవస్థానానికైనా ప్రతిష్ఠాత్మకంగా భావించాల్సి ఉండగా, టీటీడీ దానికి విరుద్ధంగా ఆలోచిస్తుండటం భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. టీటీడీ చర్యలను వ్యతిరేకిస్తూ పలువురు ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం ఉంది. కోర్డుల ద్వారానైనా ఆస్తుల విక్రయాలు ఆగిపోతాయన్న ఆశాభావాన్ని భక్తులు వ్యక్తం చేస్తున్నారు. 


గత పాలకమండలి నిర్ణయమే: చెవిరెడ్డి

నిరర్థకంగా ఉన్న టీటీడీ భూములను వేలం వేసే ప్రక్రియ ఇప్పటిది కాదని, 1974 నుంచే ప్రారంభమైందని ప్రభుత్వ విప్‌, టీటీడీ ఎక్స్‌ అఫిషియో సభ్యుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి చెప్పారు. ఆదివారం ఆయన తిరుపతిలో మాట్లాడుతూ, 1974 నుంచి 2014వరకు 169 భూములను వేలం వేశారన్నారు. నిరర్థకంగా ఉన్న భూములను వేలంవేసే ప్రక్రియను వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రారంభించినట్టు, ఈ పాలకమండలి వచ్చాక భూములను విక్రయిస్తునట్టు మాట్లాడటం సరికాదన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్లలో సుమారు 100 స్థలాలను వేలం వేశారని, అప్పుడు ఎవరూ తప్పుబట్టలేదన్నారు. ప్రస్తుతం చర్చకు వస్తున్న భూములను వేలం వేయాలనే నిర్ణయం కూడా ఈ పాలకమండలి తీసుకున్నది కాదని, చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నియమించిన పాలకమండలి అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన తీసుకున్న నిర్ణయమని చెప్పారు. అప్పుడు తీర్మానాలన్నీ చేసి ఇప్పుడు తమను నిందిస్తారా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వానికి దేవుడంటే భక్తి, భయం రెండూ ఉన్నాయని, ఎప్పటికీ దేవుడితో రాజకీయం చేయబోమని స్పష్టం చేశారు. 

Updated Date - 2020-05-25T08:37:59+05:30 IST