‘పెద్దన్న’ చేతికి పెత్తనం!?

ABN , First Publish Date - 2020-10-07T09:33:17+05:30 IST

హలో హలో అనుకుంటూ కలిసి మెలిసి సాగిన ఇద్దరు ‘బ్రదర్స్‌’ నీళ్లపై నిప్పులు కురిపించుకున్నారు. అపెక్స్‌ కౌన్సిల్‌ పేరిట కేంద్రం ‘పెద్దన్న’ పాత్ర పోషించగా...

‘పెద్దన్న’ చేతికి పెత్తనం!?

ప్రాజెక్టులపై సీఎంల కలహంతో కేంద్రం జోక్యం

గతంలో ఎప్పుడూ లేని సంప్రదాయం

ప్రాజెక్టులపై అభ్యంతరాలు మామూలే.. తెలుగు గంగకు ఇప్పటికీ అనుమతుల్లేవ్‌

‘పోలవరం’ ఇంకా పెండింగ్‌.. అనుమతుల్లేకుండానే ‘నర్మదా సరోవర్‌’ పూర్తి

ఆలమట్టిపై అభ్యంతరాలు పట్టించుకోని కర్ణాటక.. సీఎంల స్థాయిలో పరిష్కారాలు

నదీజలాలపై రాష్ట్రాలకే హక్కులు.. కేటాయింపులపై ట్రైబ్యునల్‌ మాటే ఫైనల్‌


‘బేసిన్లు, భేషజాలూ లేవు. కలిసి మెలిసి ఉందాం. నీళ్లు పంచుకుందాం’... అన్న కేసీఆర్‌ ఇప్పుడు ఆంధ్రా ప్రాజెక్టులపై కస్సుమన్నారు!


కాళేశ్వరం ప్రారంభోత్సవానికి హాజరై... గోదావరికి పూజ చేసిన జగన్‌... ‘మీ ప్రాజెక్టుకు అనుమతులెక్కడున్నాయి?’ అని ప్రశ్నించారు.


పిట్ట పోరు పిట్టపోరు పిల్లి తీర్చిందన్నట్లుగా... ఇద్దరు సీఎంలూ రెండు ప్రాజెక్టులను కేంద్రం చేతిలో పెట్టారు. అభ్యంతరాలపై కలిసి కూర్చుని మాట్లాడుకోవాల్సింది పోయి... పరస్పరం కలహించుకోవడంతో కేంద్రం ‘పెద్దన్న’ పాత్ర పోషించేందుకు సిద్ధమైంది.


(అమరావతి, ఆంధ్రజ్యోతి)

హలో హలో అనుకుంటూ కలిసి మెలిసి సాగిన ఇద్దరు ‘బ్రదర్స్‌’ నీళ్లపై నిప్పులు కురిపించుకున్నారు. అపెక్స్‌ కౌన్సిల్‌ పేరిట కేంద్రం ‘పెద్దన్న’ పాత్ర పోషించగా... ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ‘మనం మనం మాట్లాడుకుందాం’ అనే  పాత వైఖరిని పక్కనపెట్టి... విషయాన్ని కేంద్రం కోర్టులోకి నెట్టారు.  ఇది రెండు రాష్ట్రాలకూ మంచిది కాదని సాగునీటి రంగ నిపుణులు పేర్కొంటున్నారు. మంగళవారం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఆధ్వర్యంలో జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ వర్చువల్‌ సమావేశంలో ఏపీ సీఎం జగన్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొన్నారు. ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల సీఎంలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, ఫిర్యాదులు చేయడంతో... గజేంద్ర సింగ్‌ జోక్యం చేసుకుని, ఇరు రాష్ట్రాలూ ఆయా ప్రాజెక్టుల డీపీఆర్‌లు (సవివరమైన నివేదికలు) సమర్పించాలని, తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా వాటిని ఆపి వేయాలని స్పష్టం చేశారు. దీంతో, తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులను కేంద్రం తన ‘చేతుల్లోకి’ తీసుకున్నట్లయింది.


కొత్త సంప్రదాయం...

జల వివాదాలు సున్నితమైనవి. నీటిపై హక్కును వదులుకునేందుకు ఏ రాష్ట్రమూ సిద్ధపడదు. అందుకే... ఈ వివాదాలు దశాబ్దాలపాటు సాగుతూనే ఉంటాయి. తమిళనాడు, కర్ణాటక మధ్య కావేరీ జల వివాదం ఇందుకు ఉదాహరణ. నదీ జలాల విషయంలో రాష్ట్రాలకే పూర్తి హక్కు ఉంటుంది. కేంద్రానికి ఎలాంటి పెత్తనం ఉండదు. రెండు రాష్ట్రాల మధ్య తలెత్తే నదీ జలాల వివాదాల పరిష్కారం, కేటాయింపులపై ట్రైబ్యునల్‌ ఆదేశాలే ఫైనల్‌. సుప్రీం కోర్టు కూడా ఇందులో వేలు పెట్టేందుకు వీలు లేదు. బహుశా ఇప్పుడు మొట్టమొదటిసారిగా తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులపై కేంద్రం ఆధిపత్యం చెలాయించే అవకాశం కలుగుతోంది. నిజానికి... రాష్ట్రాల మధ్య జల వివాదాలు కొత్తేమీ కాదు. ఒక రాష్ట్రం చేపట్టిన ప్రాజెక్టుపై పొరుగు రాష్ట్రం అభ్యంతరాలు వ్యక్తం చేయడం షరా మామూలే. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు పరస్పరం చర్చించుకుంటూ వాటిని పరిష్కరించుకుంటూ.. ‘మధ్యేమార్గంగా’ ముందుకు సాగుతుంటారు.  ఇక... ‘అనుమతులన్నీ వచ్చాకే ప్రాజెక్టులు కట్టాలి’ అనేది కేవలం కాగితాలకే పరిమితమైన నిబంధన. అభ్యంతరాలు ఉన్నప్పటికీ, అనుమతులు రానప్పటికీ ప్రాజెక్టులూ కడుతూనే ఉంటారు. ఉదాహరణకు... 75 శాతానికిపైగా పూర్తయిన పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటికీ అనేక అనుమతులు రావాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుపై ఛత్తీ్‌సగఢ్‌, ఒడిసా అభ్యంతరాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినా ప్రాజెక్టు ఆగలేదు కదా! ఎప్పుడో ఎన్టీఆర్‌ మొదలుపెట్టిన తెలుగుగంగ ప్రాజెక్టుకు ఇప్పటికీ పర్యావరణ అనుమతులు రాలేదు. అయినా... ప్రాజెక్టు పూర్తయింది. జల సిరులు పంచుతోంది. వంశధారదీ అదే పరిస్థితి. ఒడిసా పరిధిలో ముంపును నివారించేందుకు రక్షణ గోడ నిర్మిస్తామని ఏపీ ప్రతిపాదించింది. భూమికి భూమిని పరిహారంగా ఇచ్చేందుకూ అంగీకరించింది. దీనిపై చర్చలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ప్రాజెక్టు నిర్మాణమూ కొనసాగుతోంది. గతంలో ఆలమట్టి డ్యామ్‌ ఎత్తుపై తలెత్తిన వివాదాన్ని ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చలతోనే పరిష్కరించుకున్నారు. ఎక్కడిదాకానో ఎందుకు! ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నర్మదా సరోవర్‌ ప్రాజెక్టుకూ పూర్తిస్థాయిలో అనుమతులు లభించలేదు. అయినా... దాని నిర్మాణం పూర్తి చేసి, జాతికి అంకితం చేసేశారు. వెరసి... అభ్యంతరాలు, అనుమతుల పేరిట ఏ రాష్ట్రమూ తమ ప్రాజెక్టులను ఆపడంలేదు. అలాగని... వాటిని కేంద్రం చేతుల్లో కూడా పెట్టడంలేదు.    తొలిసారిగా తెలుగు రాష్ట్రాలు ఈ పని చేశాయు.


అన్నీ కేంద్రం చేతిలో?

కృష్ణా, గోదావరిపై నిర్మించిన ప్రాజెక్టులన్నింటినీ ఆ రెండు బోర్డుల పరిధిలోకి తీసుకొస్తామని కేంద్రం ఇప్పుడు స్పష్టం చేసింది. త్వరలోనే గోదావరి, కృష్ణా బోర్డుల పరిధిపై నోటిఫికేషన్‌ జారీ చేస్తామని ముఖ్యమంత్రులకు తెలిపింది. అంటే... ప్రాజెక్టులను పరోక్షంగా కేంద్రమే ‘కంట్రోల్‌’ చేస్తుంది. ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించాలని కూడా కేంద్రం ఆదేశించింది. డీపీఆర్‌లను సమర్పించడమంటే... ఈ ప్రాజెక్టులన్నీ కొత్తవేనని అంగీకరించడమేనని జల వనరుల నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి... నదీ జలాల అంశంలో వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకునే అవకాశం ఉన్నప్పటికీ.. పెత్తనం కేంద్రానికి ఇవ్వడం ద్వారా రాష్ట్రాల విశేషాధికారాన్ని జారవిడుచుకున్నట్లయిందని జల వనరుల నిపుణులు ఆక్షేపిస్తున్నారు.

Updated Date - 2020-10-07T09:33:17+05:30 IST