వైసీపీ పాలనలో శ్రీవారికీ రక్షణ లేదు
ABN , First Publish Date - 2020-05-24T08:20:14+05:30 IST
టీటీడీ ఆస్తుల ను విక్రయించాలని వైసీపీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. ‘‘పంచభూతాలను దోచుకున్న అధికార పార్టీ కన్ను ఇప్పుడు...

దురుద్దేశంతోనే చర్యలు: టీడీపీ
టీటీడీ భూములమ్మితే ఊరుకోం: కన్నా
స్వరూపానంద, చినజీయర్ ఏరి: కాంగ్రెస్
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): టీటీడీ ఆస్తుల ను విక్రయించాలని వైసీపీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. ‘‘పంచభూతాలను దోచుకున్న అధికార పార్టీ కన్ను ఇప్పుడు తిరుపతి శ్రీవారి ఆస్తులపై పడింది’’ అని టీడీపీ ఎన్నారై సెల్ అధ్యక్షుడు కే బుచ్చిరామ్‌ప్రసాద్, టీటీడీ మాజీ సభ్యుడు ఏవీ రమణ అన్నారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘టీటీడీ ఆస్తులను వేలం వేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన సరైంది కాదు. దేవాలయాల ఆస్తులను అమ్మడానికి వీల్లేదని గతంలోనే హై కోర్టు తీర్పునిచ్చింది’’ అని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ అన్నారు. ‘‘వైసీపీ ప్రభుత్వం పాలన చేతకాక ప్రభుత్వ ఆస్తుల విక్రయానికి పాల్పడుతోంది. దేవస్థానం ఆస్తులను అమ్మడానికి ఇచ్చిన ఉత్తర్వుల ను తక్షణం ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి’’ అని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సాకే శైలజానాథ్ అన్నారు. ఇది మిషన్ బిల్ట్ ఏపీ కాదని... మిషన్ సెల్ ఏపీ మాత్రమేనని శైలజానాథ్ విమర్శించారు. ‘‘హిందూ ధర్మాన్ని కాపాడే శక్తులం మేమే.. అంటూ ప్రగల్భాలు పలికే బీజేపీ నేతలకు ఏపీలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఘనకార్యాలు కనిపించటం లేదా? స్వరూపానంద, చినజీయర్ ఎక్కడ దాక్కున్నారు?’’ అని కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ నిలదీశారు. టీటీడీ భూములు విక్రయించాలన్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సీఎం జగన్‌కు లేఖ రాశారు. అడ్డగోలుగా దేవుడి ఆస్తులు విక్రయించే అధికారం టీటీడీకి ఎక్కడిదని రాష్ర్టీయ బ్రాహ్మణ ఫ్రంట్ జాతీయ మహిళాధ్యక్షురాలు సాదినేని యామినీశర్మ ప్రశ్నించారు.