రవాణా కిరికిరి!
ABN , First Publish Date - 2020-12-30T09:12:37+05:30 IST
తవ్వకం నుంచి ఇంటికి చేర్చడం వరకు ఇసుక సరఫరాలో ఎన్నెన్ని అంచెలు ఉన్నాయో, అన్నింటిలోనూ వినియోగదారుణ్ణి దోచేస్తున్నారు.

- ఇసుక 6,750.. రవాణా చార్జీ 24,043
- 10-12 కి.మీ. దూరంలోనే ఇసుక రీచ్
- 247 కి.మీ.కు రవాణాచార్జీ వసూల్
- పులివెందులలో ఓ రిటైర్డు ఉద్యోగికి
- ఏకంగా రూ.30,793కు ఆన్‌లైన్ రసీదు
- రాష్ట్రమంతా ఇదే రవాణా మాయ
- ‘లారీ’ ఖర్చంతా జనంపై బాదుడు
- గుంటూరులో ఇసుక రేటు ఘోరం
- మంచి ఇసుకకు అదనంగా వసూలు
- మొదలుపెట్టిన కట్టడం ఆపలేక
- కష్టమైనా కొంటున్న నిర్మాణదారు
పి.వెంకటరమణ రిటైర్డ్ ఉద్యోగి. సర్వీసు అంతా కడపలోనే పూర్తిచేసుకున్నారు.. రిటైరయ్యాక ఇచ్చే కొద్ది డబ్బులతో సొంత గ్రామం పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లిలో ఇంటి నిర్మాణం మొదలుపెట్టారు. పైకప్పు వేయాలని గత సోమవారం ఆన్‌లైన్లో 18 టన్నుల ఇసుక బుక్ చేశారు. ఆన్‌లైన్‌లోనే రూ.30,793 కట్టేశారు. తీరా రసీదు చూసి గొల్లుమన్నారు. వేంపల్లికి కేవలం 10-12 కి.మీల దూరంలోనే రీచ్ ఉంది. అయితే, డోర్ డెలివరీ చార్జీ 247 కిలోమీటర్లకు రూ.24,043 వేశారు. ఇసుక టన్ను రూ.375 ప్రకారం 18 టన్నులకు రూ.6,750 కలిపి మొత్తం రూ. 30,793 బాదేశారు. పోనీ చేసిన బుకింగ్‌ను రద్దు చేయాలని కడప జిల్లా శ్యాండ్ ఆఫీసుకు (డీఎ్‌సవో) వెళ్లి వెంకటరమణ వినతిపత్రం ఇచ్చారు. ‘సారీ..బుక్ చేయడమే తప్ప కేన్సిల్ ఆప్షన్ లేదు’ అని సిబ్బంది చెబుతున్నారట! నందిమండలం రీచ్ నుంచి ఇసుక తీసుకోవాలని వెంకటరమణ సెల్‌కు మెసేజ్ రావడం కొసమెరుపు!
(అమరావతి, కడప -ఆంధ్రజ్యోతి): తవ్వకం నుంచి ఇంటికి చేర్చడం వరకు ఇసుక సరఫరాలో ఎన్నెన్ని అంచెలు ఉన్నాయో, అన్నింటిలోనూ వినియోగదారుణ్ణి దోచేస్తున్నారు. కొన్నిచోట్ల ఇసుక ధరలు ఆకాశాన్నాంటితే, ఇంకొన్నిచోట్ల రవాణాలో గోల్‌మాల్, ఇంకోచోట మంచి ఇసుక కావాలంటే అదనంగా ముడుపులిచ్చుకోవాల్సిందే! వెరసి..అందినకాడికి దోచేయడం, వాటాలేసుకోవడమే కొత్త ఇసుక విధానం నీతిలా, సర్కారు రీతిలా మారిపోయింది! ఉదాహరణకు ఇసుకకు తీవ్ర కొరత నెలకొనడంతో తిరుపతిలో బ్లాక్‌లో ట్రాక్టరుకు రూ.7వేల వరకు పెట్టాల్సి వస్తోంది. ఇంతా చేస్తే అదీ వస్తుందా? రాదా? తెలీదు. ఆన్‌లైన్‌లో బుక్‌చేస్తే అదెప్పుడొస్తుందో తెలీని పరిస్థితి. దీంతో ఎంత డబ్బైనా పెట్టి వినియోగదారు మౌనంగా రోదిస్తూనే ఇసుకను కొనుక్కోవాల్సిన దుస్థితి. మరోవైపు గోదావరి జిల్లాల్లో ఇంకో రకం కుంభకోణం నడుస్తోంది. ఇసుకను తమకు దగ్గరున్న రీచ్‌నుంచే బుక్ చేసుకుంటారు. కానీ అక్కడ అందుబాటులో లారీ ఉండదు. దూరంగా ఎక్కడినుంచో లారీ అంటారు. ఆ దూరానికి రవాణా చార్జీ భారం వినియోగదారుపైనే వేసేస్తారు. ఇక్కడ బుక్ చేసుకున్నవారికి అక్కడినుంచి...అక్కడ బుక్ చేసుకున్నవారికి ఇక్కడినుంచి అన్న చందంగా లారీలు వెళ్తూ...ఆ దూరం మేరకు రవాణా చార్జీలు పిండేస్తున్నారు. వీటిలోనూ మళ్లీ వాటాలేసుకుని పంచేసుకుంటున్నారని సమాచారం. ఇక గుంటూరు జిల్లాలో మరోరకం దోపిడీ. ఆన్‌లైన్‌లో బుక్ చేసిన ధరకు తోడు మీకు కావాల్సినట్లుగా మంచి ఇసుక కావాలంటే టన్నుకు రూ.100 చదివించుకోవాల్సిందే. అంటే ఒక లారీకి 18టన్నులంటే 1800అదనంగా చెల్లించాలి. ఈ జిల్లాలో ఇసుక కొరతతో బ్లాక్‌లో బుకింగ్‌లకు డిమాండ్ పెరిగింది. మౌనంగా రోదిస్తూ ఆకాశాన్నంటిన ధరల్లో ఇసుకను కొనుగోలు చేస్తున్నామని ఒక వినియోగదారు వాపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది.
ఇంటికొచ్చేసరికి 30వేలట!
టన్ను ఇసుకకు ప్రభుత్వం ఖరారు చేసిన ధర రూ. 375. దీనికి రవాణా చార్జీలు అదనం. వాటినీ కలుపుకొంటే సుమారు రూ. ఏడు వందలు ఒక టన్నుకు వినియోగదారు చెల్లించాలి. ఒక ట్రాక్టర్ ద్వారా మూడు టన్నులు సరఫరా చేయొచ్చుననుకొంటే.. దాని ధర రూ. 2100 దాటకూడదు. అలాగే, ఒక లారీ ద్వారా 18 టన్నులు తరలించొచ్చనుకుంటే.. ఇంటికొచ్చేసరికి రవాణా ఖర్చులతో కలిపి రూ.12వేలు చిల్లర. అయితే, తీవ్ర ఇసుక కొరత వల్ల ఈ ధరలేవీ రీచ్‌ల్లో వినిపించడం లేదు. గుంటూరు జిల్లాలో నరసరావుపేట, సత్తెనపల్లి లాంటి చోట్ల ఇసుక కొరత తీవ్రంగా ఉంది. అక్కడ లారీ ఇసుకను రూ.30వేలుకు పైనే ఇచ్చి కొనాల్సిన పరిస్థితి నెలకొంది. కృష్ణా జిల్లాలో కూడా కొన్ని రీచ్‌లు ఆగి, కొన్ని రీచ్‌లు నడుస్తున్నాయి. ఇక్కడ ఇసుక లభ్యత బాగానే ఉంది. రేటు మాత్రం లారీకి రూ.20వేల వరకు చేరిపోయింది. ఇసుక మాఫియా పని ఇది.
కావాల్సిన ఇసుకకు రూ.100 అదనం
ఇసుకలో నైస్, దొడ్డు అనే రెండురకాలుంటాయి. సాధారణంగా గోడల నిర్మాణానికి దొడ్డు ఇసుకను వాడతారు. గోడల ప్లాస్టరింగ్, అదేవిధంగా స్లాబ్‌ల నిర్మాణం కోసం నైస్ అవసరం అవుతుంది. అయితే బుక్ చేసిన రీచ్‌లో ఏరకం శాండ్ ఉందో వినియోగదారుకు తెలియదు. తీరా బుక్ చేశాక అక్కడ స్లాబ్‌కు పనికొచ్చే ఇసుక లేదని తెలిస్తే మరో రీచ్‌కు మార్చుకోవచ్చు. అయితే ఇలా మార్చేందుకు ఇసుక మాఫియా టన్నుకు రూ.100 వసూలు చేస్తోంది. అంటే 18టన్నుల లారీకి రూ.1800 వసూలు చేస్తోంది. ఇప్పటికే పెరిగిన ఇసుక ధరలు, దానికి తోడైన రవాణా చార్జీలకు అదనంగా మళ్లీ ఈరకంగా సమర్పించుకోవాల్సి వస్తోంది. నైస్ శాండ్ లేకుంటే నిర్మాణానికి పనికిరాదు కాబట్టి చచ్చినట్లు కొనాల్సి వస్తోంది. భారమైనా ఇసుక మాఫియాకు ముడుపులు చెల్లించుకోవాల్సి వస్తోందని అంటున్నారు.